Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో మరో అరెస్టు
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:05 AM
నకిలీ మద్యం కేసులో 14వ నిందితుడి(ఏ-14)గా ఉన్న తలారి రంగయ్యను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఏ14 రంగయ్యను అరెస్టు చేసిన ఎక్సైజ్
2023 నుంచి 2 లక్షల‘నకిలీ’ లేబుళ్ల ముద్రణ
ఒక్కో షీట్‌కు రూ.45 చెల్లించిన అద్దేపల్లి
విజయవాడ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం కేసులో 14వ నిందితుడి(ఏ-14)గా ఉన్న తలారి రంగయ్యను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను విజయవాడలోని ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ర్టేట్ కోర్టులో ఆదివారం హాజరుపరచగా న్యాయాధికారి ఈ నెల 9వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం నెల్లూరులోని కేంద్ర కారాగారానికి తరలించారు. అద్దేపల్లి జనార్దనరావు సోదరులను అరెస్టు చేశాక ఎక్సైజ్ పోలీసులు తలారి రంగయ్యను నిందితుడిగా చేర్చారు. దీంతో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రంగయ్య హైకోర్టులో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది. ఈలోగా రంగయ్యను పోలీసులు అరెస్టు చేశారు.
అధిక ఆదాయం కోసం..
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన తలారి రంగయ్య ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నారు. తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్ నేర్చుకుని, హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో 2018 నుంచి ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేశారు. తర్వాత ‘ఆర్‌జే డిజైనర్స్ అండ్ ప్రింటింగ్’ పేరుతో డీటీపీ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు. తిరుమలశెట్టి శ్రీనివాసరావు అనే వ్యక్తి 2022లో రంగయ్యను కలిసి, నకిలీ మద్యం సీసాలపై అతికించేందుకు లేబుళ్లు డిజైన్ చేసి తయారు చేయాలని కోరారు. తొలుత రంగయ్య అంగీకరించలేదు. ఆ తర్వాత తర్వాత శ్రీనివాసరావు షీట్‌కు రూ.45 ఇస్తామని చెప్పడంతో ఒక్కో లేబుల్‌పై 70 పైసలు లాభం వస్తుండటంతో నకిలీ లేబుళ్లను డిజైన్ చేసి ముద్రించడానికి రంగయ్య తలూపారు.
మొదటి ఆర్డర్ 15 వేల లేబుల్స్
రంగయ్య నకిలీ లేబుళ్లు డిజైన్ చేయడానికి అంగీకరించాక మంజీర బ్రాండ్ లేబుళ్లు 15వేలు తయారు చేయాలని ఆర్డర్ ఇచ్చారు. డిజైన్ చేయడంతోపాటు బ్యాచ్ నంబరు, తయారు చేసిన తేదీని వాటిపై ముద్రించాలని చెప్పారు. డిపోల నుంచి సరుకు బయటకు వచ్చిన తర్వాత వాటి బ్యాచ్ నంబర్లు, తయారీ తేదీలను పరిశీలించి నకిలీ లేబుళ్లపై వాటిని ముద్రించేవారు. ఇలా తయారైన లేబుళ్లను అద్దేపల్లి జనార్దనరావు, తిరుమలశెట్టి శ్రీనివాసరావు అసలు లేబుళ్లను దగ్గర పెట్టుకుని పరిశీలించుకునేవారు. అసలు లేబుళ్లకు దగ్గరగా ఉన్న తర్వాత నకిలీ లేబుళ్లను ముద్రణ చేయించుకునేవారు. డిపోల నుంచి సరుకు బయటకు వచ్చాక ఎప్పటికప్పుడు బ్యాచ్ నంబర్లు, తయారీ తేదీలను గమనించి నకిలీ లేబుళ్లను తయారు చేసేవారు. మంజీర లేబుళ్లను ముద్రించిన తర్వాత ఆంధ్రా గోల్డ్ విస్కీ, ట్రోపికానా, రాయల్ లాన్సర్ బ్రాండ్లతో నకిలీ లేబుళ్లను ముద్రించారు. ఇవన్నీ 2023 నుంచి ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడే వరకు తయారు చేశారు. ఆర్‌జే డిజైనర్స్‌లో సుమారుగా 10-12 బ్యాచ్‌లకు సంబంధించిన 1.50 నుంచి 2 లక్షల నకిలీ లేబుళ్లను డిజైన్ చేసి ముద్రించారు. వాటికి సంబంధించిన ఆర్డర్లను తిరుమలశెట్టి శ్రీనివాసరావు ఇచ్చేవారు. తర్వాత నకిరికంటి రవి అనే వ్యక్తి ఒక ఆర్డర్‌కు సంబంధించి రూ.6,500ను రంగయ్యకు ఫోన్‌పే ద్వారా చెల్లించారు.
హైదరాబాద్‌లో అరెస్టు!
రంగయ్య తరఫు న్యాయవాది చేతన్ న్యాయాధికారి లెనిన్‌బాబు వద్ద తన వాదనను వినిపించారు. ఎక్సైజ్ పోలీసులు రంగయ్యను శనివారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేశారని తెలిపారు. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి విజయవాడలో అరెస్టు చేసినట్టు చూపించారని, రిమాండ్ రిపోర్టులోను ఆవిధంగా రాశారని వాదించారు. దీనిపై నిందితుడిని న్యాయాధికారి ప్రశ్నించారు. ఎక్కడ అరెస్టు చేశారని అడిగారు. తనను హైదరాబాద్‌లో అరెస్టు చేశారని నిందితుడు రంగయ్య జవాబు ఇచ్చారు. ఆవిధంగా వాంగ్మూలం ఇస్తావా.. అని అడిగారు. దీనికి రంగయ్య చెప్పలేనని సమాధానం ఇచ్చారు. నిందితుడు వాంగ్మూలం ఇవ్వకపోయినా తాను ఇస్తానని న్యాయవాది చేతన్ చెప్పారు. రంగయ్యను న్యాయాధికారి చాంబర్‌లోకి తీసుకురావడానికి ముందే ఎక్సైజ్ అధికారులు రిమాండ్ రిపోర్టు ఇచ్చి సంతకాలు చేయించుకున్నారని, కనీసం దాన్ని చదువుకునే సమయం ఇవ్వలేదన్నారు. పైగా తనను చాంబర్‌లోకి రాకుండా ఏపీపీ జి. రాధిక అడ్డుకున్నారని చెప్పారు. ఎఫ్‌ఐఆర్ కాపీ, నిందితుడి వాంగ్మూలం కాపీని ఇవ్వలేదని వాదించారు. దీంతో వాటిని అందజేయాలని న్యాయాధికారి లెనిన్‌బాబు ఏపీపీని ఆదేశించారు. ఇదిలావుంటే, ప్రతి కేసులో కొత్తగా గుర్తించిన నిందితులను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పుడు కోర్టులో యాడింగ్ మెమో దాఖలు చేస్తారు. రంగయ్య పేరును నిందితుడిగా చేర్చుతున్నట్టు యాడింగ్ మెమో రికార్డుల్లో కనిపించలేదు. దీంతో అప్పటికప్పుడు కంప్యూటర్ నుంచి ప్రింట్ తీసుకుని హడావుడిగా దాఖలు చేశారు.