Bar License Crisis: ఎక్సైజ్‌పై బార్ ఒత్తిడి
ABN , Publish Date - Sep 07 , 2025 | 03:28 AM
ఎక్సైజ్ జిల్లాల అధికారులకు కొత్త బార్ పాలసీ తలనొప్పిగా మారింది. మిగిలిపోయిన బార్లకు దరఖాస్తులు రప్పించాలని వారిపై ఒత్తిడి పెరిగింది. ఎలాగైనా వ్యాపారులను ముందుకు తీసుకొచ్చి దరఖాస్తులు వేయించాలని
రీనోటిఫికేషన్ తర్వాత మిగిలిన 428 బార్లలో ఇప్పటివరకూ ఐదింటికే దరఖాస్తులు
మొత్తం బార్లకు దరఖాస్తులు తేవాలని ఒత్తిడి.. లేదంటే బదిలీ వేటు
జిల్లాల యంత్రాంగానికి పైస్థాయి హెచ్చరికలు
ఇప్పటికే ఇద్దరు ఈఎ్‌సలపై చర్యలు
వ్యాపారులు రాకపోతే మేమేం చేయాలి?
ఆందోళనలో ఎక్సైజ్ యంత్రాంగం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఎక్సైజ్ జిల్లాల అధికారులకు కొత్త బార్ పాలసీ తలనొప్పిగా మారింది. మిగిలిపోయిన బార్లకు దరఖాస్తులు రప్పించాలని వారిపై ఒత్తిడి పెరిగింది. ఎలాగైనా వ్యాపారులను ముందుకు తీసుకొచ్చి దరఖాస్తులు వేయించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేస్తున్నారు. మొత్తం బార్లకు దరఖాస్తులు రావాలని, లేనిపక్షంలో బదిలీ వేటు వేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరించడం ఇప్పుడు ఆ శాఖలో కలకలం రేపుతోంది. అయితే, దరఖాస్తులు రాకపోతే తామేం చేయాలని జిల్లాల యంత్రాంగం తలలు పట్టుకుంది. ఎక్సైజ్ శాఖ రూపొందించిన కొత్త బార్ పాలసీ మొదటినుంచీ వివాద కేంద్రంగానే ఉంది. పాలసీలో నిబంధనలతో వ్యాపారం గిట్టుబాటు కాదని వ్యాపారులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఇవేమీ పట్టించుకోని ఎక్సైజ్ శాఖ బార్లకు గత నెలలో నోటిఫికేషన్ జారీచేసింది. ప్రతి బార్‌కు నాలుగు దరఖాస్తులు తప్పనిసరిగా రావాలనే నిబంధన పెట్టింది. 840 బార్లలో కేవలం 56 బార్లకే ఆ మేరకు అందాయి. దీంతో అధికారులు చివరిక్షణంలో మూడు రోజులు గడువు పొడిగించారు. చివరికి కల్లుగీత కులాలకు కేటాయించిన బార్లతో కలిపినా 388 బార్లకే లైసెన్సీలు ముందుకొచ్చారు. నాలుగు కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన బార్లకు గడువు పొడిగించి ఈనెల 2న మళ్లీ లాటరీ నిర్వహించారు. మొత్తంగా రెండు విడతల్లో లాటరీ నిర్వహించినా 412 బార్లకే లైసెన్సీలు ఎంపికయ్యారు. మిగిలిపోయిన 428 బార్లకు ఈ నెల 3న మళ్లీ రీనోటిఫికేషన్ జారీచేశారు. ఈనెల 14 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఇచ్చారు. కాగా శనివారం నాటికి కేవలం ఐదు బార్లకు మాత్రమే నాలుగేసి దరఖాస్తులు అందాయి.
ఇంకా 423బార్లకు దరఖాస్తులు రావాల్సి ఉంది. ఇందుకోసం వ్యాపారులతో సమావేశాలు నిర్వహించాలని, పాలసీ లాభసాటిగా ఉందని వారికి అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు జిల్లాల అధికారులను ఆదేశిస్తున్నారు. దరఖాస్తులు రాకుండా ఎక్కువ బార్లు మిగిలిపోతే సంబంధిత అధికారులపై బదిలీ వేటు తప్పదని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీచేయడం యంత్రాంగంలో ఆందోళన పెంచింది. ఇప్పటికే రెండు జిల్లాల ఎక్సైజ్ సూపరింటిండెంట్లపై చర్యలు తీసుకున్నారు. దీంతో మిగిలిన అధికారులు బెంబేలెత్తే పరిస్థితి తలెత్తింది.
ఇదేం విధానం..?!
నాలుగు దరఖాస్తులు తప్పనిసరిగా రావాలనే నిబంధన, బార్లకు ఇచ్చే మద్యంపై 15శాతం అదనపు ఏఆర్‌ఈటీ పన్ను పాలసీకి ప్రతికూలంగా మారాయి. అదనపు ఏఆర్‌ఈటీ తొలగించాలని వ్యాపారులు కోరినా ఆర్థిక శాఖ అంగీకరించలేదు. దీంతో లైసెన్స్‌ల కోసం ఎవరూ ముందుకు రాలేదు. ఇది ప్రభుత్వానికి చెడ్డపేరు కావడంతో ఎలాగైనా దరఖాస్తులు తెప్పించాలని ఉన్నతాధికారులు పట్టుబడుతున్నారు. తొలివిడత లాటరీ సమయంలో అతి తక్కువ దరఖాస్తులు వచ్చిన కోనసీమ, బాపట్ల జిల్లాల ఎక్సైజ్ సూపరింటిండెంట్లను ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వులను ఎక్సైజ్ అధికారుల గ్రూపులోనే పోస్ట్ చేసి మిగిలినవారు భయపడేలా చేయడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఆ తర్వాత వారిని తిరిగి జిల్లాలకు పంపినట్లు తెలిసింది. కాగా ఎక్సైజ్ సూపరింటిండెంట్ స్థాయి అధికారిని బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికే ఉంటుంది. ఏఈఎస్ స్థాయి అధికారుల వరకే ఎక్సైజ్ డైరెక్టర్ చర్యలు తీసుకోవచ్చు. కానీ డైరెక్టరే చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.