CM Chandrababu Naidu: 2029 కల్లా ప్రతి పేదవాడికీ.. సొంతిల్లు
ABN , Publish Date - Nov 13 , 2025 | 03:54 AM
ఇల్లంటే నాలుగు గోడలు మాత్రమే కాదు.. గౌరవం, సంతోషం, భవిష్యత్‌కు భద్రత, ఓ చిరునామా.. అందుకే.. 2029 నాటికి రాష్ట్రంలో పేదలందరికీ సొంతిళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
వచ్చే ఉగాదికి 5.90 లక్షల గృహప్రవేశాలు: ముఖ్యమంత్రి
ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తా
పెద్దలు, పిల్లలకు ఉమ్మడిగా ఇల్లు
బీసీ, ఎస్సీ, ఎస్టీలకులాగే.. ముస్లింలకూ అదనంగా 50 వేలు
గత ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని నిర్వీర్యం చేసింది.. గృహ నిర్మాణ రంగాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసింది
4.73 లక్షల ఇళ్లను రద్దు చేసింది
2.73 లక్షల మందికి రూ.900 కోట్లు చెల్లించలేదు
ఇప్పుడు నిధుల సమస్య ఉన్నా మేం 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశాం
ఇవాళ గృహప్రవేశాలూ చేశాం ప్రతి ఇంట్లోనూ ఓ పారిశ్రామికవేత్త రావాలి: సీఎం చంద్రబాబు
అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో ప్రజావేదిక సభ
కూడు, గూడు, గుడ్డ అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఎన్టీఆర్ దేశంలోనే మొదటగా పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ నేను అధికారంలో ఉన్న ప్రతిసారీ పేదలకు పెద్దఎత్తున ఇళ్లు మంజూరు చేశాను.మేం కుటుంబాలను విడగొట్టదలచుకోలేదు. కలపాలనుకుంటున్నాం.. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు కుటుంబ పెద్దలు, పిల్లలకు ఉమ్మడిగా ఇళ్లు నిర్మించాలనుకుంటున్నాం.
- సీఎం చంద్రబాబు
రాయచోటి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘ఇల్లంటే నాలుగు గోడలు మాత్రమే కాదు.. గౌరవం, సంతోషం, భవిష్యత్‌కు భద్రత, ఓ చిరునామా.. అందుకే.. 2029 నాటికి రాష్ట్రంలో పేదలందరికీ సొంతిళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో 5.90 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు నిర్వహిస్తామన్నారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో బుధవారం జరిగిన ప్రజావేదిక సభ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చాక.. నిధుల లేమి ఇబ్బంది పెడుతున్నా రాష్ట్రవ్యాప్తంగా 3,00,192 ఇళ్లు పూర్తి చేశామన్నారు. పీఎం ఆవాస్ యోజన-లబ్ధిదారుల నేతృత్వంలో 2,28,034, పీఎంఏవై-గ్రామీణ పథకం ద్వారా 65,292, పీఎంఏవై-జన్ మన్ పథకం కింద మరో 6,866 ఇళ్లకు బుధవారం గృహప్రవేశాలు జరిగాయని తెలిపారు.
పట్టణాల్లో గృహ నిర్మాణాలకు కేంద్రం రూ.2.5 లక్షలు, గ్రామీణ ప్రాం తాల్లో రూ.2 లక్షలు ఇస్తోందని, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, ఆదివాసీ గిరిజనులకు రూ.లక్ష అందజేస్తున్నామని చెప్పారు. ఇక నుంచి ముస్లిం మైనారిటీలకు కూడా అదనంగా రూ.50 వే లు ఇస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రలు కొలు సు పార్థసారథి, బీసీ జనార్దన్‌రెడ్డి, మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఎస్‌పీ ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..
భ్రష్టు పట్టించారు
గృహ నిర్మాణ రంగాన్ని గత ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తరిలా చేసి భ్రష్టు పట్టించింది. ఇచ్చిన ఇళ్లను కూడా పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు, గ్రామీ ణ ప్రాంతాల్లో 1.5 సెంట్లతో అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లను మంజూరు చేసింది. అవి కూడా ఊరికి దూరంగా ఎక్కడో కొండలు, గుట్టల్లో ఇచ్చారు. అక్కడ చదును పేరుతో వైసీపీ నాయకులు కోట్లు దోచుకున్నారు. కాలనీల్లో రోడ్లు, నీరు వంటి సౌకర్యాలు కూడా కల్పించలేదు. 4.73 లక్షల ఇళ్లను రద్దు చేయడమే కాకుండా 2.73 లక్షల మందికి రూ.900 కోట్ల మేర డబ్బులు చెల్లించలేదు. ఆ రూ.900 కోట్లను చెల్లించే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.
జలజీవన్ మిషన్‌తో ఇంటింటికీ కుళాయి
గత ప్రభుత్వం తాగునీటి పథకాలనూ నాశనం చేసింది. కేంద్ర జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించాలని నిర్ణయించాం. జగన్ పులివెందులకు కూడా నీళ్లు ఇవ్వలేదు.. మేమిస్తాం.
నాడు పెట్టుబడుల మాటేలేదు
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉద్యోగం, పెట్టుబడులు అనే మాటే వినపడలేదు. పారిశ్రామికవేత్తలు పారిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో మెగా డీఎస్సీ ద్వారా 16,347 మందిని ఉపాద్యాయ పోస్టులు భర్తీచేశాం. రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం.
అనుసంధానంతో కరువుకు చెక్
నదుల అనుసంధానం నాజీవిత ఆశయం. సాగునీటి ప్రాజెక్టులను నేనెన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో తాగు, సాగునీటి కొరతలేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అన్నమయ్య జిల్లాలో వెలిగల్లు ప్రాజెక్టు నిండింది. వచ్చే ఏడాదికి శ్రీనివాసపురం రిజర్వాయర్‌ను పూర్తిచేస్తాం.
లబ్ధిదారులకు నూతన వస్త్రాలు
చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో పేదల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ముందుగా లబ్ధిదారు హేమలత కుటుంబంతో కలిసి గృహప్రవేశం చేశారు. అనంతరం పూజలో పాల్గొన్నారు. హేమలత, ఆమె భర్త ఈశ్వర్‌కు ముఖ్యమంత్రి కొత్త వస్త్రాలు బహూకరించారు. మరో లబ్ధిదారు ముంతాజ్‌బేగం గృహానికి వెళ్లి.. ఆమె గృహంలో నమాజ్‌లో పాల్గొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా కొత్త వస్త్రాలు అందించారు. ఆ కుటుంబానికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నారు. జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఆమె భర్త మహమ్మద్ షరీప్ వీడియో కాల్‌లో సీఎంతో మాట్లాడి తన సంతోషాన్ని పంచుకున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో రాయచోటి నియోజకవర్గంలోని అల్తా్‌ఫబేగం, యలమందు స్వప్న, షేక్ మొహసీన్, అమావాస్యదేవి, ఉయ్యాల అంజనమ్మ అనే మహిళలకు కూడా ఇళ్ల తాళాలను అందజేశారు. ఇంధన పొదుపు పరికరాలను కూడా ఇచ్చారు. అనంతరం సీఎం సమక్షంలో మార్గదర్శి కొణిదల చంద్రకాంత్.. పి.మహబూబ్‌జాన్ బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. ఆమె భర్త పదేళ్ల కిందట మృతిచెందారు.