YCP Former MLA: తిప్పేస్వామి.. తప్పు సామీ..
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:51 AM
కూటమి ప్రభుత్వంలో ఎవరు వేధించినా ఫిర్యాదు చేయాలని వైసీపీ అధినేత జగన్ ప్రారంభించిన డిజిటల్ బుక్‌లో ఆ పార్టీ నేతలపైనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
చైర్ పర్సన్ పదవికి రూ.25 లక్షలు తీసుకున్నారు
అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుకు 75వేలు లాగేశారు
పదవీ దక్కలేదు.. డబ్బులూ వెనక్కి ఇవ్వడంలేదు
మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మోసగించారు
వైసీపీ డిజిటల్ బుక్‌లో ఆ పార్టీ నేతల ఫిర్యాదులు
మడకశిర, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో ఎవరు వేధించినా ఫిర్యాదు చేయాలని వైసీపీ అధినేత జగన్ ప్రారంభించిన డిజిటల్ బుక్‌లో ఆ పార్టీ నేతలపైనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై మంగళవారం ఇద్దరు వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన కుమార్తె ప్రియాంకకు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి ఇప్పిస్తానని రూ.25 లక్షలు తీసుకుని అప్పటి ఎమ్మెల్యే తిప్పేస్వామి మోసగించారని వైసీపీ నాయకుడు విక్రమ్ డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేశారు. ఆ పదవి ఇతరులకు ఇచ్చారని, తొలిసారి అవకాశం రాలేదని, రెండోసారి (సగం పదవీకాలం) ఇస్తామని నమ్మబలికారని ఆరోపించారు. తాము ఇచ్చిన డబ్బులు వెనక్కి అడిగితే పార్టీ కోసం ఖర్చు పెట్టానని బుకాయిస్తున్నారని వాపోయారు. ఒకసారి రూ.10 లక్షలు, మరోసారి రూ.15 లక్షలు ఇచ్చానని బాధితుడు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పుల్లో ఉన్నానని, తన డబ్బులు తిరిగి ఇప్పించాలని పార్టీ అధినేతకు విన్నవించారు. కాగా, జగన్ దినపత్రికలో గతంలో పనిచేసిన విలేకరి కామరాజు కూడా తిప్పేస్వామికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. అగళి మండలం దొక్కలపల్లిలో తన మరదలికి అంగన్‌వాడీ హెల్పర్ ఉద్యోగం ఇచ్చేందుకు తిప్పేస్వామి తన వద్ద రూ.75వేలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తరువాత ఆమెకు ఉద్యోగోన్నతి అవకాశం వచ్చిందని, దానికి రూ.5 లక్షలు ఇవ్వాలని బేరం పెట్టారని తెలిపారు. డబ్బు ఇవ్వకపోతే కొత్తవారికి అవకాశం ఇస్తానని బెదిరించారని, తాను అంతమొత్తం ఇవ్వలేనని చెప్పినా వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బేరసారాలపై ఆడియో, వీడియో రికార్డు చేశానని, విషయాన్ని బయటి వ్యక్తులకు చెప్పినందుకు తనను ఉద్యోగం నుంచి తీసేయించారని వాపోయారు. తన డబ్బులు నేటికీ తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. డిజిటల్ బుక్‌లో సొంత పార్టీ నాయకుడిపైనే ఫిర్యాదులు రావడంతో వైసీపీ నేతలు ఇరకాటంలో పడ్డారు.