EX Vice President Venkaiah Naidu: నేను జైలుకు వెళ్లకపోతే..
ABN , Publish Date - Dec 09 , 2025 | 06:17 AM
ఎమర్జెన్సీ సమయం లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ నన్ను జైలుకు పంపకపోతే నేను ఉపరాష్ట్రపతిని అయ్యేవాడిని కాదు.
ఉపరాష్ట్రపతి అయ్యేవాడిని కాదు
ఎమర్జెన్సీలో జైలుకు పంపిన ఇందిరకు ధన్యవాదాలు
నేను, మోదీ, కోవింద్, జస్టిస్ రమణ మాతృభాషలో చదువుకున్నవాళ్లమే
ఆదికవి నన్నయ్య వర్సిటీ జాతీయ వర్క్‌షాపులో వెంకయ్య
రాజమహేంద్రవరం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘ఎమర్జెన్సీ సమయం లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ నన్ను జైలుకు పంపకపోతే నేను ఉపరాష్ట్రపతిని అయ్యేవాడిని కాదు. ఆ సమయంలో నేను వకీలును మాత్రమే. 17 నెలల పాటు జైలుశిక్ష అనుభవించా. అప్పుడే పొలిటీషియన్ అవ్వాలనుకున్నాను. జాతీయ స్థాయిలో ఎదిగాను. దేశంలో రెండో అత్యున్నత పద వి ఉపరాష్ట్రపతి అయ్యాను. ఇందిరాగాంధీకి ధన్యవాదాలు’ అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా, ఆదికవి నన్నయ్య వర్సిటీలో సోమవారం ‘భారతీయ భాషల్లో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం’ అనే అంశంపై జరిగిన జాతీయ వర్క్‌షాపు లో ఆయన పాల్గొన్నారు. ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. వెంకయ్య మాట్లాడుతూ.. ‘‘అమ్మ నా 13వ నెలలోనే చనిపోయింది. నేను అమ్మను చూడలేదు. అమ్మభాషలోనే ఆమెను చూసుకున్నాను. మాతృభాషలో, ప్రభుత్వ బడుల్లో చదువుకుంటే ఉన్నతస్థాయికి ఎదగలేమనే అభిప్రాయం సరికాదు. ప్రధాని మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ మాతృభాషలో చదువుకున్నవారే. నేనూ తెలుగుభాషలో వీధి బడిలోనే చదువుకున్నాను. బ్రిటీష్ వాళ్లు ఇంగ్లిషు వస్తేనే ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో అందరూ ఆంగ్లం చదువుకున్నారు. నైజాం నవాబు ఉర్దూ చదువుకుంటే ఉద్యోగం ఇస్తాననడంతో ఉర్దూ చదువుకున్నారు. ఇవాళ తెలుగు రాష్ర్టాల్లో తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం అంటేనే తెలుగు నేర్చుకుంటారు.
ఎవరైనా సరే మొదట మాతృభాష, తర్వాత సోదర భాష, తర్వాతే అన్యభాషలు నేర్చుకోవాలి.’’ అని వెంకయ్యనాయుడు అన్నారు. ‘‘తమిళనాడులో పిల్లలు హిందీ చదువుకుంటారు. పెద్దలు హిందీ సినిమాలు చూస్తారు. కానీ రాజకీయ నేతలు మాత్రం హిందీని వ్యతిరేకిస్తారు. నేనూ హిందీని వ్యతిరేకించాను. నెల్లూరులో డాక్ ఘర్(పోస్టాఫీసు)కు తారు రాశాను. కానీ ఢిల్లీ వెళ్లాక నేను తారు డాక్ ఘర్‌కు కాదు.. నా ముఖానికి రాసుకున్నానని తెలుసుకున్నాను.’’ అని వెంకయ్య అన్నారు. ఏపీ తెలుగు-సంస్కృత అకాడమీ అధ్యక్షుడు ఆర్‌డీ విల్సన్(శరత్‌చంద్ర), తానా సాహితీ వేదిక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ పాల్గొన్నారు.