ప్రతి నీటి బొట్టూ సద్వినియోగం కావాలి: సీఎం
ABN , Publish Date - Aug 01 , 2025 | 06:07 AM
సముద్రంలోకి వృథాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రత్యేకించి రాయలసీమ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు ఈ నీటిని తరలించాలన్నారు.
అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): సముద్రంలోకి వృథాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రత్యేకించి రాయలసీమ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు ఈ నీటిని తరలించాలన్నారు. గురువారం సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ఆరా తీశారు. ప్రతినీటి బొట్టూ సద్వినియోగం కావాలని ఆదేశించారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని.. సోమశిల, కండలేరు, గండికోట, బ్రహంసాగర్, పైడిపాలెం తదితర రిజర్వాయర్లన్నీ నింపాలని స్పష్టంచేశారు. సీమ రిజర్వాయర్లు, చెరువులు నింపాలంటే ఇంకా 132 టీఎంసీల జలాలు అవసరమని అధికారులు చెప్పారు. వీలైనంతవరకూ వ్యయం లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అన్నారు. చెరువులు నింపడంతో పాటు భూగర్భ జలాల మట్టాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. భూగర్భ జలాలు ఒక మీటరు పెరిగితే.. 120 టీఎంసీల నీటిని నిల్వ చేసినట్లని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 9.8 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయని.. దాన్ని 5 మీటర్లకు తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమీక్షలో మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి పాల్గొన్నారు.