Home Minister Anita: వైసీపీ పాలనలో ప్రశ్నిస్తే చంపించారు
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:31 AM
వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ కక్షపూరిత రాజకీయాలు చేశారు. అనేకమందిపై అక్రమంగా కేసులు పెట్టించారు. ప్రశ్నిస్తే చంపించారు అని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
జగన్‌వి కక్షపూరిత రాజకీయాలు: మంత్రి అనిత
పెదకూరపాడు, జూలై 18(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ కక్షపూరిత రాజకీయాలు చేశారు. అనేకమందిపై అక్రమంగా కేసులు పెట్టించారు. ప్రశ్నిస్తే చంపించారు’ అని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కంభంపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనిత మాట్లాడుతూ... ‘జగన్ పేరు చెబితే గంజాయి బ్యాచ్, గొడ్డలి వేటు, కోడికత్తి, చర్లపల్లి జైలు, బూతులు గుర్తుకు వస్తాయి. చంద్రబాబు పేరు చెబితే పోలవరం, అమరావతి అభివృద్ధి గుర్తుకు వస్తాయి. జగన్ లాంటి దుర్మార్గులు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఉండరు. ఉద్యోగులు పని చేయాల్సిన అవసరం ఉండదు. మనం అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. వైసీపీ వారు తప్పులు చేసిన దానికే శిక్షపడే పరిస్థితి వస్తుంది. ఇంకా జైలుకు వెళ్లాల్సిన వారు చాలామంది ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తీసుకొని వెళ్లడానికి అంబులెన్స్ రావడానికి ఆలస్యం అవుతుండడంతో మంత్రి సత్యకుమార్ తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అదే జగన్మోహన్‌రెడ్డి... వైసీపీ కార్యకర్త తన కారు కింద పడితే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు. ఫ్యాక్షన్ రాజకీయాలను, నక్సలిజాన్ని అణిచేసి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసిన 75 ఏళ్ల యువకుడు చంద్రబాబు’ అని మంత్రి అనిత అన్నారు.