Municipal Department: ఈడీసీ మొత్తం మౌలిక వసతులకే
ABN , Publish Date - Oct 09 , 2025 | 04:51 AM
రాష్ట్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనం కోసం మార్పు చేసే నాలా చట్టాన్ని రద్దు చేసి.. కొత్తగా ఎక్స్‌టర్నల్ డెవల్‌పమెంట్ చార్జీల (ఈడీసీ) విధానాన్ని...
కొత్త చట్టం అమలుకు పురపాలక శాఖ ఉత్తర్వులు
వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా మార్చుకోవాలంటే మార్కెట్ ధరపై 4 శాతం రుసుం
లేఅవుట్/బిల్డింగ్ అనుమతులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
అప్పుడే ఈడీసీ చార్జీలూ చెల్లించాలి
ఎగవేస్తే రెట్టింపు జరిమానా, శిక్ష
బాధితులు 30 రోజుల్లో అప్పీలు చేసుకోవాలి
కమిటీ 45 రోజుల్లో పరిష్కరించాలి
దానిదే తుది నిర్ణయం: పురపాలక శాఖ
అమరావతి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనం కోసం మార్పు చేసే నాలా చట్టాన్ని రద్దు చేసి.. కొత్తగా ఎక్స్‌టర్నల్ డెవల్‌పమెంట్ చార్జీల (ఈడీసీ) విధానాన్ని తెచ్చింది. గత నెల 3నే అమల్లోకి వచ్చిన కొత్త చట్టం అమలుపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం జీవో జారీచేసింది. దీని ప్రకారం ఏపీసీఆర్‌డీఏ(రాజధాని ప్రాంతంలో కాదు), అన్ని మెట్రోపాలిటన్ రీజియన్ డెవల్‌పమెంట్ అథారిటీలు, అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, ఏపీ టౌన్‌ప్లానింగ్ చట్టం(1920) కింద నోటిఫై చేసిన మాస్టర్ ప్లాన్/జనరల్ టౌన్ ప్లానింగ్ స్కీంలోని గ్రామ పంచాయతీలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఇప్పటికే 2006 చట్టం ప్రకారం కన్వర్షన్ పొందిన భూములకు, 2006 జనవరి 2కు ముందు ప్లాట్లుగా నమోదైన భూములకు ఈ చట్టం వర్తించదు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్చేటప్పుడు విధించే రుసుమును ఎక్స్‌టర్నల్ డెవల్‌పమెంట్ చార్జెస్ (ఈడీసీ) అంటారు. ఈ మొత్తాన్ని ప్రధాన మౌలిక వసతులు, రోడ్లు, ఫ్లైఓవర్లు, పార్కులు, నగర స్థాయి సౌకర్యాల అభివృద్ధికి వినియోగిస్తారు. మున్సిపల్ కమిషనర్లు, అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ వైస్ చైర్మన్లు, సీఆర్‌డీఏ కమిషనర్, వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌ను అమలు చేసే అధికారులుగా నియమించారు. అన్నీ లేఅవుట్/బిల్డింగ్ అనుమతులకూ ఏపీడీపీఎంఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసేటప్పుడే ఆన్‌లైన్‌లో ఈడీసీ చార్జీలు చెల్లించాలి.
అలాగే యాజమాన్య డాక్యుమెంట్లు, మార్కెట్ విలువ సర్టిఫికెట్లు, సర్వే స్కెచ్, భూమిమీద నీటి వనరులు, ప్రభుత్వ భూములు లేవని అఫిడవిట్లు జతచేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ భూములు, స్థానిక సంస్థల కమ్యూనిటీ ప్రయోజన భూములు, మతపరమైన/దాతృత్వ ప్రయోజనాల భూములు, సంప్రదాయ గృహ పరిశ్రమలున్న భూములు(ఎకరాలోపు), ప్రభుత్వం ప్రత్యేకంగా మినహాయించిన ఇతర భూములు, ఆక్వా, డెయిరీ, పౌల్ట్రీ భూములు, ఏపీఐఐసీ, ఏపీజీఈసీఎల్‌కు కేటాయించిన భూములకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఉంటుంది. వ్యవసాయ భూములను మార్పు చేసుకునే ప్రతి దరఖాస్తుదారూ వ్యవసాయ భూమి ప్రస్తుత మార్కెట్ విలువపై 4 శాతాన్ని ఈడీసీగా చెల్లించాలి. గత నెల 3 నుంచి సేకరించిన మొత్తంలో 85 శాతం స్థానిక సంస్థలకు, 15 శాతాన్ని అభివృద్ధి అథారిటీలకు బదిలీ చేయాలని చట్టంలో పేర్కొన్నారు. వసూలు చేసిన మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో ఉంచి, ఆ నిధులను రోడ్లు, డ్రెయిన్లు. పార్కులు, నీటి సరఫరా, కాలువలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగించాలన్నారు. తప్పుడు మార్పులు, అనధికార అభివృద్ధి జరిగిన పక్షంలో మున్సిపల్ చట్టం ప్రకారం శిక్షలు, జరిమానాలు విధిస్తారు. తప్పుడు సమాచారమిచ్చి ఈడీసీ చెల్లించకుండా తప్పించుకున్న వారిపై రెట్టింపు జరిమానా, శిక్ష విధిస్తారు. అప్పీలు చేసుకునేందుకు సీ అండ్ ఎండీఏ కమిషనర్ చైర్మన్‌గా, డీటీసీపీ డైరెక్టర్ కన్వీనర్, ఆర్‌డీవో స్థాయి అధికారి సభ్యుడిగా ఉన్న కమిటీకి బాధిత దరఖాస్తుదారులు 30 రోజుల్లోపు అప్పీలు చేసుకోవచ్చు. అప్పీళ్లను సదరు కమిటీ 45 రోజుల్లోగా పరిష్కరించాలి. కమిటీ నిర్ణయమే తుది నిర్ణయమని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.