Share News

Ex TTD Chairman Y V Subba Reddy : కల్తీ నెయ్యి వెనుక కథేంటి?

ABN , Publish Date - Nov 21 , 2025 | 03:59 AM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కాంట్రాక్టులు ఎవరెవరి సిఫారసు మేరకు కుదిరాయి? కొందరికి అనుకూలంగా ఉండేలా షరతులు మార్చడంలో....

Ex TTD Chairman Y V Subba Reddy : కల్తీ నెయ్యి వెనుక కథేంటి?

  • టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీపై ప్రశ్నల వర్షం

  • ఎవరి సిఫారసుతో ‘నందిని’ని మార్చారు?

  • పరీక్షల తర్వాతా ‘భోలేబాబా’ను ఆపలేదేం?

  • కొందరి కోసం షరతులు మార్చారా!?

  • పీఏ అప్పన్నకు అన్ని ఆస్తులు ఎక్కడివి?

  • సూటిగా సమాధానాలు చెప్పని వైవీ

  • ఇంట్లో పలు టీటీడీ డాక్యుమెంట్లు స్వాధీనం

  • మొబైల్‌ ఫోన్‌ నుంచి డేటా కాపీ

అమరావతి/తిరుపతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కాంట్రాక్టులు ఎవరెవరి సిఫారసు మేరకు కుదిరాయి? కొందరికి అనుకూలంగా ఉండేలా షరతులు మార్చడంలో అప్పటి టీటీడీ చైర్మన్‌గా మీ పాత్ర ఏమిటి? మైసూర్‌లోని ప్రయోగశాల నాణ్యత రిపోర్టులు ఇచ్చిన తర్వాత కూడా భోలే బాబా సంస్థ నుంచి నెయ్యి సరఫరా ఎందుకు కొనసాగించారు? అంత భారీస్థాయిలో నెయ్యి సేకరణకు సంబంధించిన ఫైళ్లను మీ పీఏ అప్పన్న ఎందుకు చూశారు? అంత అధికారం మీరెందుకు ఇచ్చారు? వేలల్లో జీతం తీసుకునే ఆయనకు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి?.... అంటూ వైఎస్‌ జగన్‌ బాబాయ్‌, టీటీడీ మాజీ చైర్మన్‌, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ అధికారులు గురువారం హైదరాబాద్‌లో వైవీ సుబ్బారెడ్డి నివాసంలోనే ఆయనను ప్రశ్నించారు. సుమారు ఏడుగంటలపాటు ఈ విచారణ ప్రక్రియ జరిగింది. ఈ కేసులో 24మందిపై కేసు నమోదు చేసిన ‘సిట్‌’ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్న సహా తొమ్మిది మందిని అరెస్టు చేసింది. టీటీడీ మాజీ ఇన్‌చార్జి ఈవో ధర్మారెడ్డితోపాటు చిన్న అప్పన్న ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వైవీని ప్రశ్నించారు. ఆయన వైసీపీ హయాంలో 2019 నుంచి 2023వరకూ రెండు విడతల్లో నాలుగేళ్లు టీటీడీ చైర్మన్‌గా ఉన్నారు. తిరుపతిలోని సిట్‌ కార్యాలయానికి రావాలంటూ గతంలో నోటీసులు ఇచ్చినా.... అనారోగ్య కారణాలతో రాలేక పోతున్నానని, మీరే వస్తే విచారణకు సహకరిస్తానని సిట్‌ అధికారులకు వైవీ బదులిచ్చారు. ఈ నేపథ్యంలో... సీబీఐ, ఏపీ పోలీసులతో ఉమ్మడిగా ఏర్పడిన సిట్‌ అధికారులు హైదరాబాద్‌లో వైవీ నివాసానికి వెళ్లారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యి టెండర్లు కుదుర్చుకోవడంలో చేసిన మార్పులు, సరఫరాదారుల ఎంపికలో జరిగిన ఉల్లంఘనలు, సంబంధిత టెండర్‌ ఫైళ్లు చైర్మన్‌ కాకుండా ఆయన పీఏ చూడటం వెనకున్న కారణాలు, నాణ్యత తనిఖీల్లో లోపాలు, ఆడిట్‌ ప్రాసెసింగ్‌ విధానం, మరీ ముఖ్యంగా... మైసూర్‌ ల్యాబ్‌ నివేదిక తర్వాత కూడా భోలే బాబా నుంచి నెయ్యి కొనుగోలు చేయడంపై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. టీటీడీకి అప్పటిదాకా కర్ణాటక పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్యకు చెందిన ‘నందిని’ సంస్థను ఎవరి సిఫారసు మేరకు పక్కన పెట్టి... భోలేబాబాను తెరపైకి తెచ్చారని అడిగినట్లు సమాచారం. పలు ప్రశ్నలకు వైవీ సుబ్బారెడ్డి సూటిగా సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్లు తెలిసింది. నాణ్యత తనిఖీల్లో వచ్చిన సందేహాలతోపాటు లడ్డూ పోటు సిబ్బంది అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని అడగ్గా... అవన్నీ అధికారులు చూసుకోవాలి అంటూ దాటవేసినట్లు సమాచారం. ‘‘మీ పీఏ అప్పన్నను పలువురు కాంట్రాక్టర్లు తరచూ సంప్రదించడం వెనుక మీరు పొందిన లబ్ధి ఏంటి? ఆడిట్‌ నివేదికలు బోర్డు ముందు ఎందుకు ఉంచలేదు?’’ అని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రీమియర్‌ డెయిరీ నుంచీ చిన్న అప్పన్న హవాలా రూపంలో రూ.50 లక్షలు తీసుకున్న విషయం తెలుసా అని ప్రశ్నించినట్టు సమాచారం.


