Share News

హద్దుమీరిన పెత్తనం

ABN , Publish Date - Nov 25 , 2025 | 01:14 AM

జిల్లా పరిషత వ్యవహారాల్లో చైర్‌పర్సన్‌ భర్త పెత్తనం హద్దు మీరిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిధులు లేకున్నా రూ.24.37 కోట్ల అంచనాలతో 424 పనులకు సమావేశంలో అనుమతులు ఇచ్చేశారు. తీరా నిధులు సమకూరకపోవడంతో జెడ్పీ సీఈవో ఆ పనులను నిలిపివేశారు. దీంతో రెచ్చిపోయిన చైర్‌పర్సన్‌ భర్త జెడ్పీ అధికారులు, ఉద్యోగులకు ఫోన్‌ చేసి తిట్ల దండకం అందుకున్నాడు. మాకు తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా అంటూ మండిపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ మహిళా అధికారి తోటి ఉద్యోగులతో కలిసి జెడ్పీ సీఈవోకు ఫిర్యాదు చేశారు.

హద్దుమీరిన పెత్తనం

- జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త తీరుపై విమర్శలు

- రూ.24.37 కోట్ల అంచనాలతో 424 పనులకు గత సమావేశంలో అనుమతులు

- నిధులు సమకూరక పనులు నిలిపేస్తూ ఇటీవల జెడ్పీ సీఈవో ఉత్తర్వులు

- ప్లానింగ్‌ విభాగం మహిళా సూపరింటెండెంట్‌పై జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త తిట్లదండకం

- మాకు తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా అంటూ ఆగ్రహం

- తోటి ఉద్యోగులతో కలిసి జెడ్పీ సీఈవోకు బాధిత అధికారి ఫిర్యాదు

- భవిష్యత్తులో మళ్లీ జరగకుండా కలెక్టర్‌, సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్యోగుల నిర్ణయం

జిల్లా పరిషత వ్యవహారాల్లో చైర్‌పర్సన్‌ భర్త పెత్తనం హద్దు మీరిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిధులు లేకున్నా రూ.24.37 కోట్ల అంచనాలతో 424 పనులకు సమావేశంలో అనుమతులు ఇచ్చేశారు. తీరా నిధులు సమకూరకపోవడంతో జెడ్పీ సీఈవో ఆ పనులను నిలిపివేశారు. దీంతో రెచ్చిపోయిన చైర్‌పర్సన్‌ భర్త జెడ్పీ అధికారులు, ఉద్యోగులకు ఫోన్‌ చేసి తిట్ల దండకం అందుకున్నాడు. మాకు తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా అంటూ మండిపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ మహిళా అధికారి తోటి ఉద్యోగులతో కలిసి జెడ్పీ సీఈవోకు ఫిర్యాదు చేశారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లా పరిషతలో మరో వివాదం రాజుకుంది. నిధులు అందుబాటులో లేకున్నా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వివిధ మండలాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చేశారు. ఆ తర్వాత జెడ్పీలో సరిపడా నిధులు అందుబాటులో లేవనే కారణం చూపి, మళ్లీ అనుమతులు ఇచ్చే వరకు ఈ పనులను నిలిపివేస్తున్నట్లు జెడ్పీ సీఈవో ఈ నెల 21వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మాకు తెలియకుండానే అభివృద్ధి పనులు ఆపేస్తారా అంటూ జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త తనదైన శైలిలో ఉద్యోగులపై తిట్లదండకం అందుకున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంతో జెడ్పీ అధికారులు, జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త మధ్య విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి.

424 పనులు నిలిపివేత

ఈ ఏడాది మే, సెప్టెంబరు నెలల్లో జరిగిన జిల్లా పరిషత సర్వసభ్య సమావేశాల్లో జల్లా పరిషత సాధారణ నిధులతో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వివిధ గ్రామాల్లో 424 పనులను రూ.24.37 కోట్ల అంచనాలతో చేయాలని నిర్ణయించారు. ఈ పనుల అంచనాలను పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖల అధికారులు తయారు చేసి జెడ్పీ అధికారులకు నివేదిక ఇచ్చారు. జెడ్పీకి సంబంధించిన సెక్టారియల్‌ నిధులతో 155 పనులను రూ.8.26 కోట్లతో, షెడ్యూలు కులాలవారు నివసించే ప్రాంతాల్లో 44 పనులను రూ.3.16 కోట్లతో, జెడ్పీ జనరల్‌ ఫండ్స్‌తో 225 పనులను 12.94 కోట్లతో చేయాలని నిర్ణయించారు. పనులకు ఆమోదం తెలిపినా.. అక్టోబరు నాటికి జెడ్పీకి ఈ నిధులు సమకూరక పోవడంతో నిధుల కొరత కారణంగా ఆమోదం పొంది, ఇంకా పనులు ప్రారంభించని ఈ పనులను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు తక్షణమే నిలిపివేయాలని ఈ నెల 21వ తేదీన జెడ్పీ సీఈవో కన్నమనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగాలకు అదే రోజు పంపారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త కనుసన్నల్లోనే..

జిల్లా పరిషత నిధులతో 424 పనుల కేటాయింపునకు సంబంధించిన వ్యవహారమంతా జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త కనుసన్నల్లోనే నడిచిందని జెడ్పీ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. జెడ్పీ సాధారణ నిధులతో ఈ పనులు చేసేందుకు ఆమోదం తెలిపినా, నిధుల కొరత కారణంగా మూడు సంవత్సరాలకు గాని ఈ పనులకు బిల్లులు చెల్లింపులు చేసే అవకాశం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పగించి, చేసుకోమని చెప్పిన తర్వాత ఈ పనులను నిలిపివేస్తూ జెడ్పీ సీఈవో ఉత్తర్వులు జారీ చేయడంతో జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త ఆగ్రహంతో ఊగిపోయినట్టు తెలిసింది. తనదైన శైలిలో ఉద్యోగులు, అధికారులపై తిట్ల దండకం అందుకున్నట్టు జెడ్పీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహిళా ఉద్యోగిపై శివాలు!

జిల్లా పరిషత ప్లానింగ్‌ విభాగం సూపరింటెండెంట్‌గా మహిళా అధికారి పనిచేస్తున్నారు. జెడ్పీ నిధులతో పనులు చేసేందుకు అనుమతులు ఇచ్చినట్లే ఇచ్చి నిధుల కొరతతో వాటిని నిలిపివేయడంతో జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త సంబంధిత విభాగం సూపరింటెండెంట్‌కు ఫోన్‌ చేసి పరుష పదజాలంతో విరుచుకుపడినట్లు తెలిసింది. ఈ విషయమై సదరు అధికారి తోటి ఉద్యోగులకు చెప్పుకుని బాధపడటంతో.. వారంతా కలిసి జెడ్పీ డిప్యూటీ సీఈవో వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పినట్టు సమాచారం. ప్లానింగ్‌ విభాగం సూపరింటెండెంట్‌ కంటే ముందే తనకు సదరు వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చిందని, తాను ఆమెలాంటి బాధితుడినేనని జెడ్పీ డిప్యూటీ సీఈవో చెప్పడంతో ఉద్యోగులు ఖంగుతిన్నట్లు తెలిసింది. అనంతరం ఉద్యోగులంతా జెడ్పీ సీఈవో వద్దకు వెళ్లి జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త తీరుపై ఫిర్యాదు చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌తో తాను మాట్లాడుతానని, అప్పటి వరకు వేచి ఉండాలని జెడ్పీ సీఈవో ఉద్యోగులకు చెప్పి పంపేశారు.

సమావేశమైన ఉద్యోగులు

జెడ్పీలో చైర్‌పర్సన్‌ భర్త పెత్తనం పెరిగిపోవడం, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులతో ఆయన మాట్లాడుతున్న తీరుపై ఏం చేయాలనే అంశంపై జెడ్పీ ఉద్యోగులంతా సమావేశమై చర్చించుకున్నారు. ఉద్యోగులు పరిపాలనాపరంగా ఏదైనా పొరపాటు చేస్తే జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉద్యోగులను తన చాంబరుకు పిలిపించి మాట్లాడవచ్చునని, కానీ జెడ్పీలో ఎలాంటి పదవి లేని జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త ప్రభుత్వ ఉద్యోగులపై పెత్తనం చేస్తున్నాడని, ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ ఇదే తరహాలో ఆయన వ్యవహరించాడని ఉద్యోగులు మాట్లాడుకున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త వైఖరిపై కలెక్టర్‌, ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలని, ఈ విషయంలో అందరం ఐక్యంగా ఉండాలని జెడ్పీలో పనిచేసే ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - Nov 25 , 2025 | 01:14 AM