Parvathipuram: ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో బాణసంచా పేలుడు
ABN , Publish Date - Oct 20 , 2025 | 05:29 AM
జిల్లాకేంద్రం పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆదివారం బాణసంచా పేలుడు సంభవించింది. దీంతో నలుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
ముగ్గురి పరిస్థితి విషమం
నలుగురికి తీవ్ర గాయాలు.. పార్వతీపురంలో ఘటన
పార్వతీపురం/బెలగాం, అక్టోబరు19(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రం పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆదివారం బాణసంచా పేలుడు సంభవించింది. దీంతో నలుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విజయనగరం నుంచి పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు ఆదివారం ఓ బస్సు చేరుకుంది. సమీపంలోనే ఆర్టీసీ పార్సిల్ కార్యాలయం ఉండడంతో ఎప్పటిలానే ఓ కళాసి ఆ బస్సులో సామాన్లు దించేందుకు వెళ్లాడు. మందుగుండు సామగ్రి ఉందని తెలియక ఓ లగేజ్ బాక్స్‌ను పార్సిల్ కౌంటర్ వద్దకు తీసుకొచ్చి కిందకు దించగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. భారీ శబ్ధానికి బెంబేలెత్తిపోయారు. పేలుడు ధాటికి పార్సిల్ కౌంటర్ షెడ్ పైభాగం, అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో కళాసి రెడ్డి రమేష్, బస్సు డ్రైవర్ తెర్లి రవి, తోపుడు బండి కార్మికుడు సుందరరావు, మరో వ్యక్తి కె.రమే్‌షకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పార్వతీపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం రవి, ఆర్.రమే్‌షను మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు, కె.రమే్‌షను విజయనగరం మహా రాజా ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ మాధవరెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. కాగా, విజయనగరంలోని పార్సిల్ బుక్ చేసిన వారి ఫోన్ నెంబర్, పార్వతీపురంలోని పార్సిల్ తీసుకునే వారి ఫోన్ నెంబర్ ఒకటే ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్సిల్ పంపిన వ్యక్తి జియ్యమ్మవలస నిమ్మలపాడు గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ అని తెలుస్తోంది. 25 కేజీల జనరల్ ఐటమ్ పేరుతో పార్సిల్ బుక్ అయినట్టు రశీదు ఉందని ఆర్టీసీ కొరియర్ సర్వీసు అధికారులు చెబుతున్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే విజయచంద్ర పరామర్శించారు.