రూ.10 కోట్ల విలువైన భవనంపై కన్ను!
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:47 AM
మహిళా సంఘానికి రాజేంద్రనగర్‌లో ఉన్న రూ.10 కోట్ల విలువ చేసే మూడు అంతస్తుల పాఠశాల భవనాన్ని లీజు పేరుతో చేజిక్కించుకునేందుకు గుడివాడకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ యజమాని ఒకరు కుట్ర పన్నారు. ఇటీవల జరిగిన సంఘ సమావేశంలోకి బయట వ్యక్తులను పంపి రగడ సృష్టించారు. సంఘ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి భవనాన్ని కబ్జా చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుం టామని మహిళా సంఘం సభ్యులు స్పష్టం చేస్తున్నారు.
-లీజు పేరుతో మహిళా సంఘం నుంచి చేజిక్కించుకునేందుకు కుట్ర
-ఇటీవల సంఘం సమావేశంలో రగడ సృష్టించేందుకు యత్నం
-గుడివాడలో ఓ ప్రముఖ ప్రైవేటు విద్యా సంస్థ నిర్వాహకుడి నిర్వాకం
- కుట్రలను అడ్డుకుని భవనం కాపాడుకుంటామంటున్న సంఘం సభ్యులు
మహిళా సంఘానికి రాజేంద్రనగర్‌లో ఉన్న రూ.10 కోట్ల విలువ చేసే మూడు అంతస్తుల పాఠశాల భవనాన్ని లీజు పేరుతో చేజిక్కించుకునేందుకు గుడివాడకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ యజమాని ఒకరు కుట్ర పన్నారు. ఇటీవల జరిగిన సంఘ సమావేశంలోకి బయట వ్యక్తులను పంపి రగడ సృష్టించారు. సంఘ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి భవనాన్ని కబ్జా చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుం టామని మహిళా సంఘం సభ్యులు స్పష్టం చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి - గుడివాడ:
గుడివాడ పట్టణానికి చెందిన మహిళా సంఘం 1972కు పూర్వం ఏర్పడింది. దీనికి స్థానిక రాజేంద్రనగర్‌లో ఎదురెదురుగా కోట్లాది రూపాయలు విలువ చేసే మాంటిస్సోరి తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల భవనాలున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తెలుగు మీడియం తీసివేయడంతో మూడు అంతస్తుల భవనం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం ఉన్న ఇంగ్లీషు మీడియంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో తరగతి గదుల కొరత ఏర్పడింది. దీంతో ఖాళీగా ఉన్న తెలుగు మీడియం భవనంలో కొన్ని తరగతులను నిర్వహించుకుంటున్నారు. కొన్నేళ్లుగా సదరు భవనంపై పట్టణానికి చెందిన ఓ ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థ నిర్వాహకుడి కన్ను ఉంది. ఇదే రాజేంద్రనగర్‌లో ప్రస్తుతం స్థలం కొనుగోలు చేసి కొత్త భవనం కట్టాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ భవనాన్ని నామమాత్రపు లీజు పేరుతో చేజిక్కించుకుంటే వెనుదిరిగి చూడాల్సిన పని ఉండదని మాస్లర్ ప్లాన్ రచించారు. పూర్వ కరస్పాండెంట్ ద్వారా భవనాన్ని కబ్జా చేయాలని యత్నించారు.
సమావేశంలో రగడ సృష్టించారు..
మహిళా సంఘంలో 279 మంది సభ్యులున్నారు. సంఘంలో కార్యకలాపాల నిర్వహణకు కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. ఈ క్రమంలో ఇటీవల అవినీతి ఆరోపణల నేపథ్యంతో సంఘం బోర్డు సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానంతో కరస్పాండెంట్‌ను తొలగించారు. ఇటీవల సంఘ సమావేశాన్ని స్థానిక గౌరీశంకరపురంలోని మాంటిస్సోరి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. భవనంపై కన్నేసిన సదరు ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థ నిర్వాహకుడు సంఘంతో సంబంధం లేని కొందరు మహిళలను పంపి సమావేశం నిలుపుదల చేసేలా కుట్రలు పన్నారు. సంఘం సభ్యులు కానీ కొందరు మహిళలు పాఠశాల గేట్లు తోసుకుంటూ సమావేశంలో చొరబడ్డారు. ఒక్కసారిగా మహిళా సంఘం సభ్యులపై దాడికి దిగారు. కుర్చీలు గాలిలోకి విసిరేస్తూ, షామియానాలను లాగేస్తూ నానా రభసా చేశారు. తీర్మానాలను రాసుకునే మినిట్స్ పుస్తకాన్ని చింపి విసిరేశారు. అడ్డు వచ్చిన డ్రైవర్‌పై దాడి చేశారని బోర్డు సభ్యులు ఆరోపించారు. సంఘం సభ్యులు కూడా ధీటుగా స్పందించారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారు. కాగా, పూర్వ కరస్పాండెంట్‌ను అడ్డుపెట్టుకుని సదరు ప్రైవేటు విద్యా సంస్థ నిర్వాహకుడు చక్రం తిప్పుదామనుకుంటే ఆమెనే తొలగించి మహిళా సంఘం సభ్యులు షాక్ ఇచ్చారు.
సంఘం ఆస్తులను పరిరక్షిస్తాం - మహిళ సంఘం సభ్యులు
మూడు అంతస్తుల తెలుగు మీడియం భవనం ఖాళీగా ఉందని మహిళా సంఘం కరస్పాండెంట్ కం కార్యదర్శి వల్లూరుపల్లి శారద, అధ్యక్షురాలు వల్లూరుపల్లి లక్ష్మి తెలిపారు. మూడో అంతస్తును మరమ్మతుల నిమిత్తం వాడటం లేదన్నారు. ఇంగ్లీషు మీడియంలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతో కొన్ని తరగతులను పాత భవనంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘానికి గుడివాడలో కోట్లాది రూపాయల ఆస్తులున్నాయన్నారు. వాటి పరిరక్షణ బాధ్యత మహిళా సంఘంపై ఉందని పేర్కొన్నారు.