Fake Credit to Tilak Varma in YSRCP: కష్టం తిలక్‌వర్మది క్రెడిట్ జగన్‌ది..!
ABN , Publish Date - Oct 02 , 2025 | 04:10 AM
నవ్విపోదురు గాక నాకేంటి... అన్నట్టుగా వైసీపీ సోషల్ మీడియా వ్యవహారం ఉంది. గిట్టనివారిపై బూతు పోస్టులు పెట్టడమైనా, వైసీపీ అధినేత జగన్‌ను ....
అధినేతను కీర్తించబోయి అభాసుపాలైన వైసీపీ సోషల్ మీడియా
తిలక్‌వర్మను జగనే ప్రోత్సహించారట.. ఆడుదాం ఆంధ్రాలో చాన్స్
ఇంకా జగన్ షీల్డ్ కూడా అందజేత
పొడుగ్గా ఉన్న వర్మ జగన్ కంటే పొట్టిగా ఉన్నట్టు మార్ఫింగ్ ఫొటో
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
నవ్విపోదురు గాక నాకేంటి... అన్నట్టుగా వైసీపీ సోషల్ మీడియా వ్యవహారం ఉంది. గిట్టనివారిపై బూతు పోస్టులు పెట్టడమైనా, వైసీపీ అధినేత జగన్‌ను ఆకాశానికి ఎత్తేసేలా లేనిపోని గొప్పలకు పోవడమైనా.. ఏదైనా సరే తనకు తానే సాటి! తాజాగా జగన్‌ను కీర్తించే క్రమంలో ఆయన పరువు తీసేలా తప్పులో కాలేసింది. పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ 69 పరుగులతో అద్భుతంగా రాణించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని ఆసియా కప్ హీరో తిలక్ వర్మ క్రెడిట్‌ను జగన్ ఖాతాలో వేసేలా ఫేక్ ప్రచారానికి తెరలేపి అభాసుపాలైంది. తిలక్ వర్మను జగనే ప్రోత్సహించారని, దేశానికి గొప్ప క్రికెటర్‌ను అందించారని వైసీపీ సోషల్ మీడియా ఎలివేట్ చేసింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2023 డిసెంబరులో ప్రారంభమైన ‘ఆడుదాం ఆంధ్రా’లో తిలక్ వర్మకు అవకాశం ఇచ్చారని ఓ పోస్టు పెట్టారు. అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి హోదాలో జగన్.. తిలక్‌వర్మకు షీల్డ్ ఇస్తున్నట్లుగా కూడా ఫొటో కూడా జత చేశారు. ఇక్కడే వైసీపీ సోషల్ మీడియా అడ్డంగా దొరికిపోయింది. చూడటానికి తిలక్ వర్మ పొడుగ్గా ఉంటారు. తిలక్‌వర్మ ఎత్తు 5 అడుగులా 11 అంగుళాలు. అతడు జగన్ కంటే ఎత్తుగా ఉంటారు. జగన్ ఎత్తు 5 అడుగులా 4 అంగుళాలు మాత్రమే. కానీ ఫొటోలో తేడా కొడుతోంది! జగన్ పక్కన నిల్చున్న తిలక్ వర్మ ఆయన కంటే పొట్టిగా కనిపిస్తున్నారు! పొడుగ్గా ఉన్న మనిషి పొట్టిగా ఎలా మారారు? ఈ ఫొటో చూసినవారికి ఇదే సందేహం వచ్చింది.
ఇక్కడే అసలు విషయం బయటపడింది. జగన్‌కు లేనిపోని గొప్పలు ఆపాదించడానికి వైసీపీ సోషల్ మీడియా ఫేక్ ఫొటో సృష్టించి పోస్టు చేసింది. అంతేకానీ... ‘ఆడుదాం ఆంధ్రా’లో తిలక్ వర్మ ఆడిందీ లేదు.. జగన్‌తో షీల్డ్ అందుకున్నదీ లేదు. వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ఫేక్ ప్రచారంలో ఇది పరాకాష్ఠ. వాస్తవం ఏమిటంటే.. తిలక్‌వర్మ 2019లో దక్షిణాఫ్రికాలో అండర్-19 క్రికెట్ ఆడారు. ఆ తర్వాత 2022లో ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనూ ఆడారు. ఐపీఎల్‌లో సిక్స్‌లు, ఫోర్లతో మెరిసి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందారు. ఆడుదాం ఆంధ్రాను 2023 డిసెంబరు 23న ప్రారంభించారు. అంటే.. అప్పటికే తిలక్ వర్మ జాతీయ స్థాయిలో క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. తిలక్‌వర్మను జగనే ప్రోత్సహించారంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫేక్ ఫొటో గుట్టును టీడీపీ, జనసేన కార్యకర్తలు రట్టు చేశారు. ఈ ఫొటో మార్ఫింగ్ అని తేల్చేశారు. ఈ ఫొటోలో ఉన్న అసలు వ్యక్తిని కూడా బయటపెట్టారు. దీంతో వైసీపీ ఇచ్చుకున్న ఎలివేషన్ అంతా తుస్సుమంది.