Share News

Fake Gold Loan Racket Busted by Alert Bankers: బ్యాంకర్లనే బురిడీ కొట్టిద్దామని..

ABN , Publish Date - Dec 11 , 2025 | 03:55 AM

రైతుల ముసుగులో రుణం కోసం బ్యాంకుకు వచ్చారు. నకిలీ బంగారం ఇచ్చి రుణం తీసుకోవడానికి ప్రయత్నించారు. వారి వాలకం చూసి బ్యాంకర్లకు అనుమానం వచ్చింది. ఆరా తీస్తే అసలు బండారం ......

Fake Gold Loan Racket Busted by Alert Bankers: బ్యాంకర్లనే బురిడీ కొట్టిద్దామని..

  • స్థానిక రైతులకు కమీషన్‌ ఆశ చూపి..

  • పట్టాదారు పాసుపుస్తకాలపై రుణానికి యత్నం

  • అనుమానంతో ఆరా తీసిన బ్యాంకర్లు

  • వెంటనే పోలీసులకు సమాచారం

  • శ్రీసత్యసాయి జిల్లా పోలీసుల అదుపులో ఏడుగురు

గోరంట్ల, ఓబుళదేవరచెరువు, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): రైతుల ముసుగులో రుణం కోసం బ్యాంకుకు వచ్చారు. నకిలీ బంగారం ఇచ్చి రుణం తీసుకోవడానికి ప్రయత్నించారు. వారి వాలకం చూసి బ్యాంకర్లకు అనుమానం వచ్చింది. ఆరా తీస్తే అసలు బండారం బయటపడింది. బ్యాంకర్లు చాకచక్యంగా వ్యవహరించి ఆ ముఠాను పోలీసులకు పట్టించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల, ఓబుళదేవరచెరువు మండల కేంద్రాల్లో కర్ణాటకకు చెందిన ముఠా నకిలీ బంగారం ఆభరణాలతో బ్యాంకర్లను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసింది. స్థానిక రైతులకు కమీషన్‌ ఇస్తామని ప్రలోభపెట్టి, వారి పట్టాదారు పాసుపుస్తకాలపై ఈ ముఠా బంగారం రుణాలను తీసుకుంటున్నట్లు పోలీసులు, బ్యాంకర్లు గుర్తించారు. కర్ణాటకకు చెందిన నలుగురు ముఠా సభ్యులు, వాహన డ్రైవర్‌, శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


ఇద్దరిద్దరుగా విడిపోయి..

బెంగళూరు యలహంక ప్రాంతానికి చెందిన శంకర్‌, నంజుండప్ప, నగేష్‌, రఘు ముఠాగా ఏర్పడ్డారు. ఇద్దరు చొప్పున విడిపోయి మంగళవారం నాడు ఒక ఇద్దరు గోరంట్లకు, మరో ఇద్దరు ఓబుళదేవరచెరువుకు వెళ్లారు. గోరంట్లకు చెందిన రైతు శంకరప్పకు కమీషన్‌ ఆశ చూపి అతని పేరుపై ఉన్న పట్టాదారు పాసు పుస్తకంపై 16 తులాల బంగారం ఆభరణాలను తాకట్టు పెట్టుకోవాలని కోరారు. రైతును తీసుకుని గోరంట్ల స్టేట్‌ బ్యాంకుకు వెళ్లారు. వారు ఇచ్చిన బంగారాన్ని పరిశీలించిన బ్యాంకు అధికారులకు.. అది నకిలీదని అనుమానం వచ్చింది. కర్ణాటక వాసులను బయటకు పంపి, శంకరప్పను నిలదీశారు. దీంతో బంగారం తనది కాదని, కమీషన్‌ కోసం వచ్చానని రైతు చెప్పడంతో బ్యాంకు అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే బ్యాంకు తలుపులు మూసివేసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ముగ్గురినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఓబుళదేవరచెరువుకు వెళ్లి మరో ఇద్దరి బండారం బయటపడింది. దొరికిన ముఠా సభ్యులను పోలీసులు వెంటనే తమ వాహనంలో ఎక్కించుకుని ఓబుళదేవరచెరువుకు తీసుకెళ్లారు. ఈలోగా బ్యాంకు అధికారులు ఓబుళదేవరచెరువు బ్రాంచికి సమాచారం ఇచ్చారు. అక్కడి బ్యాంకు అధికారులు కూడా ప్రధాన ద్వారాలను మూసివేసి, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటు గోరంట్ల, ఇటు స్థానిక పోలీసులు ఓబుళదేవరచెరువు బ్యాంకుకు చేరుకుని, ముఠా సభ్యులు నగేశ్‌, రఘు, డబురువారిపల్లికి చెందిన రైతు జయప్ప, ముఠా సభ్యుల కారు డ్రైవర్‌ ముక్తియార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓబుళదేవరచెరువులో 280 గ్రాముల నకిలీ బంగారాన్ని తాకట్టుపెట్టడానికి ప్రయత్నించారు. వీరు తెచ్చిన ఆభరణాల లోపల మైనం వంటి పదార్థాన్ని ఉంచి, బరువు పెంచినట్లు గుర్తించా రు. నిందితులందరినీ పెనుకొండ పోలీసు సబ్‌ డివిజన్‌ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. గోరంట్లలో ముగ్గురిపై, ఓబుళదేవరచెరువులో మిగతావారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెలలో ఈ ముఠా ఓబుళదేవరచెరువులోని ఎస్‌బీఐలో ఇదే తరహాలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.30 లక్ష లు రుణం తీసుకున్నట్లు పోలీసు విచారణలో తేలింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని గోరంట్ల, ఓబుళదేవరచెరువు ఎస్‌ఐలు రామచంద్ర, మల్లికార్జునరెడ్డి తెలిపారు.

Updated Date - Dec 11 , 2025 | 03:55 AM