Explore Srisailam: శ్రీశైలం వెళ్లారా.. ఇవన్నీ చూశారా
ABN , Publish Date - Oct 16 , 2025 | 06:07 AM
దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో శ్రీశైలం క్షేత్రానిది ప్రత్యేక స్థానం! ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఏకైక క్షేత్రం ఇదే కావడం విశేషం. ఇక్కడ వెలసిన మల్లన్న స్వామి, భ్రమరాంబికా దేవి అమ్మవారిని దర్శించడాన్ని పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు.
దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో శ్రీశైలం క్షేత్రానిది ప్రత్యేక స్థానం! ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఏకైక క్షేత్రం ఇదే కావడం విశేషం. ఇక్కడ వెలసిన మల్లన్న స్వామి, భ్రమరాంబికా దేవి అమ్మవారిని దర్శించడాన్ని పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. వేలసంఖ్యలో ప్రతిరోజూ తరలివస్తుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (16)న శ్రీశైలం క్షేత్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో దేశం మొత్తం ఈ క్షేత్రం వైపు చూస్తోంది. శ్రీశైలం అంటే కేవలం మల్లన్న స్వామి, భ్రమరాంబికాదేవి ఆలయాలు, శ్రీశైలం ప్రాజెక్టు, అడవులు, కృష్ణానది మాత్రమేనని అందరికీ తెలుసు. కానీ ఈ ప్రాంతంలో ఎన్నో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ప్రాంతాలు, ఆధ్యాత్మికంగా విశిష్టత కలిగిన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో క్లుప్తంగా..
శక్తి పీఠాల్లో ప్రత్యేక స్థానం..: ఆదిశక్తి కొలువుదీరిన పద్దెనిమిది శక్తి పీఠాల్లో భ్రమరాంబ వెలసిన శ్రీశైలానికి ప్రత్యేక స్థానం ఉంది. అష్టాదశ పురాణాల్లోనూ, రామాయణ ఇతిహాసాల్లో శ్రీశైల వైభవం గురించి ప్రస్తావించారు. ఇక్కడ పాదప్రక్షాళనతో పనిలేకుండా ఆలయంలోకి నేరుగా ప్రవేశించి ధూళి దర్శనం చేసుకోవచ్చు. భక్తిశ్రద్ధలతో శివుడిని ఆలింగనం చేసుకుని మనలోని కోరికలను స్వామివారికి చెప్పుకోవచ్చు.
పరమ పావన గంగ.. పాతాళ గంగమ్మ
శ్రీశైలంలో పాపాలను పోగొట్టే పరమపవిత్ర ప్రదేశంగా భక్తులు పాతాళగంగను భావిస్తారు. నల్లమల అడవుల్లోని వనమూలికలతో నిండిన ఈ నీటికి అనేక రోగాలను దూరం చేసే శక్తి ఉందని భక్తుల విశ్వాసం. పాతాళ గంగకు మెట్ల మార్గం ఉంది. పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన రోప్‌వే ద్వారా అయితే 5 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
చెంచులక్ష్మి మ్యూజియం
నల్లమలకు, చెంచులకు ఉన్న అనుబంధాన్ని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల కోసం చెంచులక్ష్మి పేరిట మ్యూజియాన్ని ఏర్పాటు చేశాయి. ఆదివాసీ తెగల జీవన విధానాలు ఎలా ఉంటాయో ఇందులో చూడొచ్చు. గిరిజనుల దేవతా విగ్రహాలు, ఆయుధాలు, రోజువారీ ఉపయోగించే వస్తువులు, సంగీత వాయిద్యాలు తదితర గిరిజన వస్తువులను ఇందులో ఉంచారు. ఈ మ్యూజియం సందర్శన మంచి అనుభూతిని కలిగిస్తుంది.
టైగర్ రిజర్వ్ ఫారెస్ట్... జలపాతాల సవ్వడి: దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌గా పేరొందిన ఈ ప్రాంతం కోర్, బఫర్‌తో కలిపి 3,727.82 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో బెంగాల్ పులులు, చిరుతలు, జింకలు, విభిన్న జాతుల పక్షులు ఉన్నాయి. వీటిని చూడాలంటే అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. శ్రీశైలం నుంచి 58 కి.మీ. దూరంలోని మల్లెల తీర్థం, 85 కి.మీ. దూరంలో ఉమామహేశ్వర జలపాతం, శ్రీశైలానికి సమీపంలోనే మద్దిమడుగు జలపాతం అందాలను ఒక్కసారైనా చూడాల్సిందే. చివరగా చెప్పుకోవాల్సింది ఆక్టోపస్ వ్యూ పాయింట్ గురించే. శ్రీశైలం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న దోమలపెంటలో ఈ ఆక్టోపస్ వ్యూ ఉంది. - నంద్యాల-ఆంధ్రజ్యోతి
శివయ్య క్షేత్రంలో శిఖరేశ్వరం
శ్రీశైలంలో మరో అద్భుత ప్రాంతం సముద్ర మట్టానికి 2,830 అడుగుల ఎత్తులో.. మల్లికార్జున ఆలయానికి 8కి.మీ. దూరంలో ఉన్న శిఖరేశ్వరం(శిఖరం). శివయ్య ఇక్కడ వీర శంకరస్వామి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడి నుంచి శ్రీశైల ఆలయ ప్రధాన గోపురాన్ని సందర్శిస్తే మోక్షం లభిస్తుందని స్కాందపురాణంలో ఉన్నట్లు చెబుతారు.
ఇష్ట కామేశ్వరీ దేవి ఆలయం
దేశంలో ఇష్టకామేశ్వరీ దేవి పేరుతో శ్రీశైలంలో తప్ప మరెక్కడా మరో ఆలయం లేదు. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలు అయినా నెరవేరుతాయని నమ్మకం. శ్రీశైలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో డోర్నాల మార్గంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఇష్ట కామేశ్వరీ అమ్మవారి ఆలయం ఉంటుంది. అయితే అటవీ శాఖ వారు ఏర్పాటు చేసే జీపుల్లో మాత్రమే అక్కడికి వెళ్లగలరు.
ఔరా అనిపించే అక్కమహాదేవి గుహలు
శ్రీశైలంలోని అక్కమహాదేవి గుహలనే సున్నపురాయి గుహలని కూడా అంటారు. కృష్ణానదిలో పడవ ప్రయాణం ద్వారా మాత్రమే ఈ గుహలను చేరుకోవచ్చు. ఈ గుహల్లో సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం ఉంది. ఈ ప్రాంతంలో సెల్‌ఫోన్లు పనిచేయవు.