YCP Cheap Tricks: పింఛన్‌పై వైసీపీ చీప్ ట్రిక్స్.. అడ్డంగా బుక్కైయ్యారు!
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:13 AM
నిత్యం ఏదో ఒకవిధంగా కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేయడం కోసం వైసీపీ ఫేకులు కట్టుకథలు అల్లుతున్నారు. ఇందుకు ప్రతి సందర్భాన్నీ ముడిసరుకుగా వాడుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ విషం
దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై అసత్యాలు
చెయ్యి ఉన్నా లేనట్టు నటిస్తూ వీడియో
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త డ్రామా
సహజ మరణాలూ ‘తొలగింపు’ ఖాతాలోకే
జగన్ రోత పత్రికలో కట్టు కథలు
కూటమి ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యం
నిన్నటిదాకా అమరావతి.. నేడు పింఛన్లపై..
అమరావతి మునిగిపోయిందంటూ.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఊడిపోయి విజయవాడ నగరం కూడా మునిగిపోతుందంటూ నిన్నటి వరకు అసత్య కథనాలు ప్రచారం చేశారు.
ఇప్పుడు మరింత బరితెగించారు. అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్నా.. చేతులూ, కాళ్లూ లేని దివ్యాంగులుగా చూపుతూ అన్యాయంగా పింఛన్లు తీసేస్తున్నారంటూ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారు.
వైసీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విషం చిమ్ముతున్నారు. వైసీపీ రోత మీడియా, దాని అనుకూల మీడియా ఈ ఫేక్ ప్రచారానికి వంత పాడుతున్నాయి. ప్రభుత్వంపై బురదజల్లడంతో పాటు ప్రజల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
నిత్యం ఏదో ఒకవిధంగా కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేయడం కోసం వైసీపీ ఫేకులు కట్టుకథలు అల్లుతున్నారు. ఇందుకు ప్రతి సందర్భాన్నీ ముడిసరుకుగా వాడుకుంటున్నారు. తాజాగా దివ్యాంగ పింఛన్ల తొలగింపు అంశాన్ని వక్రీకరిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను చేతులూ, కాళ్లూ లేని దివ్యాంగులుగా చూపుతూ, కూటమి ప్రభుత్వ నిర్వాకంతో పింఛన్లు పోయాయంటూ వీడియోలు చిత్రీకరించి జనంలోకి వదులుతున్నారు. సహజ మరణం చెందిన వారినీ పింఛన్ల తొలగింపుతో గుండె ఆగి చనిపోయినవారిగా చూపుతూ జగన్ రోత మీడియా కథనాలు వండివారుస్తోంది. వాస్తవానికి వైసీపీ హయాంలో అర్హులు కాకపోయినా ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు భారీగా పింఛన్లు ఇచ్చారు. అప్పట్లో సుమారు 2 లక్షల మందికి దివ్యాంగ పింఛన్లు ఇవ్వగా, వీరిలో అధికశాతం బోగస్ సదరం సర్టిఫికెట్లతో పింఛన్లు పొందినవారే. ప్రస్తుతం ఈ పింఛన్లకు సంబంధించి వెరిఫికేషన్ జరుగుతోంది.
సుమారు 80 వేలమంది బోగస్ సదరం సర్టిఫికెట్లతో పింఛన్లు పొందినట్లు గుర్తించారు. అయితే అనర్హులను మాత్రమే తొలగిస్తామని, అర్హులకు ఒక్కరికి కూడా పింఛన్ ఆపబోమని కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ వాస్తవాన్ని మరుగుపర్చి వైసీపీ నేతలు, జగన్ మీడియా, వైసీపీ అనుకూల మీడియా పింఛన్ల తొలగింపుపై అసత్య ప్రచారాలకు తెరదీశాయి.
జగన్ పత్రిక రోతరాతలు
జగన్ రోత పత్రికలో 20వ తేదీన ‘పింఛన్ల కకావికలం’ శీర్షికన ప్రధాన కథనం ప్రచురించారు. అందులో కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదపూడికి చెందిన మేడం లక్ష్మి అనే మహిళ దివ్యాంగ పింఛన్ తొలగించిన కారణంగా మరణించినట్టు రాశారు. వైసీపీ హయాంలో ఒంటరి మహిళ పింఛన్ పొందిన లక్ష్మి.. ఆ తర్వాత కంటి చూపు మందగించడంతో 60 శాతం వైకల్యం ఉన్నట్టు సదరం సర్టిఫికెట్‌తో దివ్యాంగుల పింఛన్ పొందింది. కూటమి ప్రభుత్వం ఇటీవ ల నిర్వహించిన వెరిఫికేషన్‌లో ఆమెకు 40 శాతం మాత్రమే చూపు మందగించిందని పేర్కొంటూ అనర్హురాలిగా తేల్చారు. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ నెల 18న మృతిచెందింది. అయితే జగన్ మీడియా పింఛన్ తొలగింపుకారణంగానే మరణించిందంటూ ప్రచారం చేసింది.
ప్రతీ పథకంపైనా తప్పుడు ప్రచారమే
కూటమి ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని ప్రారంభించినా వైసీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా అసత్య ప్రచారాలకు తెరదీస్తోంది. తల్లికి వందనం పథకా న్ని ప్రారంభించినప్పుడు లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత పెట్టారంటూ ఓసారి.. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదంటూ మరోసారి అస త్య ప్రచారాలు చేశారు. పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ విషయంలోనూ వైసీపీది ఇదే అక్కసు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని రూ.1000 పెంచింది. ఇదే వెయ్యి రూపాయల పెంపునకు వైసీపీ సర్కారు నాలుగేళ్ల సమయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంతమందికీ వర్తింపజేసింది. గత వైసీపీ ఓ ఇంట్లో కేవలం ఒక్కరికే ఇచ్చింది. ఇలా వైసీపీ సర్కారు కన్నా కూటమి ప్రభుత్వం ఎక్కువ సంక్షేమాన్ని ఇస్తూనే, మరోవైపు అభివృద్ధి పనులనూ పరుగులెత్తిస్తోంది. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోంది.