Share News

Land Encroachment: మునిసిపల్‌ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం

ABN , Publish Date - Sep 13 , 2025 | 05:01 AM

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మునిసిపాలిటీకి చెందిన స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించినట్టు నిర్ధారణ అయింది.

Land Encroachment: మునిసిపల్‌ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం

  • వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి కొలతలు తీసిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు

  • అనుమతి లేకుండానే నిర్మించారని గుర్తింపు

పుట్లూరు, తాడిపత్రి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మునిసిపాలిటీకి చెందిన స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించినట్టు నిర్ధారణ అయింది. గతంలో ఈ విషయంపై అందిన ఫిర్యాదుల మేరకు.. మునిసిపల్‌, రెవెన్యూ అధికారులు శుక్రవారం పెద్దారెడ్డి ఇంటి కొలతలు తీశారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దారెడ్డి తన స్వగ్రామం యల్లనూరు మండలం తిమ్మంపల్లి నుంచి పుట్లూరు మీదుగా తాడిపత్రికి బయలుదేరారు. అంతకుముందు తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి కోరుతూ జిల్లా ఎస్పీ జగదీశ్‌కు మెయిల్‌ పెట్టారు. పుట్లూరు వరకు వచ్చినప్పటికీ అనుమతి రాకపోవడంతో రోడ్డు పక్కన వాహనాలు నిలిపి వేచిచూశారు. ఈ సమయంలో మరోమారు ఎస్పీకి మెయిల్‌ పెట్టి, అక్కడే ఓ పొలంలో ఉన్న బండమీద కూర్చుని 2గంటలపాటు వేచి చూశారు. ఎట్టకేలకు ఎస్పీ నుంచి అనుమతి వచ్చాక పుట్లూరు సీఐ సత్యబాబు పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకువెళ్లారు. తన ఇంటిని సర్వే చేస్తున్న అధికారులతో పెద్దారెడ్డి మాట్లాడారు. రికార్డుల ప్రకారం ఉన్నది ఉన్నట్లు రాసివ్వాలని కోరారు. తన ఇంటి నిర్మాణానికి టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నానని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయారు. కాగా, అడిషనల్‌ ఎస్పీ రోహిత్‌ కుమార్‌, డీఎస్పీ వెంకటేశ్వర్లు శివారెడ్డి ఆధ్వర్యంలో ఇన్‌చార్జి తహసీల్దారు సోమశేఖర్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ శివనారాయణ తదితరులు పెద్దారెడ్డి ఇంటి స్థలాన్ని సర్వే చేసి, కొలతలను తీసుకున్నారు. సుమారు 2సెంట్ల మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించినట్టు నిర్ధారించారు. భవంతికి ప్లాన్‌ అప్రూవల్‌ లేదని టౌన్‌ ప్లానింగ్‌ అధికారి సుజాత తెలిపారు. పెద్దారెడ్డి రాక నేపథ్యంలో తాడిపత్రికి వివిధ స్టేషన్‌ల నుంచి 400మంది పోలీసు సిబ్బందిని రప్పించారు. మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి, పెద్దారెడ్డి నివాసాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Sep 13 , 2025 | 05:03 AM