రైతులకు విరివిగా రుణాలు
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:34 PM
వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రుణ పరిమితిని పెంచి రైతులకు విరివిగా రుణాలు అందించాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో శ్రీపూజ అన్నారు.
వ్యవసాయ రంగానికి బ్యాంకుల రుణ పరిమితి పెంచాలి
ఇన్‌చార్జి జేసీ శ్రీపూజ
పాడేరు, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రుణ పరిమితిని పెంచి రైతులకు విరివిగా రుణాలు అందించాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో శ్రీపూజ అన్నారు. కలెక్టరేట్‌లో బ్యాంకు రుణాలపై మంగళవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు బ్యాంకుల రుణ పరిమితిని పెంచాలన్నారు. అలాగే అటవీ హక్కు పత్రాలున్న రైతులకు బ్యాంకు రుణాలు అందించాలన్నారు. కౌలు రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు, మల్బరీ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు. రైతు సంఘాలు వివిధ ఉత్పత్తుల ప్రొసెసింగ్ యూనిట్‌లు ఏర్పాటు చేసుకునేందుకు రుణాలను అందించాలని, వివిధ కోర్సుల్లో చేరే వారికి విద్యా రుణాలను ఇవ్వాలన్నారు. పరిశ్రమల శాఖకు సంబంధించి ముద్ర రుణాలు, తయారీ, సేవా రంగాలకు కేంద్ర పథకాలైన పీఎం ఈజీపీ, పీఎం ఎఫ్‌ఈఎఫ్, పీఎం విశ్వకర్మలో రుణాల మంజూరు స్థాయిని పెంచాలని చెప్పారు. జిల్లాలో అవసరమైన కొత్త బ్యాంకుల ఏర్పాటు, ఉన్న బ్యాంకుల సేవల విస్తరణకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అరకులోయలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం
యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అరకులోయలో త్వరలో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభిస్తామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మాతునాయుడు తెలిపారు. దీనిలో స్వయం ఉపాధి, పలు వ్యాపారాలకు సంబంధించిన శిక్షణలు అందించి, క్రెడిట్ రుణాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి.మురళి, యూనియన్ బ్యాంకు రీజనల్ హెడ్ రాజు, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, పశుసంవర్థక, మత్స్య, పట్టుపరిశ్రమ, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.