‘వ్యయ’ ప్రయాసలు!
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:52 AM
వరద వస్తే మాత్రం లంక గ్రామాల్లో రైతులు సుమారు నాలుగు నెలలు వ్యయప్రయాసాలను ఎదుర్కోక తప్పదు.
- వరద వస్తే లంకల్లోకి రాకపోకలకు ఆటంకం
- నాలుగు నెలల పాటు పడవ ప్రయాణమే దిక్కు
- ఒక రైతు బైక్ తీసుకుని పడవపై వెళ్లి వస్తే రోజుకు రూ.40 ఖర్చు
- పంటల రవాణాకు అదనపు వ్యయం
- ఏడు లంకల ప్రజలకు తప్పని ఇబ్బందులు
తోట్లవల్లూరు, జూలై 30 (ఆంధ్రజ్యోతి):
తోట్లవల్లూరు మండలంలో లంకల చుట్టూ రెండు కృష్ణానదీపాయలున్నాయి. కరకట్టను ఆనుకుని ఒకపాయ, గుంటూరు జిల్లావైపు రెండోపాయ ఉన్నాయి. ఈ రెండు పాయల మధ్య పాములలంక, తుమ్మలపచ్చికలంక, తోడేళ్లదిబ్బలంక, కాళింగదిబ్బలంక, పొట్టిదిబ్బలంక, కనిగిరిలంక, ములకలపల్లిలంక గ్రామాలున్నాయి. కరకట్ట వెంట నదిఒడ్డున పిల్లివానిలంక ఉంది. ఈ లంక గ్రామాల్లో మొత్తం 3,500 మంది జనాభా ఉన్నారు. అలాగే తొమ్మిది వేల ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. అన్ని రకాల పంటలు పండిస్తారు. నదీపాయల్లో వరద లేకుంటే తాత్కాలిక రహదారులపై లంక గ్రామాల ప్రజలు, రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. వరద వస్తే మాత్రం కష్టాలు వెంటాడుతాయి. ప్రతి ఏడాది జూలైలో వరద వచ్చి అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ నాలుగు నెలల పాటు లంక పొలాలకు వెళ్లే రైతులు పడవలపై ప్రయాణం చేయాల్సి వస్తుంది. పంటలకు ఎరువుల కట్టలు తీసుకెళ్లాలంటే పడవల వారికి ఒక్కో ఎరువు కట్టకు రూ.20 వరకు చెల్లించాలి. మనిషికి రూ.10, బైక్ ఎక్కిస్తే రూ.10 ఇలా ఒకరైతు బైక్ తీసుకుని పడవపై వెళ్లి వస్తే రోజుకు రూ.40 పడవలకు ఖర్చు చేయాలి. అంతే కాకుండా అరటి గెలలు, కూరగాయలను లంకల నుంచి తెచ్చి పడవ దాటించాలంటే అదనపు ఖర్చు. ఇలా రైతులు సుమారు నాలుగు నెలలు వ్యయప్రయాసాలను ఎదుర్కోక తప్పదు. ఇన్ని కష్టాలు పడి సాగు చేసిన పంటలు ఒక్కోసారి భారీ వరద సంభవిస్తే తుడిచిపెట్టుకుపోతాయి. అలాగే లంక గ్రామాల నుంచి హైస్కూళ్లకు వచ్చే విద్యార్థులు పడవ ప్రయాణం చేయాలి. నిత్యావసర సరుకులకు ప్రజలు పడవలపైనే ఆధార పడాలి. వరదలతో రైతులు, లంక గ్రామాల ప్రజలు ఇలా కష్టాలతో సహవాసం చేయక తప్పదు.