గతంలో ఏ బోర్డూ తీసుకోని రీతిలో నెయ్యి సేకరణ టెండర్ల నిబంధనలో... ‘పాలతో తయారు చేసిన నెయ్యి’ అనే చోట ‘పాలు’ అన్న పదాన్ని వైవీ హయాంలో బోర్డు ఎలా తొలగించిందని ప్రశ్నించినట్టు సమాచారం. దీనిపై వైవీ సుబ్బారెడ్డి సమాధానాలు, స్పందనలను ‘సిట్‌’ అధికారులు రికార్డు చేసుకున్నారు. తమకు అందుబాటులో ఉండాలని, అవసరమైతే మరోమారు సంప్రదిస్తామని సుబ్బారెడ్డికి చెప్పినట్లు తెలిసింది.

విచారణకు సహకరించని అప్పన్న

వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న సిట్‌ విచారణకు సహకరించడం లేదని తెలిసింది. ఐదు రోజుల కస్టడీలో గురువారంతో నాలుగు రోజులు గడిచిపోయాయి. ఈ నాలుగు రోజుల విచారణలోనూ సిట్‌ అధికారులు అడిగిన ప్రశ్నల్లో 90 శాతం వాటికి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించినట్టు తెలిసింది.

పక్కా కసరత్తుతో...

వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నించేందుకు సీబీఐ వైజాగ్‌ డీఐజీ మురళీ రాంబా నేతృత్వంలోని ‘సిట్‌’ బృందం తిరుపతి నుంచి హైదరాబాద్‌ చేరుకుంది. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 దాకా విచారణ జరిగింది. ఈ సందర్భంగా వైవీ నివాసంలో టీటీడీకి చెందిన పలు డాక్యుమెంట్లు, ఆయన బ్యాంకు పాస్‌ బుక్కులు స్వాఽధీనం చేసుకోవడంతోపాటు ఆయన మొబైల్‌ ఫోన్‌ నుంచీ డేటా కాపీ చేసుకున్నట్టు సమాచారం. చిన్న అప్పన్న ఎలా పరిచయం అన్న ప్రశ్నతో మొదలుపెట్టి... ఆయనను పీఏగా పెట్టుకోవడం, తర్వాత ఢిల్లీ ఏపీ భవన్‌లో ఉద్యోగిగా నియమించడం... ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశాల గురించి ప్రశ్నించినట్టు సమాచారం. చైర్మన్‌గా పాలనా వ్యవహారాలు, విఽధానపరమైన నిర్ణయాలు తీసుకోవడమే తన బాధ్యత అని... నెయ్యి నాణ్యత తనకేం సంబంధం అని ప్రశ్నించినట్టు తెలిసింది. తనకు వెంకటేశ్వరస్వామి అంటే విపరీతమైన భక్తి అని, తనే అడిగి మరీ టీటీడీ చైర్మన్‌ పదవి తీసుకున్నానని చెప్పినట్టు తెలిసింది.

Updated Date - Nov 21 , 2025 | 03:59 AM