Share News

Heatwave: మండిన కోస్తా

ABN , Publish Date - May 13 , 2025 | 04:55 AM

ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కోస్తా, రాయలసీమలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43°C దాటగా, ఉక్కపోత వాతావరణం ఏర్పడింది. విపత్తు నిర్వహణ సంస్థ, రానున్న రోజుల్లో ఈ ఎండలతో పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది.

 Heatwave: మండిన కోస్తా

వడగాడ్పులు, ఉక్కపోత.. పలుచోట్ల 41డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

ఈదులగూడెంలో 43.09 డిగ్రీలు

నేడూ పలుప్రాంతాల్లో వడగాడ్పులు

విశాఖపట్నం/అమరావతి, మే12(ఆంధ్రజ్యోతి): భానుడు భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అగ్నికార్తె (రెండు రోజుల క్రితం కృతిక కార్తె ప్రారంభం) ప్రారంభం కావడంతో కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత మరింత పెరిగింది. పలుప్రాంతాల్లో 41 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా ఈదులగూడెంలో 43.09 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా కాకానిలో 43.7, బాపట్ల జిల్లా ఇం కొల్లులో 43.5, ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 43.3, ఎన్టీఆర్‌ జిల్లా మొగులూరులో 43.1, తూర్పు గోదావరి జిల్లా చిట్యాలలో 42.8, ఏలూరులో 42.6, తిరుపతి జిల్లా గూడూరులో 42.3 డిగ్రీలు, పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికితోడు వాయవ్య భారతం నుంచి పొడిగాలులు వీచాయి. ఇంకా గాలిలో తేమశాతం పెరగడంతో ఉక్కపోత నెలకొంది. రాయలసీమకంటే కోస్తాలో ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోయారు. మంగళవారం రాష్ట్రం లో 42.0నుంచి 43.5 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 53మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని, 21 మండలాల్లో తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. కాగా, ఎండ తీవ్రతతో వాతావరణ అనిశ్చితి నెలకొని సోమవారం సాయంత్రం పలుచోట్ల వర్షాలు కురిశాయి. అలాగే రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుండగా దక్షిణ అండమాన్‌ సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులను మంగళవారం నైరుతి రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, దీంతో రుతుపవనాలు ప్రవేశానికి వాతావరణం అనుకూలంగా మారిందని తెలిపింది.

Updated Date - May 13 , 2025 | 04:55 AM