Guntur District: ఈడీ పోలీసులమంటూ.. దారి దోపిడీ
ABN , Publish Date - Aug 06 , 2025 | 06:12 AM
దోపిడీలకు పాల్పడడంలో కేటుగాళ్లు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఈడీ పోలీసులమంటూ బెదిరించి.. ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.70 లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు సమీపంలో...
కారును అడ్డగించిన కేటుగాళ్లు
బెదిరించి రూ.70 లక్షలున్న బ్యాగ్‌తో పరార్
స్నేహితుడి వద్ద బంగారం కొనుగోలుకు నగదు తెచ్చుకున్న బాధితుడు
దోపిడీ జరిగాక ఆ స్నేహితుడికి ఫోన్ చేసినా లేని స్పందన
గుంటూరు జిల్లా మేడికొండూరులో ఘటన
మేడికొండూరు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): దోపిడీలకు పాల్పడడంలో కేటుగాళ్లు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఈడీ పోలీసులమంటూ బెదిరించి.. ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.70 లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాకు చెందిన మాణిక్ జగదీశ్, రంజిత్ మారుతి పటేల్ అనే ఇద్దరు రాజమహేంద్రవరంలోని నగలు తయారీ దుకాణాలలో కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం జగదీష్ విజయవాడలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రంజిత్ తన వద్ద రెండు కేజీల ముడి బంగారం ఉందని, దానిని కేజీ రూ.58 లక్షలకు విక్రయిస్తానంటూ జగదీశ్‌కు తెలిపాడు. ఆ ముడి బంగారం కొనేందుకు డబ్బుతో సత్తెనపల్లి రావాలని జగదీశ్‌ను రంజిత్ కోరాడు. జగదీష్ తన వద్ద ఉన్న రూ.70 లక్షలతో కారులో సత్తెనపల్లికి వచ్చి.. ఆ డబ్బును రంజిత్‌కు చూపించాడు. రంజిత్ వద్ద ఉన్న ముడి బంగారాన్ని జగదీశ్ చూసి నిర్ధారించుకున్నాడు. అయితే బంగారం తూకం కోసం ఇద్దరూ మాట్లాడుకుని విజయవాడతో తూకం వేయడానికి బయలుదేరారు. వీరి రెండు కార్లు ఒకదాని వెంట ఒకటి వస్తున్న క్రమంలో.. వెంబడిస్తూ ఫార్చ్యూనర్ కారులో వచ్చిన ఆరుగురు వ్యక్తులు మేడికొండూరు సమీపంలోని ఈద్గా వద్ద జగదీష్ కారును అడ్డగించారు. తాము ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పోలీసులమని, మీ కారుని తనిఖీ చేయాలని చెప్పారు. వారిలో ఇద్దరు పోలీసు దుస్తులు ధరించి ఉండటంతో నిజంగానే పోలీసులని భావించిన జగదీష్ తన కారు డోరు తెరిచాడు. కారులో ఉన్న డబ్బుల బ్యాగును తీసుకొని రేపు ఈడీ ఆఫీ్‌సకి వచ్చి ఫిర్యాదు చేయాలని వెళ్లిపోయారు. ముడి బంగారం ఉన్న రంజిత్‌ను తమతో రావాలని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. అనంతరం రంజిత్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో వచ్చింది దొంగలేనని, పథకం ప్రకారం డబ్బు దోచుకుపోయారని భావించిన జగదీశ్ మేడికొండూరు పోలీసులను ఆశ్రయించాడు.