Share News

Engineering Seat Allocation: నాలుగేళ్ల స్థానికతతోనే ముందుకు

ABN , Publish Date - Aug 15 , 2025 | 04:49 AM

ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపుపై ఉన్నత విద్యాశాఖ స్థానికత విషయంలో ఈ ఏడాది విడుదల చేసిన జీవో ఆధారంగానే ...

Engineering Seat Allocation: నాలుగేళ్ల స్థానికతతోనే ముందుకు

  • ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు పూర్తి

  • తుది విడతలో 14,409 మందికి..మొత్తంగా 1.20 లక్షల సీట్లు భర్తీ

అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపుపై ఉన్నత విద్యాశాఖ స్థానికత విషయంలో ఈ ఏడాది విడుదల చేసిన జీవో ఆధారంగానే నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో తుది విడత సీట్లు కేటాయింపు ప్రక్రియను సాంకేతిక విద్యాశాఖ గురువారం పూర్తి చేసింది. తుది విడతలో కొత్తగా 2,645 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మొదటి విడతలోనే దరఖాస్తు చేసుకున్నా సీటు లభించని వారికి కలిపి మొత్తంగా 14,409 మందికి సీట్లు కేటాయించారు. అర్హత పరీక్షలకు ముందు నాలుగేళ్లలో ఒక్క ఏడాదైనా బయటి రాష్ర్టాల్లో చదివితే.. ఆ విద్యార్థులను స్థానికేతరులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జీవో ఇచ్చింది. అంటే ఇంజనీరింగ్‌, మెడిసిన్‌లో చేరాలంటే అంతకుముందు ఇంటర్మీడియట్‌, పది, తొమ్మిది తరగతులు కచ్చితంగా రాష్ట్రంలోనే చదివి ఉండాలి. అందులో ఒక్క ఏడాదైనా బయట చదివితే, రాష్ట్రంలో పదేళ్లు నివసించినట్లు సర్టిఫికెట్‌ పొందాలి. అది ఉన్న వారికి స్థానికేతరుల కోటాలో సీట్లు కేటాయిస్తారు. అందుకు అనుగుణంగానే ఉన్నత విద్యాశాఖ వైద్య విద్య, ఇంజనీరింగ్‌ సీట్ల కౌన్సెలింగ్‌ ప్రారంభించింది. అయితే ఈ నిబంధన కారణంగా తాము స్థానిక కోటా కోల్పోతున్నామని పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం విద్యార్థుల పిటిషన్లను తోసిపుచ్చింది. కోర్టు విచారణ కారణంగా ఇంజనీరింగ్‌ తుది విడత సీట్ల కేటాయింపు ఇప్పటివరకూ ఆగింది.

కన్వీనర్‌ కోటాలో మిగిలిన 34,298 సీట్లు

తొలి విడతలో 1.18 లక్షల మందికి సీట్లు కేటాయించగా, సుమారు 13 వేల మంది కాలేజీల్లో చేరలేదు. మొత్తంగా రెండు విడతల్లో కలిపి 1,19,666 సీట్లు భర్తీ అయ్యాయి. 28,735 మంది కాలేజీలు, కోర్సులు మార్చుకున్నారు. కన్వీనర్‌ కోటా కింద 1,53,964 సీట్లు అందుబాటులో ఉండగా.. 34,298 మిగిలిపోయాయి. యూనివర్సిటీ కాలేజీల్లో 1,361, ప్రైవేటు కాలేజీల్లో 31,811, ప్రైవేటు యూనివర్సిటీల్లో 1,126 సీట్లు మిగిలాయి. ఈనెల 20లోగా విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలని సాంకేతిక విద్యాశాఖ స్పష్టం చేసింది. 18వ తేదీ నుంచి తరగతులకు హాజరు కావొచ్చని తెలిపింది.

Updated Date - Aug 15 , 2025 | 04:49 AM