Child Nutrition: బాలామృతంపై ప్రయోగాలు
ABN , Publish Date - Dec 27 , 2025 | 05:19 AM
చిన్నారులు ఎంతో ఇష్టంగా తాగే హార్లిక్స్ వంటి న్యూట్రిషన్ పౌడర్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి హిందుస్థాన్ వంటి దిగ్గజ కంపెనీకి దాదాపు ఐదేళ్లు పట్టింది.
13.8లక్షల మంది చిన్నారుల భవిష్యత్తుతో చెలగాటం.. 1,200కోట్ల విలువైన టెండర్ల నిబంధనల్లో గోల్‌మాల్
8 నెలల్లోనే యూనిట్ ఏర్పాటు చేయాలని నిబంధన
పేరున్న సంస్థలను పోటీ నుంచి తప్పించే యత్నం?
బాలసంజీవని సరఫరా సంస్థలకే కట్టబెట్టే వ్యూహం
మహిళా శిశుసంక్షేమ శాఖ తీరుపై విమర్శల వెల్లువ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
చిన్నారులు ఎంతో ఇష్టంగా తాగే హార్లిక్స్ వంటి న్యూట్రిషన్ పౌడర్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి హిందుస్థాన్ వంటి దిగ్గజ కంపెనీకి దాదాపు ఐదేళ్లు పట్టింది. అలాంటిది రాష్ట్రంలోని 13.80 లక్షల మంది పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రభుత్వం అందించే బాలామృతం తయారీకి ప్రభుత్వం విధించిన గడువు కేవలం 8 నెలలు మాత్రమే. ఇంత స్వల్ప వ్యవధిలో యూనిట్ నెలకొల్పి పౌడర్ సిద్ధం చేయాలనే నిబంధన విధించడం వెనుక మర్మం ఏమిటో మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులకే తెలియాలి. అనేక పరీక్షలు నిర్వహించి, ఎన్నో జాగ్రత్తలు తీసుకొని, అత్యంత నైపుణ్యంతో సిద్ధం చేయాల్సిన బాలామృతాన్ని ఇంత హడావుడిగా తయారు చేయాలని భావించడం చిన్నారుల జీవితాలతో చెలగాటం ఆడటమేనని పోషకాహార నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.వేల కోట్లు వ్యయం చేస్తున్న ఈ పథకంపై ప్రయోగాలు చేయడం సరికాదని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు జోన్లలో బాలామృతం సరఫరా చేసేందుకు మహిళా శిశుసంక్షేమ శాఖ సెప్టెంబరులో టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో నిర్దేశించిన అర్హతా ప్రమాణాలపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే గర్భిణులకు బాలసంజీవని సరఫరా చేస్తున్న సంస్థలకే ఈ కాంట్రాక్టును ధారాదత్తం చేసేందుకే వారికి అనుకూలంగా ఉండేలా టెండరు నిబంధనలు రూపొందిస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. న్యూట్రిషన్ పౌడర్/హెల్త్ మిక్స్ తయారీలో అనుభవం లేని సంస్థలకు కూడా టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించడంతో శిశువుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏడు నెలల నుంచి 3 ఏళ్ల వయస్సున్న చిన్నారుల్లో రక్తహీనత, పోషకాహార లోపాలను నివారించేందుకు అందించే ఈ బాలామృతం అత్యంత సున్నితమైన, శాస్త్రీయంగా తయారయ్యే న్యూట్రిషన్ పౌడర్. అయితే రాగి పిండి, మల్టీగ్రెయిన్ అటా, అటుకులు, పల్లీ చిక్కీ, హాట్‌కుక్డ్ మీల్ వంటి పూర్తిగా భిన్నమైన ఉత్పత్తులను సరఫరా చేసేవారికి ఈ టెండర్లు కట్టబెట్టేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. న్యూట్రిషన్ పౌడర్ తయారీ పూర్తి శాస్త్రీయంగా ఉంటుంది. అంతేకాకుండా టెండర్ పొందిన తర్వాత 8 నెలల్లో కొత్త తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని నిబంధన విధించడం కూడా వివాదాస్పదంగా మారింది. న్యూట్రిషన్ పౌడర్/హెల్త్ మిక్స్/మాల్ట్ ఆధారిత ఉత్పత్తుల తయారీలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న సంస్థలకే టెండర్లలో పాల్గొనే అర్హత కల్పిస్తే పిల్లలకు నాణ్యమైన బాలమృతం అందుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఐదేళ్లలో రూ.1,200 కోట్ల మేర వ్యయమయ్యే బాలామృతం పథకంపై మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రయోగాలు చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఏడాదికి రూ.240 కోట్ల వ్యయం
బాలామృతం సరఫరా కోసం రాష్ట్రంలోని 26 జిల్లాలను మూడు జోన్లుగా విభజించి, టెండర్లు పిలిచారు. ఏడు నెలల నుంచి 12 నెలల పిల్లలకు జూనియర్ బాలామృతం, 13 నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలకు సీనియర్ బాలామృతం సరఫరా చేసేందుకు అర్హులైన సంస్థలు సెప్టెంబరు 4 నుంచి ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు దాఖలు చేయాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం సుమారు రూ.240 కోట్ల విలువ కలిగిన బాలామృతాన్ని ఏడాదిలో సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ టెండర్లు ఐదేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించారు.
బాలసంజీవని కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం
పిల్లలకు న్యూట్రిషన్ పౌడర్ తయారీ చేయడం అత్యంత జాగ్రత్తగా చేయాల్సిన ప్రక్రియ. ఈ రంగంలోని సంస్థలు అనేక నాణ్యతా నియంత్రణ విభాగాలను ఏర్పాటు చేసుకుని ఉత్పత్తి చేస్తాయి. ఈ రంగంలో ఎక్కువగా బహుళజాతి కంపెనీలే ఉంటాయి. అలాంటి బాలామృతం టెండర్లను చిన్న సంస్థలకే కట్టబెట్టాలన్న మహిళా శిశుసంక్షేమ శాఖ వ్యూహం బెడిసికొడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ పుడ్స్ ఉత్పత్తి చేసే న్యూట్రిషన్‌ను మన రాష్ట్రంలోనూ గత 8ఏళ్ల నుంచి వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఏపీలోని సరఫరాదారులతో ఈ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో వారిని ఎంపిక చేసే ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సి ఉంది. అందుకు భిన్నంగా బాలసంజీవని కాంట్రాక్టర్లకే ఈ టెండర్లు కూడా కట్టబెట్టాలని చూస్తుండటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.