Share News

Inter Caste Love: ప్రేమించాడని.. చంపేశారు!

ABN , Publish Date - Dec 11 , 2025 | 03:58 AM

ఆ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు.. విషయంలో పెద్దలకు తెలిసింది.. కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వారి ప్రేమకు అడ్డు చెప్పారు...

Inter Caste Love: ప్రేమించాడని.. చంపేశారు!

  • పెళ్లి చేస్తామంటూ ఇంటికి పిలిచి దారుణం

  • అబ్బాయి తలపై క్రికెట్‌ బ్యాట్‌తో మోదిన అమ్మాయి తల్లిదండ్రులు

  • బీరంగూడలో ఇంజనీరింగ్‌ విద్యార్థి దారుణ హత్య

  • మృతుడు ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన శ్రవణ్‌సాయి

అమీన్‌పూర్‌, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఆ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు.. విషయంలో పెద్దలకు తెలిసింది.. కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వారి ప్రేమకు అడ్డు చెప్పారు. తమ కుమార్తెతో తిరగొద్దంటూ పలుమార్లు హెచ్చరించారు. అయినా, వారు పట్టించుకోలేదు. ఎలాగైన వారిని విడదీయాలని భావించిన అమ్మాయి తల్లిదండ్రులు.. పెళ్లి చేస్తామంటూ వారిని నమ్మించారు. పథకం ప్రకారం అబ్బాయిని ఒంటరిగా ఇంటికి రమ్మని పిలిచారు. అది నిజమేనని నమ్మి వచ్చిన అతన్ని.. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు కలిసి.. కొట్టి చంపేశారు! ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా బీరంగూడలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన శ్రవణ్‌సాయి (19)కి తల్లిదండ్రులు లేరు. అమీన్‌పూర్‌లో ఉంటు న్న పెద్దనాన్న కాకాని వెంకటేశ్వరరావు దగ్గర ఉంటున్నాడు. బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న శ్రవణ్‌.. ప్రస్తుతం కుత్బుల్లాపూర్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటూ మైసమ్మగూడలోని కాలేజీకి వెళ్లి వస్తున్నాడు. బీరంగూడలోని సృజనలక్ష్మి కాలనీలో ఉండే శ్రీజ(19), శ్రవణ్‌సాయి పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం వేర్వేరు చోట్ల చదువుతున్నా వారి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉంది. శ్రవణ్‌ ఓసీ వర్గానికి చెందిన యువకుడు కాగా, అతనికి సుమారు 20 ఎకరాల భూమి ఉంది. బీసీ వర్గానికి చెందిన శ్రీజ తల్లిదండ్రులకు వీరి ప్రేమ నచ్చలేదు. దీంతో పలుమార్లు శ్రవణ్‌ని హెచ్చరించారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు. ఇలాగైతే వారిని విడదీయడం సాధ్యం కాదనుకున్న శ్రీజ తల్లిదండ్రులు పథకం ప్రకారం.. పెళ్లి చేస్తామంటూ వారిని కొంత కాలంగా నమ్మించడం ప్రారంభించారు. పెళ్లి విషయం మాట్లాడుకుందామని, ఒంటరిగా రావాలని శ్రవణ్‌ని పిలిచారు. మంగళవారం సాయంత్రం అతను బీరంగూడలోని శ్రీజ ఇంటికి వచ్చాడు. శ్రవణ్‌ లోపలికి రాగానే తలుపులు పెట్టి, అప్పటికే సిద్ధంగా ఉన్న తల్లిదండ్రులు, వారి బంధువులు మూకుమ్మడిగా దాడికి దిగారు. శ్రీజ తండ్రి ప్రసాద్‌, తల్లి సిరి క్రికెట్‌ బ్యాటుతో శ్రవణ్‌ తలపై మోదడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం తెల్లవారు జామున అతన్ని కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడని వైద్యులు తేల్చారు. పథకం ప్రకారమే శ్రవణ్‌ని హత్య చేశారని అతని పెదనాన్న ఆరోపించారు. గతంలోనే శ్రవణ్‌ను హత్య చేస్తామని ప్రసాద్‌ బెదిరించాడన్నారు. తెల్లవార్లూ శ్రవణ్‌ను చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారని చెప్పారు. ‘ఆ అమ్మాయే తరచూ కాలేజీ వద్దకు వెళ్లి నన్ను పెళ్లి చేసుకో.. మా ఇంటికి వచ్చి మాట్లాడు’ అని శ్రవణ్‌ను బతిమిలాడేదని వెంటేశ్వరరావు తెలిపారు. శ్రీజ కుటుంబసభ్యులందరూ కలిసి శ్రవణ్‌ను హతమార్చారంటూ అమీన్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ వ్యహారంలో తలెత్తిన వివాదంతోనే యువకుడి హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 11 , 2025 | 03:58 AM