Minister Mandaviya: ఈపీఎస్-95 కనీస పెన్షన్‌పై త్వరలో ప్రకటన
ABN , Publish Date - Aug 07 , 2025 | 03:54 AM
ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్-95 పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యపై త్వరలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుందని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.
విశాఖ ఎంపీతో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ
విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్-95 పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యపై త్వరలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుందని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఆయన్ను బుధవారం ఢిల్లీలో విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ కలిశారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తక్కువ పెన్షన్‌తో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్ మొత్తం పెంచాలి. చెల్లింపులను వేగవంతం చేయా లి. పెన్షనర్లు గౌరవంగా జీవించేందుకు అవసరమైన సహకారం అందించాలి’ అని ఎంపీ కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలో దీనిపై కీలక ప్రకటన వస్తుందన్నారు. ఈ సమస్యపై ఈపీఎస్-95 పెన్షనర్లు చాలా కాలంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. కనీస పెన్షన్ మొత్తాన్ని కనిష్ఠంగా రూ.7,000కు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పెన్షనర్లు, వారి జీవిత భాగస్వామికి ఆరోగ్య బీమా ఉచితంగా కల్పించాలనే డిమాండ్ కూడా ఉంది. కేంద్రం దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే దేశంలో సుమారు 80 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. కాగా, ఖేల్ ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నేపథ్యంలో విశాఖపట్నంలో మార్షల్ ఆర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంపీ శ్రీభరత్ ఓ ప్రతిపాదనను మంత్రికి అందజేశారు. ఈ సెంటర్ పెడితే యువ అథ్లెట్లకు ఆధునిక శిక్షణ లభిస్తుందన్నారు.