Annadata Sukhibhava and PM Kisan: ప్రతి రైతు కుటుంబానికీ 20వేలు
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:25 AM
రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది.
కనీసం 10 సెంట్లు.. గరిష్ఠ భూ పరిమితి లేదు
సొంత భూమి లేని కౌలు రైతులకూ వర్తింపు
‘అన్నదాత’-పీఎం కిసాన్ మార్గదర్శకాలు జారీ
అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది. శనివారం నుంచి అమలు జరిగే ఈ పథకంలో కనీసం 10 సెంట్ల భూమి కలిగిన రైతులు, అటవీ భూమి సాగు హక్కుదారులు, భూమి లేని కౌలు రైతులకు ఏడాదికి రూ.20 వేలు చొప్పున లబ్ధి చేకూరనున్నది. ఇందులో రూ.6వేలు పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్నది. మిగతా రూ.14వేలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. ఈ పథకానికి అర్హత కలిగి, భూమి లేని కౌలు సాగుదారులందరికీ రాష్ట్ర బడ్జెట్ నుంచి ఏటా రూ.20వేలు చెల్లించనున్నది. ఈ పథకం అర్హతలో భార్య, భర్త, పెళ్లి కాని పిల్లలను ఒక రైతు కుటుంబంగా, పిల్లలకు పెళ్లిళ్లు అయితే ప్రత్యేక కుటుంబంగా పరిగణించనున్నారు. సాగుభూమిపై చట్టబద్ధంగా హక్కున్న వ్యక్తి భూయజమానిగా గుర్తిసారు. ఏమాత్రం భూమి లేకుండా, లేదా ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూమితో సహా వ్యవసాయ, ఉద్యాన పంటలకు లేదా పట్టు పురుగుల పెంపకానికి భూమిని వార్షిక కౌలుకు తీసుకున్న వ్యక్తిని కౌలుసాగుదారుగా పరిగణించనున్నారు.
ప్రస్తుత, మాజీ.. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, జడ్పీ చైర్‌పర్సన్లు, రిటైరైన, ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, శాఖలు, అనుబంధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు, స్థానిక సంస్థల్లోని రెగ్యులర్ ఉద్యోగులు, రిటైరైన, ప్రస్తుత అధికారులు అనర్హులు. నెలకు రూ.10వేలు పైన ప్రభుత్వ పెన్షన్ తీసుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్ వంటి వృత్తి నిపుణులు, అండర్ టేకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నవారు, గృహాలుగా మార్చిన వ్యవసాయ భూములు కలిగిన వ్యక్తులు, ఆక్వా సాగు, వ్యవసాయేతర వినియోగం కోసం రెవెన్యూ రికార్డుల్లో సవీకరించిన భూములున్న వారిని ఈ పథకం నుంచి మినహాయించారు. అయితే నెలకు రూ.20వేల లోపు జీతం తీసుకునే ఉద్యోగులకు, సిబ్బందికి ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ పథకంలో ఉమ్మడి కుటుంబంలో అత్యధిక భూమి కలిగిన వ్యక్తి బ్యాంకు ఖాతాకు ఈ పథకం సొమ్ము జమ కానున్నది. కౌలు రైతుగా లబ్ధి పొందాలంటే వారి కుటుంబ సభ్యులకు సొంత భూమి ఉండకూడదు. గరిష్ఠ భూ పరిమాణంతో నిమిత్తం లేకుండా ప్రతి భూ యజమాని కుటుంబంలో ఒక సాగుదారుకే ప్రయోజనం లభించనున్నది.
భూయజమాని ద్వారా ఒక కౌలు సాగుదారుకు మాత్రమే లబ్ధి చేకూరనున్నది. ఒకే భూమి యజమానికి అనేక మంది లీజుదారులున్నా.. అందులో షెడ్యూల్డ్ తెగల కౌలుసాగుదారుకు ప్రాధాన్యం ఇస్తారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో చట్ట ప్రకారం బహుళ లీజు ఒప్పందాలు కలిగిన భూమి లేని సాగుదారులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ పథకం నుంచి మినహాయుంచిన యజమానుల భూములను సాగు చేస్తున్న కౌలుదారులు ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. దేవదాయ, రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇనాం, దేవాలయ భూములు సాగు చేసే కౌలుదారులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది. కౌలుసాగుదారు పత్రం, ఈ-పంట నమోదు ద్వారా కౌలు రైతులను ఎంపిక చేస్తారు. రెవెన్యూ వెబ్‌ల్యాండ్, ఆర్వోఎ్‌ఫఆర్ డేటా ప్రకారం భూ యజమానులను ఆర్టీజీఎస్ గుర్తించగా, గ్రామ సచివాలయాల ద్వారా కుటుంబ సమాచారం, సీఎ్‌ఫఎంఎస్ ద్వారా ఉద్యోగుల డేటా, గ్రామస్థాయిలో రైతు సేవా కేంద్రాల ఇన్‌చార్జిల ద్వారా లబ్ధిదారుల ధ్రువీకరణ జరుగుతుంది. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే అర్హులందరూ ఈ-కేవైసీ చేయించుకోవాలి. పథకం సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. నగదు బదిలీ అయ్యాక లబ్ధిదారుల ఫోన్లకు సంక్షిప్త సందేశం వస్తుంది. ఈ పథకానికి అర్హత ఉండీ లబ్ధి చేకూరకపోతే రైతుసేవా కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించి, రెండు వారాల్లోగా సమస్యను పరిష్కరిస్తారు. ఫిర్యాదుల కోసం 155251 టోల్‌ఫ్రీ నంబరు వినియోగించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.