Ex Vice President Venkaiah Naidu Urges: ఇద్దరు సీఎంలూ ఉచితాలపై పునరాలోచించాలి!
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:24 AM
మన మాతృభాష పరాయి భాషగా మారిపోతోంది. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఒక సభలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాటిచ్చారు..
తెలుగులో పాలనకు మాటిచ్చారు.. అమలు చెయ్యండి
డాక్టర్ పీడీకే రావు యువతకు ఆదర్శం కావాలి
భారత జ్యోతి పురస్కార సభలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
తెనాలి, నవంబరు 27: (ఆంధ్రజ్యోతి): ‘మన మాతృభాష పరాయి భాషగా మారిపోతోంది. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఒక సభలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాటిచ్చారు.. తెలుగులోనే ఉత్తర్వులు ఇస్తాం. పాలన సాగిస్తామని. దానిని అమలుచేసి మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్ తరాలకు మరో ముప్పు పొంచి ఉంది. అదే ఉచితం. ఉచితాలు ఇస్తూ పోతే ప్రజలు సోమరులవుతారు. ఇది దేశ భవితకు పెను ప్రమాదం. ఈ రెండింటిపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచించాలి’ అంటూ భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరకు వెంకయ్యనాయుడు హితవు పలికారు. గుంటూరు జిల్లా తెనాలిలో గురువారం భారత జ్యోతి పురస్కార ప్రధాన సభలో ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. తెనాలి ప్రచురణలు, రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావుకు వెంకయ్యనాయుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్, శాసనమండలి సభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలసి పురస్కారాన్ని అందించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. అందరికీ ఉచిత సేవలు ఇచ్చే బదులు పేదవారికి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తే సరిపోతుందని, అంతకు మించి ఇచ్చేవన్నీ ప్రమాదకర పరిణామాలకు దారితీసేవేవని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుర్గా కామేశ్వరరావు అమెరికాలో చదివి, అక్కడే ప్రొఫెసర్‌గా మంచి ఉద్యోగం సాధించినా.. తిరిగి మన రాష్ట్రానికి వచ్చి, పేద ప్రజల ఉన్నతికి పాటుపడటం గొప్ప విషయమన్నారు. అమెరికా వంటి విదేశాలకు వెళుతున్న యువత అక్కడే ఉండిపోకుండా తిరిగి స్వదేశానికి తిరిగి రావాలని, మన ప్రాంతాల అభివృద్దికి పాటుపడాలని పిలుపునిచ్చారు.