Share News

Minister Dola: విద్యార్థుల విద్య, ఆరోగ్య భద్రతల్లో రాజీపడం

ABN , Publish Date - Jul 16 , 2025 | 06:28 AM

విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రత అంశాల్లో కూటమి ప్రభుత్వం రాజీపడే ప్రసక్తేలేదని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Minister Dola: విద్యార్థుల విద్య, ఆరోగ్య భద్రతల్లో రాజీపడం

  • మిగిలిపోయిన గురుకులాలు, వసతి గృహాల సీట్లు భర్తీ చేయండి

  • కొత్త హాస్టళ్ల భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి

  • సాంఘిక సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి డోలా

అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రత అంశాల్లో కూటమి ప్రభుత్వం రాజీపడే ప్రసక్తేలేదని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశాలు, ప్రీ మెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్పులు, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు పరిహారం, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన, ఎస్సీ కాంపోనెంట్‌, లిడ్‌క్యాప్‌ పైనా మంత్రి సమీక్షించారు. గురుకులాలు, వసతి గృహాల్లో మిగిలిన సీట్లు భర్తీ చేయాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు ముందుగానే స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేయాలని సూచించారు. పీఎం అజయ్‌ కింద నిర్మిస్తున్న నూతన హాస్టళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, గురుకులాలు, హాస్టళ్లలో మరమ్మత్తుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పరిశుభ్రత పారిశుధ్యాన్ని పెంపొందించాలని, గ్రామ, వార్డ్‌ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ తప్పనిసరిగా గ్రామంలోని గురుకులం, సంక్షేమ వసతి గృహాన్ని తనిఖీ చేయాలన్నారు. అనారోగ్యంతో మరణించిన విద్యార్థుల కుటుంబానికి సాంత్వన పథకంతో రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎంఎం నాయక్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గురుకులాల కార్యదర్శి వి.ప్రసన్న వెంకటేశ్‌, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ లావణ్య వేణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 06:29 AM