Task Force Police: తప్పించుకున రిమాండ్ ఖైదీలు దొరికారు
ABN , Publish Date - Sep 07 , 2025 | 05:31 AM
అనకాపల్లి జిల్లా చోడవరం సబ్‌జైలు నుంచి తప్పించుకున్న రిమాండ్ ఖైదీలు ఇద్దరినీ శనివారం విశాఖలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
విశాఖలో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది
విశాఖపట్నం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా చోడవరం సబ్‌జైలు నుంచి తప్పించుకున్న రిమాండ్ ఖైదీలు ఇద్దరినీ శనివారం విశాఖలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న నక్కా రవికుమార్ (30), బెజవాడ రాము (26) శుక్రవారం విధుల్లో ఉన్న డిప్యూటీ జైలర్‌ను సుత్తితో కొట్టి జైలు నుంచి పరారైన విషయం తెలిసిందే. వీరిని పట్టునేందుకు అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అలాగే నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆధ ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. అందులో భాగంగా టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ భరత్‌కుమార్‌రాజు తన సిబ్బందితో ద్వారకా నగర్ ఆర్టీసీ బస్‌స్టేషన్ పరిసరాల్లో గాలిస్తుండగా రవికుమార్, రాములు కాంప్లెక్స్ వైపు నుంచి డాబాగార్డెన్స్ వైపు నడుచుకుంటూ వెళ్లడం గమనించారు. గొల్లలపాలెం ఎస్‌బీఐ జంక్షన్ వద్ద చాకచక్యంగా ఇద్దరినీ పట్టుకున్నారు. ఇద్దరినీ చోడవరం పోలీసులకు అప్పగించారు.