Excise Department CS: 5 జిల్లాల్లో మీ పనితీరు బాగాలేదు
ABN , Publish Date - Nov 06 , 2025 | 05:20 AM
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలుంటాయని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్‌కుమార్ మీనా హెచ్చరించారు.
ఎక్సైజ్ అధికారులపై ముఖ్య కార్యదర్శి అసంతృప్తి
అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలుంటాయని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్‌కుమార్ మీనా హెచ్చరించారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎలాంటి నిర్ణయాలూ ఉండకూడదని స్పష్టం చేశారు. ఐదు జిల్లాల అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. బుధవారం మంగళగిరిలోని శాఖ కమిషనరేట్‌లో రాష్ట్రస్థాయి అధికారుల సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. అధికారులు సాధారణ వివరణలు ఇవ్వడం మానుకోవాలని, స్పష్టమైన సమాధానాలు ఇస్తేనే ఇకపై పరిగణనలోకి తీసుకుంటామని తేల్చిచెప్పారు. మద్యం ఉత్పత్తి, కల్లు విక్రయాలపై రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆ శాఖ డైరెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదేశించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నాటుసారా విషయంలో అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ వ్యాఖ్యానించారు.