YSRCP: చావు ఏదైనా.. చిచ్చు పెట్టేద్దాం
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:49 AM
శవం కోసం వెతకడం, దాని చుట్టూ రాజకీయాలు చేయడం వైసీపీకి పరిపాటైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ఈపూరి శేషమ్మ..
ఆత్మహత్య ఘటనలో వైసీపీ శవ రాజకీయాలు.. గుంటూరు జిల్లా మహిళ మరణంపై రోత పత్రికలో విష ప్రచారం.. కందుకూరు మాదిరిగానే రెండు కులాల మధ్య చిచ్చుకు యత్నం
బంధువులు వేధిస్తే ఓ కులానికి అంటగట్టిన వైనం.. వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టిన కుటుంబం
గుంటూరు(తూర్పు), అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): శవం కోసం వెతకడం, దాని చుట్టూ రాజకీయాలు చేయడం వైసీపీకి పరిపాటైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ఈపూరి శేషమ్మ(42) అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వైసీపీ వెంటనే శవ రాజకీయాన్ని మొదలు పెట్టింది. ‘నా చావుకు కారణం టీడీపీ నేతలు-కాల్ మనీ ఆగడాలకు బలైన కాపు మహిళ’ అంటూ రోత పత్రిక బుధవారం అసత్య కథనాన్ని వండి వార్చింది. మృతురాలు కాపు కులానికి చెందడం, ఆత్మహత్యకు ముందు తీసుకున్న వీడియోలో పొరబాటున కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత పేరు చెప్పడంతో రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా విష ప్రచారం మొదలు పెట్టింది. కందుకూరు ఘటన మాదిరిగానే ఈ ఘటనను చిత్రీకరించే కుట్రకు తెరలేపారు. రోతపత్రిక కథనాన్ని శేషమ్మ కుటుంబ సభ్యులు ఖండించారు. ఆమె ఆత్మహత్య ఘటనలో టీడీపీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని, ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని తేల్చి చెప్పారు.
అసలేం జరిగిందంటే..
కొవిడ్‌కు ముందు శేషమ్మ సమీప బంధువుల వద్ద రూ. 5 లక్షలు అప్పు తీసుకోగా, వడ్డీతో రూ.10 లక్షలైంది. బాకీ చెల్లించాలనే ఒత్తిడిని భరించలేక ఆమె పది రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో మంగళవారం ఆమె మృతి చెందింది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకుంది. తన చావుకు బంధులైన సీత, పద్మ, కుమారుడి వరుసైన ఈపూరి రమేశ్, మరోవ్యక్తి కర్లపూడి శ్రీను కారణమని ఆ వీడియోలో చెప్పింది. బాకీలో కొంత చెల్లించినా ఇంటిపైకి వచ్చి తిడుతున్నారని వాపోయింది. ఇవి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు చెప్పింది. ఒక నిమిషం నిడివి ఉన్న ఆ వీడియోలో 22 సెకన్ల వద్ద కర్లపూడి శ్రీనుకు బదులు పొరపాటున కల్లూరి శ్రీను అని పలికింది. ఆ వెంటనే కర్లపూడి శ్రీను అని శేషమ్మ సరిచేసుకుంది. ఆ పొరపాటే ఆధారంగా వైసీపీ నాయకులు విష ప్రచారం మొదలు పెట్టారు. కల్లూరి శ్రీను లక్ష్యంగా వైసీపీ సోషల్ మీడియా, రోత పత్రికలో కులాల మధ్య కుంపట్లు రాజేయాలని ప్రయత్నించారు. అంతటితో ఆగక ఆయనపై కాల్‌మనీ తదితర ఆరోపణలు చేశారు.