Chevireddy Bhaskar Reddy: మద్యం ముడుపుల నిల్వ, రవాణాలో..చెవిరెడ్డిది ముఖ్య పాత్ర
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:07 AM
మద్యం ముడుపుల ద్వారా వచ్చిన సొమ్మును నిల్వ చేసి.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించడంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని సిట్ తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా....
హైకోర్టుకు సిట్ నివేదన.. బెయిల్‌పై తీర్పు రిజర్వు
అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): మద్యం ముడుపుల ద్వారా వచ్చిన సొమ్మును నిల్వ చేసి.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించడంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని సిట్ తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సోమవారం హైకోర్టుకు నివేదించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో తుడా వాహనాలను వినియోగించి సొమ్మును వివిధ నియోజకవర్గాలకు తరలించారని.. సదరు తుడా వాహనాలు ఆ సమయంలో మరో ప్రాంతంలో ఉన్నట్లు లాగ్ బుక్‌లో తప్పుగా నమోదు చేశారని తెలిపారు. హైవే టోల్‌ప్లాజా సీసీ కెమెరాల రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమైందన్నారు. మద్యం కుంభకోణం కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చెవిరెడ్డి (ఏ-38) దాఖలుచేసిన వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ‘మద్యం ఉత్పత్తి కంపెనీల నుండి ప్రతి నెలా 60 నుండి 70 కోట్లు వసూలు చేశారు. అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి సొమ్మును తరలించారు. ఆ సొమ్ముతో బంగారం కొనుగోలుతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు. చెవిరెడ్డి ఆదేశాలతోనే సొమ్మును తరలించినట్లు.. ఆయనకు వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులుగా ఉన్న కానిస్టేబుళ్లు సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా చెవిరెడ్డి ప్రోద్బలంతో తరలిస్తున్న రూ.8 కోట్లను అధికారులు సీజ్ చేశారు. ఈ కేసు దర్యాప్తును కూడా సిట్‌కు బదలాయిస్తున్నాం. పిటిషనర్‌కు పూర్వనేర చరిత్ర ఉంది. ఆయనపై దాదాపు 70 కేసులు ఉన్నాయి. దేశం విడిచి పారిపోయేందుకూ ప్రయత్నించారు. రాజకీయ కక్షతో కేసు నమోదు చేశామన్న పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదు. కేసు నమోదు చేసిన వెంటనే ఆయన్ను నిందితుడిగా చేర్చలేదు. సరైన ఆధారాలు లభించిన తర్వాతే నిందితుడిగా చేర్చాం. ఆయనపై మోపిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందాకే ట్రయల్ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. బెయిల్ మంజూరు చేయొద్దు’ అని కోరారు. చెవిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఆర్.బసంత్ వాదనలు వినిపిస్తూ.. వ్యక్తిగత సెక్యూరిటీ అధికారి(పీఎ్‌సవో) ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడిగా చేర్చారని.. దర్యాప్తు సంస్థకు అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చినందుకు అ అధికారానికి అధిక జీతం వచ్చే ఆక్టోప్‌సకు డిప్యుటేషన్‌పై బదిలీ చేశారని తెలిపారు. చెవిరెడ్డి విషయంలో దర్యాప్తు ముగిసిందని.. చార్జిషీటు కూడా దాఖలైందని.. నిరవధికంగా జైల్లో ఉంచడానికి వీల్లేదని పేర్కొన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటామని.. బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు.