Share News

Cloud Bursts: కుమ్మేసిన నైరుతి

ABN , Publish Date - Oct 01 , 2025 | 05:45 AM

దేశంలో ఈ నైరుతి రుతు పవనాల సీజన్‌లో వర్షాలు అధికంగా కురిశాయి. సాధారణం కంటే 8 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది.

Cloud Bursts: కుమ్మేసిన నైరుతి

  • దేశంలో 8 శాతం అధికంగా వర్షపాతం

  • అత్యధికంగా కురిసే చిరపుంజిలో వర్షాభావం

విశాఖపట్నం, సెప్టెంబరు 30: దేశంలో ఈ నైరుతి రుతు పవనాల సీజన్‌లో వర్షాలు అధికంగా కురిశాయి. సాధారణం కంటే 8 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. మేఘ విస్పోటనాలు(క్లౌడ్‌ బరస్ట్‌), కొండచరియలు, మట్టిపెళ్లలు విరిగిపడటం వంటి పలు సంఘటనలు జరిగినా ఇది ‘చాలా విజయవంతమైన రుతుపవనాల సీజన్‌’ అని ఐఎండీ చీఫ్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర మంగళవారం ఆన్‌లైన్‌ విలేకరుల సమావేశంలో చెప్పారు. జూన్‌లో 8.9ు, జూలైలో 4.8ు, ఆగస్టులో 5.2ు, సెప్టెంబరులో 15.3ు అధికంగా వర్షాలు కురిశాయన్నారు. భారతదేశ సాధారణ వర్షపాతం 868.6 మిల్లీమీటర్లు కాగా, 937.2 మిల్లీమీటర్ల(8ు అధికంగా) వర్షాలు పడ్డాయన్నారు. తూర్పు, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యిందని చెప్పారు. సాధారణ వర్షపాతం 1367.3 మిల్లీమీటర్లు కాగా 20 శాతం తక్కువగా 1089.9 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందన్నారు. బిహార్‌, మేఘాలయ, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో తీవ్ర వర్షాభావం నెలకొందన్నారు. గత 20 ఏళ్లుగా ఆ ప్రాంతంలో వర్షాలు తగ్గుతున్నట్టు తెలిపారు. ఇక వాయవ్య భారతంలో సాధారణం కంటే 27.3 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందన్నారు. వాయవ్య భారతంలోని అన్ని జిల్లాల్లోనూ జూన్‌, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయన్నారు. మధ్య భారతంలో సాధారణం 978 మిల్లీమీటర్లు కాగా 15.1శాతం అధికంగా 1125.3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని, దక్షిణ భారతంలో (సాధారణం 716.2 మిల్లీమీటర్లు) కంటే 9.9ు అధికంగా వర్షాలు కురిశాయని తెలిపారు.


వాతావరణ మార్పులతో హెచ్చుతగ్గులు

ఈఏడాది నైరుతి సీజన్‌లో అనేక అసమానతలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల కుంభవృష్టి వర్షాలతో అపార నష్టం వాటిల్లగా, మరికొన్నిచోట్ల దుర్భిక్షం నెలకొంది. ఇంకొన్నిచోట్ల రోజుల తరబడి పొడి వాతావరణం కొనసాగింది. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే చిరపుంజిలో ఈ ఏడాది అనేకరోజులు వర్షాభావం కొనసాగింది. మహారాష్ట్రలోని పూణే జిల్లా సహ్యాద్రి పర్వత ప్రాంతాలకు చెందిన తమ్హని ఘాట్‌లో 9,194 మి.మీ. వర్షపాతం కురవడంతో కొత్త రికార్డు నమోదైంది. తూర్పు, ఈశాన్య భారతంలో వర్షాలు తగ్గుతున్న తీరు ఆందోళనకరంగా ఉంది. మే 24న కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు ప్రస్తుతం ఉత్తరాదిలో ఉన్నాయి. దేశం నుంచి నిష్క్రమించడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుంది. అయినా సెప్టెంబరు 30తోనే సీజన్‌ ముగిసినట్టు పరిగణిస్తారు. కాగా, వాతావరణ మార్పుల ప్రభావంతో 2021 నుంచి వర్షపాతం తీవ్రత పెరుగుతోంది. ఈ ఏడాది 2109 ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ, 303 చోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల అసాధారణ వర్షాలు (30 సెంటీమీటర్ల కంటే ఎక్కువ) కురిశాయి.

Updated Date - Oct 01 , 2025 | 05:47 AM