Property Fraud: పల్నాడులో భూ బకాసురులు
ABN , Publish Date - Jul 23 , 2025 | 06:36 AM
గుంటూరు నగరానికి చెందిన కొత్తపల్లి పద్మజ 2022 ఫిబ్రవరిలో క్యాన్సర్‌తో మృతిచెందారు. ఆమె పేరున గుంటూరు రూరల్ మండలం గోరంట్ల పంచాయతీ సర్వే నం.143లో 1.80 ఎకరాల భూమి ఉంది. భాష్యం రామసేతు క్యాంపస్ వద్ద ఉన్న ఈ భూమి...
రూ.40 కోట్ల విలువైన భూమికి ఎసరు
చనిపోయిన మనిషి బతికున్నట్లు చూపించారు
20 దొంగ రిజిస్ర్టేషన్లు చేసిన ‘పేట’ రిజిస్ర్టార్
ఎనీవేర్ రిజిస్ర్టేషన్ ప్రక్రియ దుర్వినియోగం
చర్యలు తీసుకునేందుకు పోలీసులు ససేమిరా
మంత్రి లోకేశ్ జోక్యంతో ఎఫ్‌ఐఆర్ నమోదు
పోలీసుల అదుపులో కీలక నిందితుడు?
(గుంటూరు సిటీ-ఆంధ్రజ్యోతి)
గుంటూరు నగరానికి చెందిన కొత్తపల్లి పద్మజ 2022 ఫిబ్రవరిలో క్యాన్సర్‌తో మృతిచెందారు. ఆమె పేరున గుంటూరు రూరల్ మండలం గోరంట్ల పంచాయతీ సర్వే నం.143లో 1.80 ఎకరాల భూమి ఉంది. భాష్యం రామసేతు క్యాంపస్ వద్ద ఉన్న ఈ భూమి విలువ అక్షరాలా రూ.40 కోట్లు. దీనిపై కన్నేసిన కొందరు కేటుగాళ్లు దాన్ని కాజేసేందుకు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల భూ మాఫియాను రంగంలోకి దించారు. మరణించిన పద్మజను బతికి ఉన్నట్లుగా చూపించారు. నరసరావుపేట రిజిస్ర్టార్‌తో 2023 అక్టోబరులో 18 జీపీఏలు (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేయించారు. అనంతరం ఆ భూమికి రిజిస్ర్టేషన్ చేసి రూ.కోట్లు దండుకున్నారు. దీనిపై పద్మజ భర్త కొత్తపల్లి శ్రీనివాసరావు 2024 జనవరిలోపోలీసులను ఆశ్రయించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో దీనిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ససేమిరా అన్నారు. చివరకు భూమిలో వాటా ఇస్తే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఇటీవల మంత్రి లోకేశ్‌ను మంగళగిరి కార్యాలయంలో కలసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. స్పందించిన లోకేశ్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. దీంతో విచారణ ప్రారంభించిన నల్లపాడు పోలీసులు.. నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిజాలు నిగ్గు తేల్చారు.
అంతా నరసరావుపేటలోనే..
గుంటూరు పరిధిలోని భూమిని కొట్టేసేందుకు నిందితులు ఎనీవేర్ రిజిస్ర్టేషన్ ప్రక్రియను వాడుకున్నారు. భారీ మొత్తం ఆశ చూపించి రిజిస్ర్టార్‌తో 18 జీపీఏలు సహా 20 డాక్యుమెంట్లు రిజిస్టర్ చేయించారు. విషయం బయటకు పొక్కడంతో సదరు రిజిస్ర్టార్ కూడా నిందితులపై నరసరావుపేట పోలీసులకు అప్పట్లోనే ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చెందిన రిజిస్ర్టార్‌ను కూడా ఈ కేసులో చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా, పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన చింతారెడ్డి మహేశ్‌రెడ్డి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తేల్చారు. చనిపోయిన పద్మజ స్థానంలో ఓ వితంతువును చూపించి భూమికి జీపీఏలు తీసుకున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం మహేశ్‌రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పిడుగురాళ్ల మండలానికి చెందిన మరికొందరికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని, వారే వితంతువును తీసుకొచ్చారని పోలీసు విచారణలో మహేశ్‌రెడ్డి తెలిపినట్లు సమాచారం. కొందరు రౌడీలతో బాధితుడు శ్రీనివాసరావుపై దాడికి కూడా దిగినట్లు చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వం రాకపోతే..
2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే నా భూమి దక్కేది కాదు. నాకు జరిగిన అన్యాయం గురించి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు పోలీసుల దగ్గరికి వెళ్లినా న్యాయం జరగలేదు. అదేమంటే వాటాలు అడిగారు. నా భూమిని ఆక్రమించి నాపై దాడికి వచ్చారు. మంత్రి లోకేశ్ జోక్యంతో నా ఫిర్యాదుపై కదలిక వచ్చింది. నిజాలు వెలుగులోకి తెచ్చారు.
- కొత్తపల్లి శ్రీనివాసరావు, బాధితుడు