Minister Lokesh: ప్రాణనష్టం లేకుండా చూడడమే లక్ష్యం
ABN , Publish Date - Oct 29 , 2025 | 04:12 AM
తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తోందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల్లోనే ఉండాలి: లోకేశ్
అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తోందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో హోంమంత్రి అనితతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 40 లక్షల మందిపై ప్రభావం ఉండే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు. ‘1,238 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. 1,906 తాత్కాలిక సహాయ శిబిరాలు ఏర్పాటు చేశాం. సహాయ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాం’ అని వివరించారు. తాగునీటి సరఫరాపైనా దృష్టి సారించామన్నారు. హోంమంత్రి అనిత, తాను తుఫాను ప్రాంతాల ప్రజాప్రతినిధులతో మాట్లాడి వారిని అప్రమత్తం చేశామని తెలిపారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉండాలని ఆదేశిస్తున్నామన్నారు. ప్రజలు ఇబ్బందులు ఉన్న చోట ఫొటోలు తీసి పంపితే స్పందిస్తామని చెప్పారు.