Misleading Information: ఆ జీవో ఫేక్
ABN , Publish Date - Aug 30 , 2025 | 05:14 AM
ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనపై మంత్రుల కమిటీని నియమించినట్లుగా ఫేక్ జీవో తెరపైకి వచ్చింది.
పీఎస్‌యూలలో 65 ఏళ్లకు రిటైర్మెంట్‌పై మంత్రుల కమిటీ అంటూ మాయ
ఒరిజినల్ జీవోలో మార్పులు చేసి ఫేక్ సృష్టి
అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనపై మంత్రుల కమిటీని నియమించినట్లుగా ఫేక్ జీవో తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఇది తెగ తిరుగుతోంది. నిజానికి... ఆయా సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమనూ 62 ఏళ్ల వరకు సర్వీసులో కొనసాగించాలని కార్పొరేషన్లు, సొసైటీలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ)ఉద్యోగులు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమిస్తూ వారం కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే... ఆ ఉత్తర్వులో ‘60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు’ అనే అంకెలను ‘62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు’ అని మార్చుతూ ఫేక్ జీవో ఒకటి సృష్టించారు. శుక్రవారం ‘జీవో నంబరు 1575’ జారీ అయినట్లుగా పక్కాగా రూపొందించారు. అయితే... జీవో నంబరు 1575 ఇతర అంశానికి సంబంధించింది. కేవలం ఉద్యోగులను గందరగోళంలోకి నెట్టేందుకే ఈ ఫేక్ జీవో సృష్టించారని... ఇది సంబంధిత వ్యవహారాలు బాగా తెలిసినవారి పనే అని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి.