బహిష్కరణ
ABN , Publish Date - May 23 , 2025 | 12:51 AM
జిల్లా పరిషత సమావేశం సభ్యుల నినాదాలతో హోరెత్తింది. గ్రామాల్లో అభివృద్ధి పనుల సమాచారం ఇవ్వడంలేదని, రెండేళ్లుగా నిలిచిపోయిన గౌరవ వేతనం వెంటనే విడుదల చేయాలని సభ్యులు పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. ‘అధికారులు మా మాట వినడం లేదు. కనీస సమాచారం ఇవ్వడం లేదు. ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం’ అంటూ బయటకు వెళ్లిపోయారు. జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో చర్చలు జరిపినా సభ్యులు తిరిగి రాక పోవడంతో సమావేశం వాయిదా పడింది.
- జెడ్పీ సర్వసభ్య సమావేశం నుంచి సభ్యులు వాకౌట్
- కనీస గౌరవం, రెండేళ్లుగా గౌరవ వేతనం ఇవ్వడంలేదని ఆందోళన
- బయటకు వెళ్లిపోయిన సభ్యులతో జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో చర్చలు
- తిరిగి రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసిన జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక
జిల్లా పరిషత సమావేశం సభ్యుల నినాదాలతో హోరెత్తింది. గ్రామాల్లో అభివృద్ధి పనుల సమాచారం ఇవ్వడంలేదని, రెండేళ్లుగా నిలిచిపోయిన గౌరవ వేతనం వెంటనే విడుదల చేయాలని సభ్యులు పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. ‘అధికారులు మా మాట వినడం లేదు. కనీస సమాచారం ఇవ్వడం లేదు. ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం’ అంటూ బయటకు వెళ్లిపోయారు. జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో చర్చలు జరిపినా సభ్యులు తిరిగి రాక పోవడంతో సమావేశం వాయిదా పడింది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
జిల్లా పరిషత సర్వసభ్య సమావేశం సభ్యుల ఆందోళన, బహిష్కరణ నేపథ్యంలో కొద్దిసేపటికే వాయిదా పడింది. జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జెడ్పీ కన్వెన్షన్ హాలులో గురువారం జిల్లా పరిషత సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. తొలుత పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారు, ఆపరేషన్ సిందూర్‌లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సమావేశంలో జెడ్పీ నిధులు, ప్రభుత్వ నిధులతో మండల స్థాయిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను పిలవడంలేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా సమావేశాలకు వస్తుంటే ఖర్చులు అధికమైపోతున్నాయని, రెండు సంవత్సరాలుగా గౌరవ వేతనం ఇవ్వడం లేదంటూ పోడియం ఎదుటకు వచ్చి సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ‘అధికారులు మా మాట వినడం లేదు. కనీస సమాచారం ఇవ్వడం లేదు. ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం’ అంటూ సభ్యులు సమావేశపు హాల్ నుంచి వెళ్లిపోయారు. బయట నిలబడి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు అధికారులు కనీస సమాచారం ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనం వెంటనే విడుదల చేయాలని కోరుతూ నినాదాలు చేశారు.
జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో చర్చలు జరిపినా వెనక్కి తగ్గని సభ్యులు
జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లి సమావేశపు హాల్ ఎదుట ఆందోళనకు దిగడంతో జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో ఆనంద్‌కుమార్ వారి వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. సభ్యులకు కనీస సమాచారం ఇచ్చే అంశంపై రెండు జిల్లాల కలెక్టర్‌లు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారని తెలిపారు. సభ్యులకు గౌరవ వేతనం విడుదల చేసే అంశంపై ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశామని, ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సభ్యులకు వివరించి సమావేశానికి హాజరుకావాలని కోరారు. జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో ప్రతిపాదనలను తోసిపుచ్చిన సభ్యులు సమావేశానికి హాజరుకాకుండా ఎడ్పీ చైర్‌పర్సన్ చాంబర్‌కు వెళ్లి అక్కడే ఉండిపోయారు.
తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడండి : చైర్‌పర్సన్
వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధికారులకు సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్ విభాగంపై జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ ఏటా జెడ్పీ నుంచి రూ.40 కోట్లు తాగునీటి పథకాలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మరో రూ.20 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు ప్రజలకు అందించడంలో అధికారులు విఫలమవుతున్నారని మండిపడ్డారు. తమ గ్రామమైన కొత్తూరులోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. బంటుమిల్లి, కృత్తివెన్ను తదితర మండలాల్లో తాగునీటి పథకాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జెడ్పీ నిధులతో చేపట్టిన పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు అధికారులు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులకు కనీస సమాచారం ఇవ్వని అధికారులకు నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. జెడ్పీ జనరల్ ఫండ్స్ నుంచి సభ్యులకు గౌరవ వేతనం విడుదల చేయాలని జెడ్పీ సీఈవోకు సూచిస్తే ఆడిట్ అభ్యంతరాలు వస్తాయని చెబుతూ, సాచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. రెండు జిల్లాల కలెక్టర్‌లు ఈ అంశాలపై దృష్టి సారించాలని కోరారు.
శ్రీకాకుళంలో మట్టి తవ్వకాలను ఆపండి
ఘంటసాల మండలం శ్రీకాకుళంలో 200లకుపైగా టిప్పర్లతో చెరువు మట్టిని రోజూ అక్రమంగా తరలించేస్తున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఘంటసాల జెడ్పీటీసీ సభ్యుడు తుమ్మల మురళీకృష్ణ సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ విషయం సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు తెలియజేయాలని చూస్తే గనులశాఖ అధికారులు ఈ సమావేశానికి రాలేదన్నారు. మట్టి తవ్వకాలపై కలెక్టర్ దృష్టి సారించాలని కోరారు.
సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం : కలెక్టర్‌లు
కృష్ణా ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లా పరిషత సభ్యులకు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అధికారులు కనీస సమాచారం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులను భాగస్వాములను చేస్తామని చెప్పారు. సభ్యులకు గౌరవ వేతనం విడుదలపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు. ఈ సమావేశంలో నూజివీడు సబ్‌కలెక్టర్ స్మరణ్ రాజ్, ఉమ్మడి జిల్లాల్లోని వివిద శాఖల అఽధికారులు పాల్గొన్నారు.