మూడేళ్లయినా..!
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:50 AM
ప్రభుత్వ ఆస్పత్రిలో మెగా నిర్మాణాలు తుది దశకు చేరినా అందుబాటులోకి రాకపోవటంతో ఆందోళన నెలకొంటోంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెనుక మెడికల్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన బహుళ అంతస్థుల హాస్టల్ భవనం పూర్తయినా ఫినిషింగ్ పనులకు నోచుకోకుండా ఆగిపోయింది. జీజీహెచ్‌లో ప్రస్తుత 3వ బ్లాక్ పక్కనే అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేస్తున్న 4వ బ్లాక్ పనులు కూడా సాగుతున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో ఈ రెండూ మెగా నిర్మాణాలు. తుది దశకు చేరినా అందుబాటులోకి రాకపోవటంతో అటు వైద్య విద్యార్థులకు, ఇటు రోగులకు ఇబ్బందికరంగా మారింది. ఈ మెగా నిర్మాణాలపై వైద్యారోగ్యశాఖ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
- విజయవాడ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో నత్తనడకన నిర్మాణ పనులు
- అసంపూర్తిగా పీజీ హాస్టల్, అత్యవసర విభాగాలు
- శిథిలావస్థకు చేరిన పాత వసతి గృహం
- ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, రోగులు
- జూన్ కల్లా పూర్తి చేస్తామంటున్న సూపరింటెండెంట్
ప్రభుత్వ ఆస్పత్రిలో మెగా నిర్మాణాలు తుది దశకు చేరినా అందుబాటులోకి రాకపోవటంతో ఆందోళన నెలకొంటోంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెనుక మెడికల్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన బహుళ అంతస్థుల హాస్టల్ భవనం పూర్తయినా ఫినిషింగ్ పనులకు నోచుకోకుండా ఆగిపోయింది. జీజీహెచ్‌లో ప్రస్తుత 3వ బ్లాక్ పక్కనే అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేస్తున్న 4వ బ్లాక్ పనులు కూడా సాగుతున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో ఈ రెండూ మెగా నిర్మాణాలు. తుది దశకు చేరినా అందుబాటులోకి రాకపోవటంతో అటు వైద్య విద్యార్థులకు, ఇటు రోగులకు ఇబ్బందికరంగా మారింది. ఈ మెగా నిర్మాణాలపై వైద్యారోగ్యశాఖ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
విజయవాడ/ప్రభుత్వాసుపత్రి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి):
ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, కోస్తా జిల్లాల పేదలకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది విజయవాడ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి. ఇక్కడకు వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయి. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వచ్చాక సేవలు మరింత విస్తృతమయ్యాయి. అయినప్పటికీఆస్పత్రిలో కొన్ని సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఎనిమిది విభాగాలున్నాయి. ప్రతి సంవత్సరం ఒక్కో విభాగం నుంచి ఇద్దరు చొప్పున పదహారు మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచిత వసతి, భోజనం సదుపాయాలు కల్పిస్తారు. దీనివల్ల ఇక్కడే వైద్యులను తయారు చేసి వైద్యుల కొరత అధిగమించవచ్చని ప్రభుత్వానికి తట్టిన మంచి ఆలోచన ఇది. వీరే కాకుండా వైద్య విద్యనభ్యసించే అనేక మంది ఇక్కడ శిక్షణకు వచ్చే విద్యార్థులకు ఉచిత హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రస్తుతం వైద్య విద్యార్థులు ఉంటున్న భవనం పాతది కావడం, శిథిల స్థితికి చేరటంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వెనుక హాస్టల్ భవనం పనులకు మూడేళ్ల కిందట శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించటం జరిగింది. పీజీ విద్యార్థులు ఉంటున్న ప్రస్తుత భవనం బాగా పాతది కావడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. విద్యార్థులు ప్రతి సంవత్సరం ఈ ఏడాది కొత్త భవనంలోకి వెళ్తామనుకోవడం తప్ప వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ హాస్టల్ అందుబాటులోకి రాలేదు. మెడికల్ విద్యార్థుల కోర్సు పూర్తయ్యేనాటికి కూడా వసతి భవనం పూర్తి కాకపోవడంతో కొత్త హాస్టల్‌లో గడపకుండానే వెళ్తున్నామనే నిరాశతో కోర్సు పూర్తిచేసుకుని కాలేజీని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తోంది. ఈ భవన నిర్మాణం మొదలుపెట్టి నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ భనవ నిర్మాణం పూర్తి కాకపోవడంతో వైద్య విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఈ బిల్డింగ్ పనులు చివరి దశకు వచ్చినప్పటికీ, తమ విద్య పూర్తయ్యే నాటికైనా అందుబాటులోకి వస్తే బాగుంటుందని ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి సూపరింటెండెంట్‌ను అడగగా నిధుల కొరతతో ఆలస్యమవుతోందని, ఈ విషయాన్ని ఇప్పటికే అధికారులు దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ ఏడాది జూన్ చివరి నాటికి ఎలాగైనా భవన నిర్మాణాలు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకువస్తామన్నారు.
అత్యవసర విభాగ భవనం అందుబాటులోకి వచ్చేదెపుడు?
జీజీహెచ్‌లో సెంట్రల్ డయాగ్నోస్టిక్ బ్లాక్ పక్కన అత్యవసర విభాగం కోసం నిర్మాణం చేపట్టిన భవనం నత్తనడకగా సాగుతోంది. నాలుగు సంవత్సరాల కిందట శంకుస్థాపన చేసిన ఈ భవనం ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉంది. ఉమ్మడి కృష్ణాజిల్లాతో పాటు గుంటూరు, కోస్తా జిల్లాల రోగులు చికిత్స నిమిత్తం అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారు. దీనితో ఈ ఆస్పత్రిలో రోగుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల కొంతవరకు వైద్యం ఆలస్యమయ్యే అవకాశమూ ఉంది. రాజధాని నగరం కావడం, ఆస్పత్రి రద్దీ దృష్ట్యా ప్రభుత్వం ఈ ఆస్పత్రిపై మరింత శ్రద్ధ వహిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం వెనకబడిందనే చెప్పుకోవాలి. అధికార యంత్రాంగం మొత్తం నిక్షిప్తమై ఉన్న రాజధాని నగరంలోనే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కేవలం రెండు భవనాల నిర్మాణానికే ఏళ్ల తరబడి కాలం వెల్లదీస్తున్నారంటే ఇతర విభాగాలకు సంబంధించిన విషయాలపై మరెంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో చెప్పుకోనవసరం లేదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర విభాగానికి సంబంధించిన భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తే ప్రజలకు తక్కువ సమయంలో మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది.