CM Chandrababu Naidu: ప్రతి చెరువూ నిండాలి
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:28 AM
రాష్ట్రంలో ప్రతి చెరువూ నిండాలని.. ఏపీ కరువు రహితం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలషించారు. వరదలపై సోమవారం ఉండవల్లి నివాసం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రం కరువు రహితం కావాలి
కలెక్టర్లకు సీఎం ఆదేశం
ఈ ఏడాది జలాశయాలన్నీ కళకళ
చెరువులన్నిటినీ అనుసంధానించాలి: సీఎం
అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి చెరువూ నిండాలని.. ఏపీ కరువు రహితం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలషించారు. వరదలపై సోమవారం ఉండవల్లి నివాసం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు మరో ఆరు నెలలు మాత్రమే కరుస్తాయని కలెక్టర్లకు వివరించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం రిజర్వాయర్లన్నీ జలకళ సంతరించుకున్నాయని చెప్పారు. వర్షాలు కురుస్తున్నప్పుడే చెరువులు, రిజర్వాయర్లను గరిష్ఠస్థారులో నింపాలని జల వనరుల శాఖను, కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లోని చెరువులన్నింటినీ అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రమంతా భూగర్భజలాల మట్టాలు పెరగాలని.. కరువనేదే లేకుండా చేయాలని తెలిపారు. రాయలసీమ చెరువుల్లో ఇంకా 9 టీఎంసీల నీటిని నింపాల్సి ఉందన్నారు. రోజూ కృష్ణా, గోదావరి జలాలు లక్షల క్యూసెక్కుల్లో సముద్రంలో కలసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కేవలం 200 టీఎంసీల కోసం పోరాడాల్సి వస్తోందంటూ పరోక్షంగా పోలవరం-బనకచర్ల పథకానికి తెలంగాణ అడ్డు చెప్పడాన్ని ప్రస్తావించారు. నీటి భద్రత పెంచడానికి గతంలో అన్నా హజారే, రాజేంద్రసింగ్ వంటి వారితో కలసి భూగర్భజలాలు పెంచేందుకు చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. గత ఏడాది ఇదే సమయానికి 907 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. రాయలసీమలో ఇంకా 17 శాతం మేర మేజర్ రిజర్వాయర్లు, 22 శాతం మీడియం రిజర్వాయర్లను నింపాల్సి ఉందన్నారు. సమీక్షలో మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.