Share News

Engineering Admissions: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ అయోమయం

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:08 AM

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ అంతా అయోమయంగా మారింది. ఓవైపు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌కు సాంకేతిక విద్యా శాఖ షెడ్యూలు ప్రకటించగా.. ఇంతవరకూ ఫీజులపై నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది

Engineering Admissions: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ అయోమయం

  • ఫీజులు తేలలేదు.. అఫిలియేషన్లూ పూర్తికాలేదు

  • సీట్ల మంజూరు జీవోలూ ఇవ్వని ఉన్నత విద్యా శాఖ

  • షెడ్యూలు ప్రకారం ఎల్లుండి నుంచే ఆప్షన్ల ప్రక్రియ

  • ఆలస్యం కావడంతో 13వ తేదీకి వాయిదా

  • ఆప్షన్ల ఎంపికకు 9కి బదులు 6 రోజులే గడువు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ అంతా అయోమయంగా మారింది. ఓవైపు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌కు సాంకేతిక విద్యా శాఖ షెడ్యూలు ప్రకటించగా.. ఇంతవరకూ ఫీజులపై నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మరో విచిత్రం ఏంటంటే... ఏఐసీటీఈ మంజూరు చేసిన ఇంజనీరింగ్‌ సీట్లను ఆమోదిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఇంతవరకూ జీవోలు జారీ చేయలేదు. విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకునే సమయానికి ఈ మూడు ప్రక్రియలు పూర్తికావాలి. ఏ కాలేజీలో ఏ కోర్సు ఫీజు ఎంత? అనేది విద్యార్థులకు తెలియాలి. కాలేజీల్లో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనే జీవోలు విడుదల చేయాలి. 2025-26 విద్యా సంవత్సరానికి కాలేజీలకు అఫిలియేషన్లూ మంజూరు కావాలి. జేఎన్‌టీయూ అనంతపురంలో ఆదివారం, జేఎన్‌టీయూ కాకినాడలో సోమవారం అఫిలియేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఆలస్యం ఫలితంగా ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌లో ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం ఈ నెల 10 నుంచి 18 వరకు విద్యార్థులకు ఆప్షన్ల ఎంపిక గడువు ఉంది. ఇప్పుడు దానిని ఈ నెల 13 నుంచి 18 వరకు వాయిదా వేశారు. దీంతో విద్యార్థులకు ఆప్షన్ల ఎంపికకు గడువు తగ్గింది. తొలుత ప్రకటించిన తేదీల ప్రకారం తొమ్మిది రోజులు అవకాశం ఇస్తే, ఇప్పుడు దానిని ఆరు రోజులకు కుదించారు.


ఫీజులపై నాన్చుడు ధోరణి

ఇంజనీరింగ్‌ అడ్మిషన్లలో ఫీజులు కీలకం. 2024-25లో కనీస ఫీజు రూ.40 వేలు, గరిష్ఠ ఫీజు రూ.1.05 లక్షలుగా ఖరారు చేశారు. ఉన్నత విద్య కమిషన్‌ సిఫారసుల మేరకు ఈ ఫీజులు నిర్ణయించారు. అయితే ఈ ఫీజులపై కాలేజీల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కోర్టు ఆదేశాలతోనే ఫీజులను అమలు చేయాలని గతేడాది నిర్ణయం తీసుకున్నారు. గతేడాది న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఏడాది కూడా పాత ఫీజులే కొనసాగించే అవకాశం ఉంది. అయితే దీనిపై ఉన్నత విద్యా శాఖ ఇంతవరకూ ఎటూ తేల్చలేదు. మరోవైపు కౌన్సెలింగ్‌ సమీపిస్తోంది. ఆప్షన్ల ప్రారంభ సమయానికి ఏ కాలేజీలో ఎంత ఫీజు అనేది విద్యార్థులకు వెబ్‌సైట్‌లో కనిపించాలి. వాటి ఆధారంగానే విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకుంటారు.

అందరికీ సీట్లు

ఈ ఏడాది రాష్ర్టానికి 2 లక్షలకు పైగా ఇంజనీరింగ్‌ సీట్లను ఏఐసీటీఈ మంజూ రు చేసింది. ఇంజనీరింగ్‌ విభాగంలో 1,89,748 మంది ఈఏపీసెట్‌లో అర్హత సాధించారు. వారిలోనూ కొందరు డిగ్రీ, ఇతరత్రా కోర్సుల వైపు వెళ్తూ ఉంటారు. దీంతో కన్వీనర్‌ కోటాలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ సీట్లు దక్కుతాయి. కాగా లక్షకు పైగా సీట్లు కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచ్‌లోనే అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల్లో ఎక్కువ మంది సీఎస్ఈ సీట్లే కావాలని కోరుకుంటున్నారు. ఆ తర్వాత ఈసీఈకి ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఇంకా రాష్ట్రంలో నాలు గు డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిటీల్లోనూ మేనేజ్‌మెంట్‌ కోటా లో సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Updated Date - Jul 08 , 2025 | 04:08 AM