Share News

Excise Department: బార్‌ పాలసీ తుస్‌

ABN , Publish Date - Aug 30 , 2025 | 05:11 AM

ఎక్సైజ్‌ శాఖ కొత్తగా తీసుకొచ్చిన బార్‌ పాలసీ విఫలమైనట్లు తేలిపోయింది. లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు రాక.. గడువు మూడ్రోజులు పొడిగించినా పెద్దగా ఫలితం కనిపించలేదు.

Excise Department: బార్‌ పాలసీ తుస్‌

  • గడువు పొడిగించినా స్పందన శూన్యం.. దరఖాస్తులు రాని బార్లు 471

  • 369 బార్లకే నేడు లాటరీ నిర్వహణ

  • దెబ్బతీసిన ఏఆర్‌ఈటీ, 4 దరఖాస్తుల రూలు

  • గీత కులాల బార్లకు 75 అప్లికేషన్లు

  • దరఖాస్తుల ద్వారా 20 కోట్ల ఆదాయం

  • మిగతా బార్లకు త్వరలో రీనోటిఫికేషన్‌

  • అన్ని బార్లకు లైసెన్సీలు వచ్చేదాకా నోటిఫికేషన్లు ఇస్తూనే ఉంటారు!

అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌ శాఖ కొత్తగా తీసుకొచ్చిన బార్‌ పాలసీ విఫలమైనట్లు తేలిపోయింది. లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు రాక.. గడువు మూడ్రోజులు పొడిగించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. 840 బార్లకు నోటిఫికేషన్‌ జారీచేయగా శుక్రవారం రాత్రి 10 గంటల వరకు 369 బార్లకే 4 లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. వాటికి మాత్రమే శనివారం ఉదయం లాటరీ నిర్వహించి లైసెన్సీలను ఎంపిక చేస్తారు. మొత్తంగా చూస్తే 471 బార్లు మిగిలిపోయాయి. నిబంధనల ప్రకారం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయాలి. చాలా బార్లకు ఒకట్రెండు మాత్రమే వచ్చాయి. ఆ రుసుములను దరఖాస్తుదారులకు తిరిగి చెల్లిస్తారు. తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో బార్‌ పాలసీకి ఏ మాత్రం స్పందన కనిపించలేదు. రెండు జిల్లాల్లో కలిపి ఒక్క బార్‌కే నాలుగు దరఖాస్తులు అందాయి. అనూహ్యంగా తిరుపతిలో భారీగా దరఖాస్తులు అందాయి. చాలా జిల్లాల్లో నాలుగు దరఖాస్తులు రావడమే కష్టంగా మారితే.. తిరుపతిలో ఓ బార్‌కు 10 దరఖాస్తులు అందాయి. ఈ జిల్లాలో చాలా బా ర్లకు 7, 8 వచ్చాయి. ఎన్టీఆర్‌ జిల్లాలోనూ చాలా బా ర్లకు దరఖాస్తులు అందాయి. మరీ ఎక్కువగా రాకు న్నా పలుబార్లకు నాలుగేసిదరఖాస్తులు వచ్చాయి.


అధికారులు డీలా..

బార్‌ పాలసీ విఫలం కావడంతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు డీలా పడిపోయారు. ఎన్ని నిబంధనలు పెట్టినా ఒక్క బార్‌ కూడా మిగలదని మొదట్లో అంచనా వేసుకున్నారు. చివరకు కనీసం 50శాతం బార్లకు కూడా లాటరీ తీసే పరిస్థితి రాకపోవడంతో షాకయ్యారు. మరోవైపు.. కల్లుగీత కులాలకు కేటాయుంచిన 84 బార్లకు 75 దరఖాస్తులు అందాయి. ఈ బార్లకు లైసెన్స్‌ ఫీజు 50 శాతం మాత్రమే. అందుకే స్పందన వచ్చింది. వాటికి కూడా శనివారమే లాటరీ తీయనున్నారు. కాగా.. ఇప్పటివరకూ వచ్చిన దరఖాస్తుల ద్వారా దాదాపు రూ.20 కోట్ల ఆదాయం ఎక్సైజ్‌ శాఖకు సమకూరింది. ఒక్కో దరఖాస్తు రుసుము రూ.5 లక్షలు. లాటరీ నిర్వహించని బార్లకు రుసుములు వెనక్కి ఇవ్వాలనే నిబంధనతో ఆదాయం తగ్గిపోయింది.


ఆ రెండు నిబంధనలతోనే దెబ్బ

బార్‌ పాలసీ ఘోరంగా విఫలం కావడానికి రెండు నిబంధనలు ప్రధాన కారణం. బార్లకు ఇచ్చే మద్యంపై ప్రభుత్వం అదనంగా 15 శాతం అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ సుంకం విధిస్తోంది. దీనివల్ల బార్‌ లైసెన్సీలు ఏడాదికి సుమారు రూ.240 కోట్లు అదనంగా చెల్లిస్తున్నారు. ఒక్కో లైసెన్సీ సగటున రూ.30 లక్షలు అదనంగా కడుతున్నారు. ఈ నిబంధన తొలగించాలని వ్యాపారులు ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరారు. ఆర్థిక శాఖ అంగీకరించకపోవడంతో దానిని తొలగించలేదు. ఇంకోవైపు.. కొత్తగా ప్రతి బార్‌కు కనీసం 4 దరఖాస్తులు రావాలని.. అప్పుడే లాటరీ తీస్తామన్న నిబంధన తెచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో ఈ నిబంధన పెట్టినట్లు తెలిసింది. నాలుగు దరఖాస్తులంటే రూ.20 లక్షలు వెచ్చించాలి. ఈ రెండు నిబంధనలతో తమపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని భావించిన వ్యాపారులు ఈసారి దరఖాస్తు చేయకుండా దూరంగా ఉండిపోయారు. కొత్తవారు వ్యాపారంలోకి వస్తారనుకుంటే అదీ జరగలేదు. చివరకు రాష్ట్రంలో ఎప్పుడూలేని విధంగా భారీ సంఖ్యలో బార్లు మిగిలిపోయాయి. మిగిలిన బార్లకు త్వరలోనే రీనోటిఫికేషన్‌ జారీచేయనున్నట్లు ఎక్సైజ్‌ శాఖ వర్గాలు తెలిపాయి. అన్ని బార్లకు లైసెన్సీలు వచ్చేవరకూ ఇలా నోటిఫికేషన్లు ఇస్తూనే ఉంటారు. అయితే తొలి విడతలో బార్లు మిగిలిపోవడం వల్ల ఆదాయంలో నష్టం ఏర్పడుతుంది. ఖాళీగా ఉన్న కాలానికి లైసెన్స్‌ ఫీజు ఉండదు.

Updated Date - Aug 30 , 2025 | 05:11 AM