Palnadu District: ఆ విద్యార్థుల ఉసురు తీసిన ముఠా అరెస్టు
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:34 AM
పల్నాడు జిల్లా చిలకలూరిపేట బైపాస్ రోడ్డుపై వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు.
లారీ డ్రైవర్‌ను కొట్టి.. దోచుకుందామని ఏఎస్సై కుమారుడి గ్యాంగ్ స్కెచ్
ఖాకీల నీడలో జోరుగా అక్రమ దందాలు
వీరి పాత నేరాలు వెల్లడించని పోలీసులు
చిలకలూరిపేట/నరసరావుపేట, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా చిలకలూరిపేట బైపాస్ రోడ్డుపై వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనకు కారకులైన ఐదుగురు సభ్యుల ముఠాను నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు శుక్రవారం నాదెండ్లలో అరెస్టు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హైవేపై ట్రాక్టర్ల లోడ్‌తో వెళ్తున్న లారీని ఆపి, డ్రైవర్‌ను కొట్టి నగదు దోచుకోవాలని ఈ ముఠా స్కెచ్ వేసింది. ఈ క్రమంలోనే లారీని ఆపారు. ఈ సమయంలో లారీ డ్రైవర్ ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా.. సడన్‌గా బ్రేక్‌లు వేసి రోడ్ మార్జిన్ వైపు లారీని తీస్తుండగా వెనుక వస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థుల కారు లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితులను గుర్తించాం. అరెస్టయిన వారిలో మదమంచి వెంకట అనుజ్ఞనాయుడు(32)(నరసరావుపేట), పుల్లంశెట్టి మహేశ్(29)(నకరికల్లు), బెల్లంకొండ గోపి(31)(నకరికల్లు), షేక్ నబీ బాషా(25)(చినతురకపాలెం), నాలి వెంకట రావు(38)(నరసరావుపేట టౌన్) ఉన్నారు. నిందితులు ఉపయోగించిన కారును, వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం.’’ అని తెలిపారు.
గ్యాంగ్‌ను రక్షిస్తోంది ఎవరు?
ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి కేసులో అరెస్టయిన వారిలో నరసరావుపేట ఏఎస్ఐ కుమారుడు మదమంచి వెంకట అనుజ్ఞనాయుడు అలియాస్ వెంకట్ అలియాస్ నాయుడు(32) ప్రధాన నిందితుడు. అయితే విచారణలో వెల్లడైనట్లు ప్రచారం జరుగుతున్న అంశాలను అరెస్టు సందర్భంగా పోలీసులు పేర్కొనకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నరసరావుపేటలో బంగారం పేరుతో రూ.40 లక్షలు కాజేసినట్లు గతంలో ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకొకుండా నాయుడుని వదిలేశారని అప్పట్లో పోలీసు శాఖపై విమర్శలొచ్చాయి. కార్లు అపహరించారని కూడా విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఓ పోలీసు అధికారికి సంబంధించిన కారును ఈ గ్యాంగ్ వినియోగించినట్లు తెలుస్తోంది. రహదారుల్లో వాహనాలు నిలిపి రవాణ శాఖ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తున్నా ఈ అంశాలను ప్రస్తావించ లేదు. ఏఎస్ఐని బదిలీ చేసి పోలీసు శాఖ చేతులు దులుపుకోవడంపై విమర్శలొస్తున్నాయి. ఇదిలాఉండగా, ఓ పోలీసు అధికారి నిర్వహించే సంస్థకు నాయుడు విరాళాలు ఇచ్చారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖలో కీలక పోస్టులో ఉన్న సదరు అధికారి నాయుడును సత్కరించినట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి కేసులో సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఏఎస్ఐ కుమారుడి నిర్వాకం బయటపడింది. లేకుంటే.. కొందరు ఖాకీల నీడలో అతను చేస్తున్న దందాలు ఎప్పటికీ వెలుగు చూసేవి కావన్న ఆభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.