Visakhapatnam Summit: అతిథులకు పసందైన విందు
ABN , Publish Date - Nov 15 , 2025 | 06:47 AM
ఆహా ఏమి రుచి తినరా మైమరచి...’ అన్నట్టు సీఐఐ సదస్సుకు వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పసందైన ఆంధ్ర వంటకాలను ఆరగిస్తూ ఆస్వాదించారు.
ఆంధ్ర, ఇండియన్, విదేశీ వంటకాలు.. మెనూలో 50 రకాలు
విశాఖపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘ఆహా ఏమి రుచి తినరా మైమరచి...’ అన్నట్టు సీఐఐ సదస్సుకు వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పసందైన ఆంధ్ర వంటకాలను ఆరగిస్తూ ఆస్వాదించారు. సదస్సులో పాల్గొన్న ప్రముఖులతోపాటు ప్రతినిధులందరికీ శుక్రవారం 50 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఆంధ్రా ప్రత్యేక వంటకాలైన ఆవకాయ పప్పు, పులిహార, కోడి మిల్లెట్ కిచిడీ, కొత్తిమీర వంకాయ, పెరుగన్నం, ఉలవచారు, పెరుగుపులుసు, సాంబారు, ఫ్రైడ్‌దాల్, పన్నీరు కూర, గుం టూరు మిరపాయ కోడికూర, హైదరాబాద్ మటన్ దమ్ బిర్యానీ, ఫిష్‌ఫ్రై వంటి వంటకాలను ప్రతినిధులు ఇష్టంగా ఆరగించారు. ఇతర రాష్ట్రాలు, విదేశీ ప్రతినిధుల కోసం రోటీ, పాస్తా, వెజిటబుల్ థాయ్ బాసిల్ నూడిల్స్, స్టఫ్‌ఫ్రైడ్ వెజిటెబుల్స్, కబాబ్, జీరా పలావ్, డ్రై చికెన్ కర్రీ, గ్రిల్డ్ ఫిష్ విత్ లెమన్‌క్రీమీసాస్ వంటి వెరైటీలు అందుబాటులో ఉంచారు. అయినప్పటికీ ఆంధ్రా వంటకాలను ఆరగించడానికే ప్రతినిధులు ఆసక్తిచూపడం విశేషం. సదస్సుకు మొదటి రోజు 4వేల మందికి 50 రకాల వంటకాలను సిద్ధం చేయాలని పేర్కొంటూ మెనూ అందజేశారు. వంద మంది చెఫ్‌లు, 150 మంది సహాయకులు 24 గంటల ముందు నుంచే వంటలు ప్రారంభించారు. ఉద్యోగుల నుంచి వీఐపీల వరకు అందరికీ ఒకే మెనూ అందుబాటులో ఉంచడం విశేషం.