Scrutinizes: వైసీపీ ఎమ్మెల్యేలపై ఎథిక్స్ కమిటీ దృష్టి
ABN , Publish Date - Sep 24 , 2025 | 05:17 AM
వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా రిజిస్టర్‌లో సంతకాలు చేసి, జీతభత్యాలు తీసుకోవడంపై శాసనసభ ఎథిక్స్ కమిటీ దృష్టి సారించింది.
సభకు రాకుండా సంతకాలు పెట్టడం.. జీతభత్యాలు
తీసుకోవడంపై చర్చ.. తదుపరి సమావేశంలో తుది నిర్ణయం
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా రిజిస్టర్‌లో సంతకాలు చేసి, జీతభత్యాలు తీసుకోవడంపై శాసనసభ ఎథిక్స్ కమిటీ దృష్టి సారించింది. ఎథిక్స్ కమిటీ తొలి సమావేశం మంగళవారం కమిటీ చైర్మన్ మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా రిజిస్టర్‌లో సంతకాలు పెట్టడ ం, జీతభత్యాలు తీసుకోవడం, అలాగే ఎమ్మెల్యేలు బహిరంగ వేదికలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్యపదజాలం వాడటంపైనా చర్చ జరిగింది. ఈ రెండు అంశాలు ఆమోదయోగ్యమేనా అనేదానిపై ఎథిక్స్ కమిటీ తదుపరి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. వచ్చే సమావేశం నాటికి ఎమ్మెల్యేల హాజరుపట్టీని తమ ముందు ఉంచాలని శాసనసభ సెక్రటేరియట్‌ను కమిటీ ఆదేశించింది. ఎథిక్స్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ముప్పి డి వెంకటేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, బత్తుల బలరామకృష్ణతో పాటు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.