Cyber Police: చంద్రబాబు పేరుతో ఫేక్ ప్రకటన
ABN , Publish Date - Jul 29 , 2025 | 06:08 AM
సామాన్యుల్ని లక్ష్యంగా చేసుకుని రోజుకో కొత్త రకం మోసానికి పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లు.. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎంచుకున్నారు.
రూ.22వేల పెట్టుబడితో భారీ లాభాలంటూ నకిలీ వీడియో
ఇలాంటివి నమ్మొద్దంటున్న సైబర్ పోలీసులు
అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): సామాన్యుల్ని లక్ష్యంగా చేసుకుని రోజుకో కొత్త రకం మోసానికి పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లు.. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎంచుకున్నారు. టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించొచ్చు అంటూ నిరంతరం యువతను ప్రోత్సహించే చంద్రబాబు గతంలో పలు చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయి తే, ఇలా ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబు మాట్లాడిన మాటలను సైబర్ నేరగాళ్లు వక్రీకరించి నకిలీ వీడియోను సృష్టించారు. ‘22వేల రూపాయలు పెట్టుబడి పెట్టండి.. ఫోన్ ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం పొందండి’ అని చంద్రబాబు చెబుతున్నట్లు ఫేక్ వీడియో సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈనకిలీ వీడియోతో చంద్రబాబుకు ఎలాంటి సంబంధమూ లేదని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఇలానే ప్రధాని మోదీ పేరుతో ‘500పెట్టుబడి పెట్టండి.. 5వేలు లాభం పొందండి’ అంటూ ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నించిన సైబర్ నేరగాళ్లు, రతన్ టాటా ఉచితంగా పదివేలు ఇస్తున్నారని, బిట్ కాయిన్‌లో పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించాలంటూ షారుక్, అమితాబ్ పేరిట నకిలీ వీడియోలు సృష్టించారని తెలిపారు. ఇలాంటి నకిలీ ప్రకటనలు నమ్మి మోసపోవద్దని ఏపీ సైబర్ క్రైమ్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ ప్రజలకు సూచించారు. సైబర్ మోసగాళ్లను పట్టుకుంటామన్నారు.