తగ్గని చలి తీవ్రత
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:57 PM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా చలి తీవ్రత మాత్రం తగ్గడం లేదు.
ఉదయం 9 గంటల వరకు వీడని పొగమంచు
పాడేరు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా చలి తీవ్రత మాత్రం తగ్గడం లేదు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని అన్ని ప్రాంతాల్లోని మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు దట్టంగానే కమ్ముకుంటున్నది. మంగళవారం ముంచంగిపుట్టు, డుంబ్రిగుడలో 14.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, పెదబయలులో 14.7, అరకులోయలో 14.9, హుకుంపేటలో 15.1, పాడేరులో 15.4, చింతపల్లిలో 16.4, కొయ్యూరులో 18.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండలంలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలు దాటినా పొగమంచు వీడలేదు. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించారు. అలాగే సాయంత్రం 4 గంటలు దాటితే చలి గాలులు మొదలవుతున్నాయి. దీంతో చలి నుంచి రక్షణ పొందేందుకు చలిమంటలు వేసుకుంటున్నారు.
హుకుంపేటలో...
హుకుంపేట: మండలంలో మంగళవారం వేకువజాము నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం 10 గంటల తరువాతే సూర్యుడు కనిపించాడు. పొగమంచు వలన ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించలేదు. లైట్ల వెలుతురులోనే వాహనదారులు రాకపోకలు సాగించారు.