Share News

Etcherla BJP MLA Eswar Rao: బీజేపీ ఎమ్మెల్యేనని ఇబ్బంది పెడతారా

ABN , Publish Date - Sep 23 , 2025 | 05:36 AM

బీజేపీ ఎమ్మెల్యేనని తన పక్క నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే, ఇతరులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

Etcherla BJP MLA Eswar Rao: బీజేపీ ఎమ్మెల్యేనని ఇబ్బంది పెడతారా

  • వైసీపీ వ్యక్తి మైనింగ్‌కు కూటమి ఎమ్మెల్యే దన్ను

  • అసెంబ్లీలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆరోపణ

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): బీజేపీ ఎమ్మెల్యేనని తన పక్క నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే, ఇతరులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. గతేడాది జూన్‌ 4న తాము ఎమ్మెల్యేలుగా ధృవీకరణపత్రాలు అందుకుంటే, ఆ మరుసటి రోజే తన నియోజకవర్గంలో జీకే ఇన్‌ఫ్రా అనే వైసీపీ నాయకుడి మైనింగ్‌ కంపెనీకి అనుమతులు ఇచ్చారని తెలిపారు. వారికి తన పక్క నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పైగా తాను డబ్బులు అడిగానని, బ్లాక్‌ మెయిల్‌ చేశానని దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తనకూ క్వారీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.


జీరో అవర్‌లో సమస్యలు లేవనెత్తిన ఎమ్మెల్యేలు

  • గోదావరి-పెన్నా ప్రాజెక్టును పునఃప్రారంభించి పల్నాడు రైతులను ఆదుకోవాలని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కోరారు. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును ఆపేయడంతో వందల కోట్ల విలువైన మెటీరియల్‌ తుప్పు పడుతోందన్నారు.

  • తన నియోజకవర్గంలో యూరియా కొరత ఎక్కువగా ఉందని, ప్రభుత్వం చొరవ తీసుకుని ఎరువులు అందించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి కోరారు.

  • అనంతపురంలో ఆర్‌డీటీ సంస్థ సేవలు తిరిగి కొనసాగేలా చర్యలు తీసుకోవాలని పరిటాల సునీత, బండారు శ్రావణి కోరారు.

  • ఇనాం భూముల సమస్యలు పరిష్కరించి రైతులకు హక్కులు కల్పించాలని లోకం నాగ మాధవి కోరారు. వీరికి అన్నదాత సుఖీభవ నిధులు కూడా ఇవ్వలేదని చెప్పారు.

  • మార్కాపురంలో మినీ మిర్చి యార్డు నిర్మించాలని నారాయణరెడ్డి కోరారు. అక్కడి రైతులు గుంటూరు వచ్చి మిర్చి అమ్ముకోవాల్సి వస్తోందన్నారు.

  • పెసర పంటను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొని రైతులను ఆదుకోవాలని తంగిరాల సౌమ్య కోరారు.

  • వైసీపీ హయాంలో చేసిన అడ్డగోలు మ్యాపింగ్‌ వల్ల చాలా కుటుంబాల్లో రేషన్‌ ఇబ్బందులు తలెత్తాయని గౌతు శిరీష చెప్పారు. రేషన్‌ కార్డుల విభజన, పేర్ల తొలగింపునకు అవకాశం కల్పించాలని కోరారు.


‘విశాఖ డెయిరీ’ నివేదిక గడువు పొడిగింపు

విశాఖ డెయిరీ అక్రమాలపై జరుగుతున్న విచారణ నివేదికను సమర్పించే గడువును ఆరు నెలలు పొడిగించినట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. డెయిరీ చైర్మన్‌ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కాగా, 2014-19లో ఆప్కాబ్‌, డీసీసీబీలు,పీఏసీఎస్‌లలో అవినీతి ఆరోపణలపై విచారణకు ప్రత్యేక సభా సంఘాన్ని పునర్‌వ్యవస్థీకరిస్తున్నట్లు వెల్లడించారు.

Updated Date - Sep 23 , 2025 | 05:36 AM