Share News

Health Department: పలుకుబడికే పదోన్నతి

ABN , Publish Date - Jun 16 , 2025 | 05:17 AM

కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ)లో బదిలీల తంతు చూస్తే.. వడ్డించేవాడు మనోడైతే.. కడబంతిలో కూర్చొన్నా అన్ని వస్తాయి.. అన్న సామెత గుర్తొస్తుంది! పలుకుబడి ఉన్నోడికే పదోన్నతి...

Health Department: పలుకుబడికే పదోన్నతి

  • ఈఎస్ఐలో బదిలీలు, పోస్టింగ్స్‌లో ఇదే అర్హత

  • జేడీల బదిలీల్లో అధికారుల ఇష్టారాజ్యం

  • ఐదేళ్ల సర్వీసు పూర్తయితే స్టేషను మారాల్సిందే కానీ.. ఎనికేపాడు నుంచి ఎనికేపాడుకే ఇద్దరు బదిలీ

  • జూనియర్ల కింద స్పెషల్‌ గ్రేడ్‌ సర్జన్లు

  • మంత్రి, ఉన్నతాధికారుల అండతోనే ఇలా?

అమరావతి, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ)లో బదిలీల తంతు చూస్తే.. వడ్డించేవాడు మనోడైతే.. కడబంతిలో కూర్చొన్నా అన్ని వస్తాయి.. అన్న సామెత గుర్తొస్తుంది! పలుకుబడి ఉన్నోడికే పదోన్నతి, పోస్టింగ్‌ అన్న రీతిలో అధికారులు వ్యవహరించారు. ఇటీవల కొంత మంది వైద్యులకు ఇచ్చిన పదోన్నతుల్లో అధికారులు పలుకుబడినే ప్రాతిపదికగా తీసుకున్నారు. పలుబడి ఉన్న అధికారుల విషయంలో ఒకే స్టేషన్‌ అంటే ఒకే ఆఫీస్‌గా, పలుబడి లేని వారిని ఒకే స్టేషన్‌ అంటే ఒకే ఊరుగా భావించి బదిలీల ప్రక్రియను చేపట్టడం గమనార్హం. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో ఇదే పద్ధతిని అవలంబించారు. అధికారులు జారీ చేసిన ఆర్డర్లను వారే పాటించలేదు. వివరాలివీ.. విజయవాడలోని పటమట పీహెచ్‌సీలో పని చేసే ఒక సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ వైద్యురాలు ఐదేళ్లుగా అదే డిస్పెన్సరీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె సాధారణ బదిలీల్లో భాగంగా స్టేషన్‌ మారాలి. కాబట్టి ఎనికేపాడులో ఉన్న ఈఎ్‌సఐ ప్రధాన కార్యాలయంలో సీఏఎస్‌ పోస్టు ఖాళీ ఉంటే ఆ పోస్టులోకి బదిలీ చేయాలంటూ ఆప్షన్‌ పెట్టుకున్నారు. ఇదే పోస్టు కోసం మరో ముగ్గురు వైద్యులు ఆప్షన్‌ పెట్టుకున్నారు. పటమటకూ ఎనికేపాడుకూ పెద్ద దూరం కాదు. కనుక దీనిని స్టేషన్‌ మారినట్లు పరిగణించాలా? లేదా ఆమెను వేరే ఊరికి బదిలీ చేయాలా అన్న విషయమై సృష్టత ఇవ్వాలని ఈఎ్‌సఐ ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని కోరారు. పటమట, ఎనికేపాడు విజయవాడలో భాగమే కనుక, ఆమెను వేరే ప్రదేశానికి బదిలీ చేయాలని ప్రభుత్వం నుంచి బదులు వచ్చింది. ఈమేరకు ఆ వైద్యురాలిని గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు.


