Share News

Ex GM Subramanyam: అప్పట్లో చైర్మన్‌దే హవా.. అందుకే ఆయనకు చెప్పా

ABN , Publish Date - Dec 12 , 2025 | 05:26 AM

తాను పనిచేసిన సమయంలో టీటీడీలో చైర్మన్‌ హవానే నడిచిందని, అందుకే నెయ్యి కల్తీ అయిందన్న మైసూరు ల్యాబ్‌ రిపోర్టు గురించి...

Ex GM Subramanyam: అప్పట్లో చైర్మన్‌దే హవా.. అందుకే ఆయనకు చెప్పా

  • మూడో రోజు సిట్‌ విచారణలో మాజీ జీఎం సుబ్రమణ్యం

  • నేటితో ముగియనున్న కల్తీ నెయ్యి కేసు నిందితుల కస్టడీ

తిరుపతి/తిరుపతి (నేరవిభాగం), డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తాను పనిచేసిన సమయంలో టీటీడీలో చైర్మన్‌ హవానే నడిచిందని, అందుకే నెయ్యి కల్తీ అయిందన్న మైసూరు ల్యాబ్‌ రిపోర్టు గురించి ఆయనకే సమాచారమిచ్చానని ఈ కేసులో నిందితుడైన ప్రొక్యూర్‌మెంట్‌ మాజీ జీఎం సుబ్రమణ్యం సిట్‌ అధికారులకు చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కల్తీనెయ్యి కేసులో నిందితులు సుబ్రమణ్యం, అజయ్‌ కుమార్‌ సుగంధ్‌ను నెల్లూరు సెంట్రల్‌ జైలు నుంచి కోర్టు అనుమతితో నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్న సిట్‌ అధికారులు.. మూడో రోజైన గురువారం వివిధ కోణాల్లో వేర్వేరుగా ప్రశ్నించారు. కల్తీ నెయ్యి సరఫరా వెనుక ఎంతమంది అధికారుల పాత్ర ఉంది? వారు ఎవరెవరో చెప్పాలని సిట్‌ ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని సుబ్రమణ్యం చెప్పినట్టు సమాచారం. కల్తీ నెయ్యి సరఫరాలో తన పాత్ర ఏమీ లేదని, తాను జీఎంగా చేరక ముందు నుంచీ ఏయే డెయిరీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయో అవే సంస్థలే తాను పనిచేసినప్పుడు కూడా సరఫరా చేశాయని చెప్పినట్టు తెలిసింది. దేవుడి ప్రసాదమైన లడ్డూ తయారీకి వినియోగిస్తారని తెలిసీ కల్తీ నెయ్యిని ఎలా అనుమతించారని, పాపభీతి లేదా అని సిట్‌ ప్రశ్నించినట్టు సమాచారం. తనకు దేవుడంటే భక్తి, భయం రెండూ ఉన్నాయని, కల్తీ నెయ్యి వ్యవహారంతో తనకు సంబంధం లేదని సమాధానమిచ్చినట్టు తెలిసింది. అలాంటప్పుడు రూ.3.50 లక్షలు ఎవరి నుంచీ తీసుకున్నారు..? ఎందుకు తీసుకున్నారు..? ఆ డబ్బు ఎక్కడ డిపాజిట్‌ చేశారు..? అని సిట్‌ ప్రశ్నించగా సమాఽధానమివ్వలేదని తెలిసింది. మరో నిందితుడు సుగంధ్‌ వరుసగా మూడో రోజు కూడా పెద్దగా నోరు విప్పలేదని తెలిసింది.

Updated Date - Dec 12 , 2025 | 05:27 AM