అంతా షో!
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:47 AM
మొంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాలో మంగళవారం పర్యటించిన తీరుపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల కష్టాలను గాలికొదిలేసి విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి-65పై రోడ్ షోకే వైసీపీ అధినేత ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి తమ నియోజకవర్గాల్లోకి వస్తున్నారని ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిలు భారీగా జన సమీకరణ చేసి బలప్రదర్శన చూపారు. దీంతో మధ్యాహ్నమే పూర్తి కావాల్సిన కార్యక్రమం రాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా సాగింది. పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో కైలే అనిల్ కుమార్, పేర్ని కిట్టు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జగన్ పర్యటన పేరుతో ఎక్కడికక్కడ రోడ్లను బ్లాక్ చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగన్ పర్యటన అంతా ఓ షో అంటూ పెదవి విరిచారు.
- రైతుల కష్టాలను గాలికొదిలేసిన వైఎస్ జగన్
- విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి-65పై రోడ్ షో
- ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్‌చార్జిల బలప్రదర్శన
- మధ్యాహ్నం వరకే అనుమతి.. అయినా రాత్రి వరకు సాగిన పర్యటన
- సీఐపై మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ దుర్భాషలు
- మచిలీపట్నంలో పోలీసులతో పేర్ని కిట్టు వాగ్వాదం
- సీఎం జగన్.. జగన్ అన్నా రఫ్ఫా, రఫ్పా అంటూ కార్యకర్తల నినాదాలు
- పోలీసులు నన్ను కొట్టారంటూ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ వ్యాఖ్యలు
- అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
మొంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాలో మంగళవారం పర్యటించిన తీరుపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల కష్టాలను గాలికొదిలేసి విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి-65పై రోడ్ షోకే వైసీపీ అధినేత ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి తమ నియోజకవర్గాల్లోకి వస్తున్నారని ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిలు భారీగా జన సమీకరణ చేసి బలప్రదర్శన చూపారు. దీంతో మధ్యాహ్నమే పూర్తి కావాల్సిన కార్యక్రమం రాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా సాగింది. పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో కైలే అనిల్ కుమార్, పేర్ని కిట్టు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జగన్ పర్యటన పేరుతో ఎక్కడికక్కడ రోడ్లను బ్లాక్ చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగన్ పర్యటన అంతా ఓ షో అంటూ పెదవి విరిచారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను మాజీ సీఎం వైఎస్ జగన్ పరిశీలించేందుకు వైసీపీ నేతలు అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నారు. పెడన నియోజకవర్గం గూడూరు మండలం రామరాజుపాలెం అడ్డరోడ్డు, ఆకుమర్రు లాకుల వద్ద పొలం సందర్శన, మీడియా సమావేశం, అనంతరం మచిలీపట్నం సౌత మండలంలోని సీతారామపురం, బొంతా వెంకన్న తోట, ఎస్‌ఎన్ గొల్లపాలెంలో పొలాలను పరిశీలించాల్సి ఉంది. కానీ పంట పొలాల సందర్శన కన్నా జాతీయ రహదారిపై రోడ్ షోకే అధినేత అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్ రోడ్ షోగా తరలిరావడం, వైసీపీ కార్యకర్తలు విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి- 65పై ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. పామర్రు నియోజకవర్గం బల్లిపర్రులో దెబ్బతిన్న వరి దుబ్బులను రైతులు తీసుకువచ్చి చూపారు. రైతులకు నష్టం జరిగిందని, మీ తరఫున పోరాటం చేస్తానని జగన్ అన్నారు. గోపవానిపాలెం అడ్డరోడ్డు వద్ద వైసీపీ కార్యకర్తలు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేస్తుంటే పోలీసులు వాహనాల తాళాలను లాక్కున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ అక్కడకు చేరుకుని తాళాలు ఇవ్వాలని సీఐ చిట్టిబాబుతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత మీడియా పాయింట్ వద్ద పోలీసులు తనను కొట్టారని మీడియా, ఇంటెలిజెన్స్ పోలీసులతో చెప్పడం గమనార్హం. ఉదయం ప్రారంభించిన రోడ్డు షో మధ్యాహ్నం 3 గంటలకు గూడూరుకు చేరుకుంది. అక్కడ మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, సింహాద్రి రమేష్, దూలం నాగేశ్వరరావు, జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక వైఎస్ జగన్‌తోపాటు రోడ్‌షోలో పాల్గొన్నారు. పెడన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జనాన్ని ఉదయం 10 గంటలకు గూడూరు వద్దకు తరలించడంతో మధ్నాహ్నం వరకు ఎండలో వారు అల్లాడిపోయారు. రామరాజుపాలెం క్రాస్‌రోడ్ నుంచి పలు గ్రామాలకు చేరేందుకు సింగిల్ రహదారి మాత్రమే ఉంది. గంటల తరబడి ఈ రహదారిపై స్థానిక గ్రామాల ప్రజలను వెళ్లనీయకుండా బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పోలీసులను ఈ రహదారిపై బందోబస్తుగా పెట్టారు. ప్రజలను ఈ రహదారి గుండా సాయంత్రం వరకు వెళ్లనీయకపోవడంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆలస్యంగా ఆకుమర్రుకు..
పెడన నియోజకవర్గంలోని ఆకుమర్రు గ్రామంలో ఉదయం 11 గంటలకు పొలాలను పరిశీలిస్తారని చెప్పినా, ఈ గ్రామానికి సాయంత్రం 4.12 గంటలకు వైఎస్ జగన్ చేరుకున్నారు. అక్కడ పొలాన్ని పరిశీలించిన అనంతరం మీడియా పాయింట్‌కు ఆయన వచ్చే సమయంలో కొందరు జగన్ అన్నా రఫ్ఫా, రఫ్పా, సీఎం, సీఎం అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ఆకుమర్రు వద్ద పొలానికి వెళ్లే సమయంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం తోసివేసిన వైసీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తూర్పు గోదావరి, కడప జిల్లాల నుంచి వచ్చిన వైసీపీ రైతు విభాగం నాయకులు స్థానిక రైతులతో మాజీ సీఎం వచ్చినప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు పంటల బీమా వచ్చిందని, పంట నష్టపరిహాం ఇచ్చారని చెప్పాలని గంటల తరబడి వారికి శిక్షణ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూరియా బస్తాను రూ.500లకు కొనుగోలు చేశామని, ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని కూడా చెప్పాలని స్థానిక రైతులతో వివరించడం కనిపించింది. ఉయ్యూరు మండలం గండిగుంట దగ్గర జగన్ కాన్వాయ్‌లోని ఆ పార్టీ నేతల కార్లు ఢీ కొన్నాయి. మచిలీపట్నం మండలం ఎస్‌ఎన్ గొల్లపాలెం ఫ్లైఓవ ర్ వద్దకు మచిలీపట్నం నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించారు. పరిమితికి మించి ప్రజలను తరలించడంతో పోలీసులు వారిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. దీంతో మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి పేర్ని కిట్టు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన అంతా షో అన్నట్టు సాగిందని విమర్శలు వ్యక్తమయ్యాయి.