ఆ పోస్టులోకి వచ్చేందుకు ఆప్షన్‌ ఇచ్చిన మరో ఇద్దరు వైద్యులను కూడా వేరో జిల్లాకు బదిలీ చేశారు. కానీ, ఇద్దరు జాయింట్‌ డైరెక్టర్‌ విషయంలో మాత్రం అధికారులు ఈ నిబంధన పాటించలేదు. ఈఎస్ఐ ప్రధాన కార్యాలయంలో పని చేసే ఒక జాయింట్‌ డైరెక్టర్‌, విజయవాడఈఎస్ఐ జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్న మరో అధికారి ఏడేళ్ల నుంచి అవే పోస్టుల్లో పని చేస్తున్నారు. సాధారణ బదిలీల్లో వీరు కచ్చితగా స్టేషన్‌ మార్చాలి. కానీ విచిత్రంగా ఒక అధికారిని ఎనికేపాడులో ఉన్నఈఎస్ఐ ప్రధాన కార్యాలయం నుంచి ఎనికేపాడులో ఉన్న ఈఎ్‌సఐ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయానికి బదిలీ చేశారు. మరో అధికారిని జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి ఈఎ్‌సఐ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ రెండు కార్యాలయాల మధ్య కేవలం అర కిలోమీటర్‌ దూరం మాత్రమే ఉంటుంది. జేడీలు తమ పలుకుబడి ఉపయోగించడంతో ఈఎస్ఐ ఉన్నతాధికారులు కూడా వారు విజయవాడలోనే ఉండే విధంగా సహకరించారు. ఈఎస్ఐలో చేపట్టిన బదిలీల్లో చాలా వరకూ ఇదే విధంగా చేశారన్న విమర్శలు వస్తున్నాయి.


సూపరింటెండెంట్లుగా జూనియర్లు

ఈఎస్ఐలో ఏడుగురు సీనియర్‌ సివిల్‌ సర్జన్‌ వైద్యులకు స్పెషల్‌ గ్రేడ్‌ సివిల్‌ సర్జన్‌గా మే నెలలో పదోన్నతి కల్పించారు. తర్వాత పోస్టింగ్‌లో భాగంగా విశాఖపట్నం వంద పడకల ఆస్పత్రికి ముగ్గురు, విజయవాడకు ఇద్దరు, తిరుపతికి ఇద్దరు సీనియర్‌ వైద్యులకు పోస్టింగ్‌ ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఈఎ్‌సఐ ఆస్పత్రులకు స్పెషల్‌ గ్రేడ్‌ సివిల్‌ సర్జన్లు ఆస్పత్రుల సూపరింటెండెంట్లుగా ఉండాలి. అయితే, ఏడుగురిలో ఎవ్వరికీ సూపరింటెండెంట్లుగా పోస్టింగ్స్‌ ఇవ్వలేదు. విశాఖపట్నంలో ఉన్న ఈఎ్‌సఐ వంద పడకల ఆస్పత్రికి మాత్రమే స్పెషల్‌ గ్రేడ్‌ సివిల్‌ సర్జన్‌ను సూపరింటెండెంటుగా ఉన్నారు. విజయవాడ, తిరుపతిలో స్పెషల్‌ గ్రేడ్‌ సివిల్‌ సర్జన్లు ఉన్నప్పటికీ జూనియర్లను సూపరింటెండెంట్లుగా కొనసాగిస్తున్నారు. దీంతో సీనియర్‌ వైద్యులు వెళ్లి జూనియర్ల కింద పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తిరుపతికి చెందిన ఒక వైద్యుడు తాను నెల రోజుల్లో రిటైర్‌ కాబోతున్నానని, సూపరింటెండెంటుగా అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులకు లేఖలు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. జూనియర్‌ వైద్యులు.. మంత్రి, ఉన్నతాధికారుల వద్ద పలుకుబడి ఉపయోగించి సూపరింటెండెంట్లుగా కొనసాగుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Updated Date - Jun 16 , 2025 | 05:24 AM